TDP vs YSRCP : డీఎస్సీపై లోకేష్ సవాల్‌కు సమాధానం చెప్పే ధైర్యం జగన్‌కు ఉందా..?
- Author : Prasad
Date : 19-06-2026 - 1:35 IST
Published By : Hashtagu Telugu Desk
డీఎస్సీ ఉపాధ్యాయ నియామక పరీక్షలు పూర్తిగా పారదర్శకంగా నిర్వహించినప్పటికీ, నిరుద్యోగ యువతలో గందరగోళం సృష్టించడమే లక్ష్యంగా వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి, ఆయన పార్టీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి విమర్శించారు. డీఎస్సీ నియామకాలపై అవినీతి జరిగిందని ఆరోపిస్తున్న వైసీపీ నేతలు, ఎక్కడ తప్పు జరిగిందో ఆధారాలతో నిరూపించాలని సవాల్ విసిరారు. విద్యాశాఖ, క్రీడాశాఖ అధికారుల సమక్షంలో బహిరంగ చర్చకు రావాలని పలుమార్లు పిలిచినా వైసీపీ నేతలు ముందుకు రావడం లేదని అన్నారు.
డీఎస్సీ ఉద్యోగాలను రూ.10 లక్షలు, రూ.15 లక్షలకు అమ్ముకున్నారని ఆరోపిస్తున్న వైసీపీ, ఒక్క అభ్యర్థి అయినా డబ్బులు ఇచ్చినట్లు నిరూపించగలదా అని ప్రశ్నించారు. మెరిట్ ఆధారంగానే నియామకాలు జరిగాయని, వైసీపీకి చెందిన వందలాది మంది అభ్యర్థులు కూడా ఉద్యోగాలు సాధించారని తెలిపారు. గతంలో విద్యాశాఖ మంత్రిగా ఉన్న బొత్స సత్యనారాయణ ఉపాధ్యాయుల బదిలీల పేరిట రూ.50 కోట్ల వరకు వసూలు చేశారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ఆత్మవిశ్వాసం నింపుతుంటే, వైసీపీ మాత్రం విషప్రచారం చేస్తోందని మండిపడ్డారు.
డీఎస్సీపై చర్చకు జగన్ సిద్ధమైతే, ఆంధ్రప్రదేశ్‌లోనే కాకుండా ఢిల్లీ లేదా ముంబైలో అయినా మంత్రి నారా లోకేష్ చర్చకు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. నిజాలు ప్రజల ముందుకు రావాలని, వైసీపీ ఆరోపణలకు ఆధారాలు ఉంటే నిరూపించాలని సవాల్ చేశారు. అసెంబ్లీలోనైనా, అధికారుల సమక్షంలోనైనా, మీడియా ముందు అయినా చర్చకు టీడీపీ సిద్ధంగా ఉందని, కానీ వైసీపీ మాత్రం చర్చ నుంచి తప్పించుకుంటోందని భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి విమర్శించారు.