బాలీవుడ్ తన ఆత్మను కోల్పోయింది: ప్రకాశ్ రాజ్ షాకింగ్ కామెంట్స్
- Author : Vamsi Chowdary Korata
Date : 26-01-2026 - 12:27 IST
Published By : Hashtagu Telugu Desk
Prakash Raj దక్షిణాది నుంచి ఉత్తరాది వరకు అన్ని భాషల్లో విభిన్నమైన పాత్రలతో తనదైన ముద్ర వేసుకున్న నటుడు ప్రకాశ్ రాజ్. కేవలం నటుడిగానే కాకుండా, సమాజంలో జరుగుతున్న పరిణామాలపై తన అభిప్రాయాలను నిస్సంకోచంగా వెల్లడించే వ్యక్తిగా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. తాజాగా హిందీ చిత్ర పరిశ్రమపై (బాలీవుడ్) ఆయన చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చకు దారి తీస్తున్నాయి.
- బాలీవుడ్ సినిమాలను ప్లాస్టిక్ విగ్రహాలతో పోల్చిన వైనం
- బాలీవుడ్ మూలాలను కోల్పోయిందన్న ప్రకాశ్ రాజ్
- హిందీ సినిమాల్లో కథ, భావోద్వేగాలు లేవని విమర్శ
కేరళలోని కోజికోడ్‌లో నిర్వహించిన కేరళ లిటరేచర్ ఫెస్టివల్లో పాల్గొన్న ప్రకాశ్ రాజ్… బాలీవుడ్ ప్రస్తుతం తన అసలైన మూలాలను కోల్పోయిందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పైకి చూడటానికి హిందీ సినిమాలు చాలా రంగులమయంగా, భారీ సెట్లు, గ్లామర్‌తో కనిపిస్తున్నాయని, కానీ లోపల మాత్రం వాటికి ఆత్మ లేదని ఆయన అభిప్రాయపడ్డారు.
బాలీవుడ్ సినిమాలను ఆయన మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలోని ప్లాస్టిక్ విగ్రహాలతో పోల్చడం విశేషం. చూడటానికి ఆకర్షణీయంగా ఉన్నా, వాటిలో జీవం ఉండదని చెప్పారు. మల్టీప్లెక్స్ సంస్కృతి పెరిగిన తర్వాత హిందీ సినిమా పరిశ్రమ కథలు, భావోద్వేగాలను పక్కన పెట్టి కేవలం లగ్జరీ లుక్స్, భారీ బడ్జెట్లు, మార్కెటింగ్, డబ్బు చుట్టూనే తిరుగుతోందని ఆయన విమర్శించారు.
అదే సమయంలో దక్షిణాది సినిమా పరిశ్రమను ప్రకాశ్ రాజ్ ప్రశంసలతో ముంచెత్తారు. ముఖ్యంగా తమిళ, మలయాళ సినిమాలు మట్టి వాసన కలిగిన కథలను, సామాన్యుల జీవితాలను, అట్టడుగు వర్గాల సమస్యలను ఎంతో సహజంగా తెరపై చూపిస్తున్నాయని కొనియాడారు. దళితుల వేదన, సామాజిక అసమానతలు వంటి అంశాలను నిజాయతీగా చెప్పే ప్రయత్నం అక్కడి దర్శకులు చేస్తున్నారని చెప్పారు.
‘మన వేర్లు మన కథల్లో ఉండాలి. ప్రాంతీయతను వదిలేసి కేవలం గ్లామర్ వెంటే పరిగెత్తితే ప్రేక్షకులు దూరమవుతారు’ అని ప్రకాశ్ రాజ్ వ్యాఖ్యానించారు. దక్షిణాదిలో వచ్చిన ‘జై భీమ్’, ‘మామన్నన్’ వంటి చిత్రాలు సమాజంలో మార్పు తీసుకురావాలని ప్రయత్నిస్తుంటే, బాలీవుడ్ మాత్రం ఇంకా కమర్షియల్ హంగులకే పరిమితమైందని ఆయన అభిప్రాయపడ్డారు.