Vontimitta: వటపత్రశాయి అలంకారంలో కోదండరాముని వైభవం
- By Balu J Published Date - 12:11 AM, Sat - 20 April 24

Vontimitta: ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడో రోజు శుక్రవారం ఉదయం వటపత్రశాయి అలంకారంలో స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం 8 గంటల నుండి స్వామివారి ఊరేగింపు వైభవంగా జరిగింది. భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి ఊరేగింపు కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.
పురాణాల ప్రకారం.. జలప్రళయం సంభవించినపుడు శ్రీమహావిష్ణువు మర్రి ఆకుపై తేలియాడుతూ చిన్న శిశువుగా దర్శనమిస్తారు. కుడికాలి బొటనవేలిని నోటిలో పెట్టుకుని ఆస్వాదిస్తుంటారు. ఈ ఘట్టాన్ని గుర్తుచేస్తూ శ్రీమహావిష్ణువు అవతారమైన శ్రీరాముడు భక్తులకు కనువిందు చేశారు. భక్తుల కష్టాలను కడతేర్చేందుకు ఎప్పుడూ ముందుంటానని స్వామివారు ఈ అలంకారం ద్వారా తెలియజేస్తున్నారు. వటపత్రశాయి మహిమను అన్నమయ్య తన సంకీర్తనల్లో చక్కగా వర్ణించారు.