Dileep Raj: కన్నడ నటుడు, నిర్మాత దిలీప్ రాజ్ గుండెపోటుతో మృతి
- Author : Vamsi Chowdary Korata
Date : 13-05-2026 - 11:45 IST
Published By : Hashtagu Telugu Desk
కన్నడ చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నటుడు, నిర్మాత దిలీప్ రాజ్ (47) ఇవాళ తెల్లవారుజామున గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. ఆయన ఆకస్మిక మృతితో శాండల్‌వుడ్ శోకసంద్రంలో మునిగిపోయింది.
కుటుంబ సభ్యులు తెలిపిన ప్రకారం దిలీప్ రాజ్‌కు తీవ్రమైన గుండెపోటు రావడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే పరిస్థితి విషమించడంతో వైద్యులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఆయనను బతికించలేకపోయామని వైద్యులు ప్రకటించారు.
పునీత్ రాజ్‌కుమార్‌తో కలిసి నటించిన ‘మిలనా’ (2007) చిత్రంతో దిలీప్ రాజ్ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత ‘యూ-టర్న్’, ‘బాయ్‌ఫ్రెండ్’ వంటి అనేక చిత్రాల్లో ముఖ్య పాత్రలు పోషించి మెప్పించారు. వెండితెరపైనే కాకుండా బుల్లితెరపైనా ఆయన తనదైన ముద్ర వేశారు. జీ కన్నడలో ప్రసారమైన ప్రముఖ సీరియల్ ‘హిట్లర్ కళ్యాణ’లో ప్రధాన పాత్రలో నటించి కన్నడ ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు.
నటనపై ఆసక్తితో దిలీప్ రాజ్ తొలుత రంగస్థలంపై తన ప్రయాణాన్ని ప్రారంభించారు. నటరంగా, దృష్టి వంటి ప్రముఖ థియేటర్ గ్రూపులతో కలిసి పనిచేశారు. ఈ క్రమంలోనే ఆయనకు నటి నందిత ప్రోత్సాహంతో టెలివిజన్ రంగంలోకి అడుగుపెట్టారు. ‘కంబద మనే’ అనే టెలిఫిల్మ్తో ఆయన కెమెరా ముందుకొచ్చారు. ఆ తర్వాత ‘జనని’, ‘అర్ధ సత్య’, ‘కుంకుమ భాగ్య’, ‘మంగళ్య’ వంటి ఎన్నో విజయవంతమైన సీరియళ్ల ద్వారా కన్నడలో ఇంటింటికీ సుపరిచితమయ్యారు.
నటుడిగానే కాకుండా తన డీఆర్ క్రియేషన్స్ పతాకంపై కొన్ని టీవీ సీరియళ్లను కూడా నిర్మించారు. ఆయనలో ఒక మంచి డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా ఉన్నారు. ‘ఆ దినగళు’ చిత్రంలో నటుడు చేతన్ కుమార్‌కు ఆయన చెప్పిన డబ్బింగ్ మంచి ప్రశంసలు అందుకుంది. తన కెరీర్లో 24కు పైగా చిత్రాల్లో నటించిన దిలీప్, సినిమా, టీవీ రంగాల్లో బిజీగా ఉన్నప్పటికీ రంగస్థలాన్ని మాత్రం విడిచిపెట్టలేదు. విలక్షణమైన, సహజమైన పాత్రలతో బుల్లితెరపై అత్యంత నమ్మకమైన నటులలో ఒకరిగా పేరు తెచ్చుకున్న దిలీప్ రాజ్ మరణం కన్నడ పరిశ్రమకు తీరని లోటు.