Arjita Seva: టిటిడి ఆన్‌లైన్‌లో ఆర్జిత సేవా టికెట్ల కోటా విడుదల చేయనుంది
తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించి మార్చి, ఏప్రిల్, మే నెలల కోటాను
- By Vamsi Chowdary Korata Published Date - 06:30 AM, Wed - 22 February 23

కలియుగ వైకుంఠనాథుడు కొలువైయున్న శ్రీ వేంకటేశ్వర స్వామి వారి క్షణకాలం పాటు జరిగే దర్శన భాగ్యం కోసం కోట్లాది మంది భక్తులు పరితపించి పోతుంటారు. దేశ విదేశాల నుంచి ఎన్నో వ్యయ ప్రాయాసలకు ఓర్చి తిరుమల పుణ్యక్షేత్రంకు చేరుకుని శ్రీనివాసుడి దివ్య మంగళ స్వరూపంను దర్శించి పునీతులు అవుతుంటారు. అయితే భక్తుల సౌకర్యం టీటీడీ వివిధ రూపాల్లో భక్తులకు స్వామి వారి దర్శన భాగ్యం కల్పిస్తూ వస్తుంది. ప్రతి నెల ఆన్లైన్ ద్వారా దర్శన టికెట్ల కోటాను విడుదల చేసి భక్తులకు స్వామి వారి దర్శన భాగ్యంకు దగ్గర చేస్తుంది టిటిడి. ఈ క్రమంలోనే తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా (Arjita Seva) టికెట్లకు సంబంధించి మార్చి, ఏప్రిల్, మే నెలల కోటాను ఫిబ్రవరి 22న సాయంత్రం 4 గంటలకు టిటిడి ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. వీటిలో కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలు టోకెన్ల కోటాను విడుదల చేయనుంది. అదేవిధంగా, మార్చి, ఏప్రిల్, మే నెలలకు సంబంధించిన మిగతా ఆర్జితసేవా (Arjita Seva) టికెట్లకు ఆన్‌లైన్ లక్కీడిప్ నమోదు ప్రక్రియ ఫిబ్రవరి 22న ఉదయం 10 గంటల నుండి ఫిబ్రవరి 24న ఉదయం 10 గంటల వరకు ఉంటుంది. లక్కీడిప్ లో టికెట్లు పొందిన వారు సొమ్ము చెల్లించి ఖరారు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ విషయాన్ని భక్తులు గమనించి శ్రీవారి ఆర్జిత సేవలను బుక్ చేసుకోవాలని టిటిడి విజ్ఞప్తి చేస్తుంది.
తిరుమల కొండపై భక్తుల రద్దీ సాధారణ స్థితికి చేరుకుంది. ప్రతి సోమవారం నిర్వహించే చతుర్దశ కలశ విశేష పూజను టిటిడి రద్దు చేసింది. విగ్రహాల పరిరక్షణలో భాగంగా ఆగమ సలహాదారుల సూచనల మేరకు టిటిడి నిర్ణయం తీసుకుంది. ఆదివారం రోజున 79,555 మంది స్వామి వారి దర్శించుకున్నారు. 21,504 మంది స్వామి వారికి తలనీలాలు సమర్పించగా, 4.44 కోట్ల రూపాయలు భక్తులు హుండీ స్వామి వారికి ద్వారా కానుకలుగా సమర్పించారు. ఇక వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో 01 కంపార్ట్మెంట్ లో భక్తులు వేచి ఉన్నారు. దీంతో స్వామి వారి సర్వదర్శనంకు 06 గంటల సమయం పడుతుంది. ఇక ప్రత్యేక ప్రవేశ దర్శనంకు మూడు గంటల సమయం పడుతుంది.
శ్రీవారి ఆలయంలో వైఖానస ఆగమ శాస్త్రం ప్రకారం శ్రీ వేంకటేశ్వరుడికి కైంకర్యాలు నిర్వహిస్తున్నారు అర్చకులు. ఇందులో భాగంగా సోమవారం ప్రత్యూషకాల ఆరాధనతో ఆలయ ద్వారముకు తెరిచిన అర్చకులు. బంగారు వాకిలి వద్ద శ్రీ వేంకటేశ్వర సుప్రభాత స్త్రోతంతో స్వామి వారిని మేలు కొలిపారు. అనంతరం తోమాల, అర్చన సేవలు నిర్వహించిన అర్చకులు. ప్రాతఃకాల ఆరాధనలో భాగంగా స్నపన మండపంలో శ్రీకొలువు శ్రీనివాసమూర్తిని వారి సమక్షంలో దర్భార్ నిర్వహించారు. శ్రీవారికి పంచాంగ శ్రవణం,హుండీ జనాకర్షణ విన్నవించి, బెల్లంతో కలిపిన నువ్వుల పిండిమి స్వామి వారిని నైవేద్యంగా సమర్పించారు. నవనీత హారతి సమర్పించి అనంతరం శ్రీనివాసమూర్తిని తిరిగి సన్నిధిలో వేంచేపు చేసారు. ప్రాతఃకాల ఆరాధనలో భాగంగా మొదటి ఘంటా నివేదనలో అన్నప్రసాదం, లడ్డూ, వడలు స్వామి వారికి నైవేద్యంగా సమర్పించారు.
Also Read: Ayurveda Tips: ఎసిడిటీ, కడుపు ఉబ్బరం ప్రాబ్లమ్స్ కు 3 ఆయుర్వేద చికిత్సలు