భక్తులకు శుభవార్త.. బాసర తరహాలో తిరుపతిలో అక్షర గోవిందం పథకం
- Author : Vamsi Chowdary Korata
Date : 13-03-2026 - 10:03 IST
Published By : Hashtagu Telugu Desk
చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని చేసిన విజ్ఞప్తి మేరకు, హిందూ ధర్మ ప్రచార పరిషత్ (హెచ్డీపీపీ) ఈ ‘అక్షర గోవిందం’ ప్రాజెక్టును రూపొందించింది. మూడు నుంచి ఐదేళ్లలోపు చిన్నారులకు ఇక్కడ అక్షరాభ్యాసం చేయించవచ్చు. అయితే, వకుళమాత ప్రధాన ఆలయం ఒక చిన్న కొండపై ఉండటంతో భక్తులు, ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధుల సౌలభ్యం కోసం టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ఆలయానికి తూర్పు వైపున పుష్కరిణి సమీపంలో ఉన్న ఖాళీ స్థలాన్ని ఈ కార్యక్రమం కోసం ఎంపిక చేశారు. ఇక్కడ శాశ్వత ప్రాతిపదికన ఒక ప్రత్యేక మండపాన్ని నిర్మించాలని నిర్ణయించారు.
ఈ నూతన మండపంలో శ్రీ వేంకటేశ్వరస్వామి, శ్రీ పద్మావతి అమ్మవారు, శ్రీ సరస్వతీదేవి విగ్రహాలను ప్రతిష్ఠిస్తారు. ఇక్కడే చిన్నారులకు శాస్త్రోక్తంగా అక్షరాభ్యాసం నిర్వహిస్తారు. కార్యక్రమం పూర్తయిన తర్వాత, పిల్లలకు ‘అక్షర గోవిందం’ పేరుతో ఏడు రకాల వస్తువులతో కూడిన ఒక ప్రత్యేక కిట్‌ను అందజేస్తారు. ఇందులో పలక, బలపాల పెట్టె, శ్రీవారి అక్షతలు, అమ్మవారి కుంకుమ, వినాయకుడు-సరస్వతి-శ్రీవేంకటేశ్వరస్వామి చిత్రపటం, కంకణాలు, పటికబెల్లం ప్రసాదం ఉంటాయి.
తొలుత ఈ కార్యక్రమాన్ని 300 కిట్లతో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించనున్నారు. ఈ కిట్లను ఉచితంగా అందించాలా? లేక నామమాత్రపు రుసుము వసూలు చేయాలా? అనే విషయంపై టీటీడీ త్వరలో స్పష్టత ఇవ్వనుంది. హెచ్డీపీపీ లేదా ఎస్వీ విద్యాదాన ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్టును అమలు చేయాలని అధికారులు భావిస్తున్నారు. త్వరలోనే ఈ కార్యక్రమం ప్రారంభం కానుండటంతో భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.