Fact Check : భారత సైన్యం ఆధునికీకరణకు విరాళాలు.. నిజమేనా ?
వాట్సాప్‌లో సర్క్యులేట్ అవుతున్న ఫేక్ మెసేజ్‌లో.. ‘‘హీరో అక్షయ్‌కుమార్(Fact Check) సూచన మేరకు కేంద్ర ప్రభుత్వం ముఖ్య నిర్ణయం తీసుకుంది.
- Author : Pasha
Date : 28-04-2025 - 3:01 IST
Published By : Hashtagu Telugu Desk
Fact Check : జనం జేబుకు చిల్లుపెట్టేందుకు ఉన్న ఏ ఒక్క అవకాశాన్నీ సైబర్ కేటుగాళ్లు వదలడం లేదు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ – పాక్ మధ్య ఏర్పడిన సైనిక ఉద్రిక్తతలను కూడా సొమ్ము చేసుకునేందుకు కొందరు మోసగాళ్లు యత్నిస్తున్నారు. ఈక్రమంలో వాళ్లు ఓ కట్టుకథను అల్లారు. దాని ఆధారంగా ఒక మెసేజ్‌ను తయారు చేయించి వాట్సాప్‌లో, ఇతరత్రా సోషల్ మీడియాలలో వైరల్ చేయిస్తున్నారు. దాన్ని నిజమేనని నమ్మి ఎవరైనా డబ్బులిస్తే మోసపోయినట్టే. ఇంతకీ ఆ వ్యవహారం వివరాలేంటో చూద్దాం..
Also Read :Rapido Food Delivery : ‘ర్యాపిడో’ ఫుడ్ డెలివరీ.. కొత్త బిజినెస్‌లోకి ఎంట్రీ
వాట్సాప్‌లో సర్క్యులేట్ అవుతున్న ఫేక్ మెసేజ్
వాట్సాప్‌లో సర్క్యులేట్ అవుతున్న ఫేక్ మెసేజ్‌లో.. ‘‘హీరో అక్షయ్‌కుమార్(Fact Check) సూచన మేరకు కేంద్ర ప్రభుత్వం ముఖ్య నిర్ణయం తీసుకుంది. భారత సైన్యం ఆధునికీకరణ కోసం ప్రత్యేక బ్యాంకు ఖాతాను తెరిచింది. దీనికి మీ వంతుగా ఒక్క రూపాయి అయినా విరాళం ఇవ్వొచ్చు. మీకు వీలైనంత సాయం చేయొచ్చు. మనం పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా మాట్లాడితే సరిపోదు. మన ఆర్మీని స్వయంగా బలోపేతం చేసుకోవాలి. ప్రత్యేక బ్యాంకు ఖాతాకు విరాళాలు ఇస్తేనే అది సాధ్యమవుతుంది’’ అని ఉంది. ఈ ఫేక్ సందేశాన్ని సైబర్ కేటుగాళ్లు వైరల్ చేయిస్తున్నారు. దీంతో చాలా వాట్సాప్ గ్రూపుల్లోకి ఆ మెసేజ్ చేరిపోయింది. ఈ మెసేజ్‌లో సైబర్ కేటుగాళ్ల బ్యాంకకు అకౌంట్ నంబర్, ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్ కూడా ఉన్నాయి.
Also Read :Pahalgam Attack : లష్కరే ఉగ్రవాదితో బంగ్లా ప్రభుత్వ పెద్ద భేటీ.. మరో స్కెచ్ ?
రక్షణ శాఖ క్లారిటీ
ఈ ప్రచారాన్ని భారత రక్షణ శాఖ ఖండించింది. తాము భారత ఆర్మీ కోసం ఎలాంటి బ్యాంకు ఖాతాను తెరవలేదని క్లారిటీ ఇచ్చింది.
పీఐబీ ఫ్యాక్ట్ చెకింగ్ విభాగం సైతం..
కేంద్ర ప్రభుత్వానికి చెందిన ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) ఫ్యాక్ట్ చెకింగ్ విభాగం కూడా ఈ అంశాన్ని తనిఖీ చేసింది. ఈ మెసేజ్‌లో ఉన్న వివరాలన్నీ ఫేక్ అని పేర్కొంటూ ఎక్స్ వేదికగా పీఐబీ ఫ్యాక్ట్ చెకింగ్ విభాగం ఒక పోస్ట్ పెట్టింది.
గతంలో AFBCWF ఏర్పాటు
యుద్ధంలో మరణించిన, గాయపడిన భద్రతా బలగాల కుటుంబాలకు సాయాన్ని అందించేందుకు గతంలో ఆర్మ్‌డ్ ఫోర్సెస్ బ్యాటిల్ క్యాజువాలిటీ వెల్ఫేర్ ఫండ్ (AFBCWF)ను ఏర్పాటుచేసిన విషయాన్ని పీఐబీ ఫ్యాక్ట్ చెకింగ్ విభాగం గుర్తుచేసింది. సైన్యం ఆధునికీకరణ కోసం మాత్రం ఎలాంటి బ్యాంక్ ఖాతా తెరవలేదని వెల్లడించింది. ఇది సైబర్ నేరగాళ్ల పనే అని తేల్చి చెప్పింది.