ఆమె వచ్చాకే నాన్న ఇలా మారిపోయాడు.. నరేశ్- పవిత్రల పై కొడుకు నవీన్ షాకింగ్ కామెంట్స్..
- Author : Vamsi Chowdary Korata
Date : 23-02-2026 - 11:24 IST
Published By : Hashtagu Telugu Desk
Naresh Pavitra Lokesh సీనియర్ నటుడు నరేశ్, పవిత్ర లోకేశ్ బంధంపై ఆయన కుమారుడు విజయ్ కృష్ణ సానుకూలంగా స్పందించారు. తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పవిత్ర మంచి మనసున్న వ్యక్తి అని, తండ్రికి ఆమె సరైన జోడీ అని అన్నారు. పవిత్ర వచ్చిన తర్వాత నరేశ్ మరింత ప్రశాంతంగా, సంతోషంగా ఉన్నారని వెల్లడించారు. కుటుంబ పెద్దలు కూడా ఈ సంబంధాన్ని గౌరవించారని చెప్పారు. ప్రేమకు హద్దులు లేవని వారి బంధం చూపిస్తోందని అభిప్రాయపడ్డారు.
తెలుగు సినీ పరిశ్రమలో సుదీర్ఘ కాలంగా తనదైన ముద్ర వేసుకున్న సీనియర్ నటుడు నరేశ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా కొనసాగుతున్నారు. హీరోగా కెరీర్ ప్రారంభించిన ఆయన కాలానుగుణంగా తన పాత్రలను మార్చుకుంటూ సహాయక నటుడిగా కొత్త ఇన్నింగ్స్‌లో చెలరేగిపోతున్నారు. కామెడీ టైమింగ్, సహజ నటనతో బ్యాక్ టు బ్యాక్ విజయాలు అందుకుంటున్నారు. ఇటీవల సంక్రాంతి సందర్భంగా విడుదలైన ‘నారీ నారీ నడుమ మురారీ’ చిత్రంతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన నరేశ్, తాజాగా ‘హే బలవంత్’ సినిమాతో మరోసారి తెరపై సందడి చేశారు. గత శుక్రవారం విడుదలైన ఈ చిత్రం డీసెంట్ టాక్‌తో ముందుకు సాగుతోంది.
సినిమాలతో పాటు నరేశ్ వ్యక్తిగత జీవితం కూడా తరచూ వార్తల్లో నిలుస్తోంది. సీనియర్ నటి పవిత్రతో ఆయన అనుబంధం గత కొంతకాలంగా ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. ఇద్దరూ కలిసి ‘మళ్లీ పెళ్లి’ సినిమాలో భార్యాభర్తలుగా నటించగా, రియల్ లైఫ్‌లోనూ కలిసి జీవిస్తున్నారు. సినిమా ఈవెంట్లు, ఫంక్షన్లు, వ్యక్తిగత కార్యక్రమాలకు వీరిద్దరూ జంటగా హాజరవుతూ ఎప్పటికప్పుడు హాట్‌టాపిక్‌గా మారుతుంటారు. ఈ నేపథ్యంలో నరేశ్ కుమారుడు, నటుడు నవీన్ విజయ్ కృష్ణ తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. నటుల జీవితం బయటకు కనిపించినంత సులువు కాదని, బాధలు, ఒత్తిడులు వచ్చినా చాలామంది నటులు బయటకు చెప్పుకోరని, ఒంటరిగా ఉండగానే ఆ భావోద్వేగాలను బయటపెడతారని చెప్పారు.
పవిత్ర గురించి మాట్లాడుతూ ఆమె ఎంతో మంచి మనసున్న వ్యక్తి, అందరితో ప్రేమగా మెలుగుతుందని, తాను కూడా తరచూ మాట్లాడుతుంటానని నవీన్ తెలిపారు. తన తండ్రికి పవిత్ర సరైన జోడీ అని, పవిత్రతో ఉన్నప్పుడు నరేశ్ మరింత ప్రశాంతంగా కనిపిస్తారని పేర్కొన్నారు. 50 ప్లస్ యసులో కూడా తన తండ్రి ఇంత సైలెంట్‌గా, హ్యాపీగా ఉండటానికి పవిత్రే ప్రధాన కారణమని అన్నారు. ప్రేమకు వయస్సు లేదా హద్దులు లేవనడానికి వారి బంధమే ఉదాహరణ అని వ్యాఖ్యానించారు. పవిత్ర ఇంటికి వచ్చిన తర్వాత కుటుంబంలో ఒక పాజిటివ్ ఎనర్జీ పెరిగిందని, తండ్రి సంతోషంగా ఉండటం తనకు ఎంతో ఆనందంగా ఉందని చెప్పారు.
కుటుంబ పెద్దలు ఈ బంధాన్ని అంగీకరించారా అనే ప్రశ్నకు స్పందిస్తూ… తాత కృష్ణ, నానమ్మ ఇద్దరూ నరేశ్ తీసుకునే నిర్ణయాలకు ఎప్పుడూ మద్దతు ఇచ్చేవారని, కుటుంబ సభ్యులు కూడా ఆయన వ్యక్తిగత నిర్ణయాన్ని గౌరవిస్తారని స్పష్టం చేశారు. తండ్రి పని తీరు గురించి మాట్లాడుతూ, ఒకేసారి అనేక పనులను సమర్థంగా పూర్తి చేసే మల్టీటాలెంటెడ్ వ్యక్తి నరేశ్ అని, ఎమోషన్స్‌ని నియంత్రించుకుంటూ పనిచేసే విధానం తనకెంతో ఇష్టమని చెప్పారు.
నవీన్ విజయ్ కృష్ణ విషయానికి వస్తే, గతంలో ‘నందిని నర్సింగ్ హోమ్’, ‘ఊరంతా అనుకుంటున్నారు’ వంటి చిత్రాల్లో హీరోగా నటించారు. అలాగే ‘సత్య’ అనే షార్ట్ ఫిల్మ్‌కు దర్శకత్వం వహించారు. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్నారు. తండ్రి సంతోషమే తనకు ముఖ్యమని నవీన్ చెప్పిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.