మీ క్రెడిట్ కార్డ్ వాడకం మీ లోన్ అర్హతను దెబ్బతీస్తోందా?
క్రెడిట్ కార్డు ఉపయోగించి ఏటీఎం నుండి నగదు తీయడం అనేది మీ క్రెడిట్ ప్రొఫైల్‌ను పూర్తిగా దెబ్బతీస్తుంది. ఇలా నగదు తీసేవారికి లోన్ ఇవ్వడానికి బ్యాంకులు విముఖత చూపుతాయి. ఒకవేళ ఇచ్చినా, చాలా ఎక్కువ వడ్డీ రేట్లు వసూలు చేస్తాయి.
- Author : Gopichand
Date : 28-12-2025 - 3:51 IST
Published By : Hashtagu Telugu Desk
Credit Card: మీ ఆదాయం ఎక్కువగా ఉంటేనే లోన్ సులభంగా వస్తుందని మీరు అనుకుంటున్నారా? అయితే మీరు పొరబడినట్లే. మీ లోన్ అర్హత కేవలం మీ జీతం మీద మాత్రమే కాదు గతంలో మీరు అప్పులు ఎలా తీర్చారు (డిఫాల్ట్ చేశారా లేదా) అనే దానిపై కూడా ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా మీరు క్రెడిట్ కార్డ్ వాడుతున్నట్లయితే మీరు చేసే ప్రతి లావాదేవీని బ్యాంకులు నిశితంగా గమనిస్తాయి. మీ క్రెడిట్ కార్డ్ ప్రవర్తనను బట్టి మీరు డబ్బును ఎంత బాధ్యతాయుతంగా నిర్వహిస్తున్నారో లెండర్లు (అప్పు ఇచ్చేవారు) అంచనా వేస్తారు.
క్రెడిట్ కార్డ్ విషయంలో ఈ తప్పులు చేయకండి
క్రెడిట్ వినియోగం
మీరు క్రెడిట్ కార్డుతో ఏమి కొంటున్నారనేది బ్యాంకులకు ముఖ్యం కాదు. కానీ మీకున్న లిమిట్‌లో ఎంత వాడుతున్నారనేది చాలా ముఖ్యం. ఉదాహరణకు మీ కార్డ్ లిమిట్ 2 లక్షల రూపాయలు ఉండి మీరు ప్రతి నెలా 1.4 – 1.6 లక్షలు (70-80%) ఖర్చు చేస్తుంటే మీరు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారని బ్యాంకులు భావిస్తాయి. మీరు బిల్లులు సకాలంలో చెల్లించినప్పటికీ ఎక్కువ శాతం వాడకం మీపై ఉన్న ఆర్థిక ఒత్తిడిని సూచిస్తుంది. ఆదర్శవంతంగా మీ క్రెడిట్ లిమిట్‌లో 30-40% లోపు మాత్రమే వాడటం మంచిది.
అతిగా వాడటం
ప్రతి చిన్న ఖర్చుకు క్రెడిట్ కార్డుపైనే ఆధారపడితే, మీరు రోజువారీ అవసరాలకు కూడా అప్పుపైనే బతుకుతున్నారని బ్యాంకులు అనుమానిస్తాయి. అప్పుడప్పుడు మాత్రమే కార్డును ఉపయోగించే వారిపై బ్యాంకర్లకు నమ్మకం ఎక్కువగా ఉంటుంది.
Also Read: టెస్ట్ కోచ్‌గా గౌతమ్ గంభీర్ ఔట్?!
కనీస బకాయి చెల్లింపు
బిల్లు మొత్తం చెల్లించకుండా కేవలం ‘మినిమం డ్యూ’ మాత్రమే చెల్లించడం ఒక చెడ్డ అలవాటుగా పరిగణించబడుతుంది. మీ వద్ద నగదు కొరత ఉందని, భవిష్యత్తులో మీరు EMIలు సరిగ్గా కట్టలేరని బ్యాంకులు భావిస్తాయి. దీనివల్ల మీకు వచ్చే లోన్ మొత్తం తగ్గిపోయే అవకాశం ఉంది.
బిల్లు ఎప్పుడు చెల్లిస్తున్నారు?
బిల్లు కట్టడం మాత్రమే కాదు? ఎప్పుడు కడుతున్నారనేది కూడా ముఖ్యమే. స్టేట్‌మెంట్ జనరేట్ అయిన తర్వాత డ్యూ డేట్ కంటే ముందు కట్టినప్పటికీ.. స్టేట్‌మెంట్ వచ్చే సమయానికి మీ కార్డుపై బ్యాలెన్స్ ఎక్కువగా ఉంటే, అది క్రెడిట్ బ్యూరోలకు రిపోర్ట్ అవుతుంది. దీనివల్ల మీరు క్రమం తప్పకుండా చెల్లిస్తున్నా మీ క్రెడిట్ స్కోర్ తగ్గే అవకాశం ఉంది. బిల్లు జనరేట్ కావడానికి ముందే కొంత మొత్తం చెల్లించడం వల్ల మీ ప్రొఫైల్ మెరుగ్గా కనిపిస్తుంది.
నగదు విత్ డ్రా
క్రెడిట్ కార్డు ఉపయోగించి ఏటీఎం నుండి నగదు తీయడం అనేది మీ క్రెడిట్ ప్రొఫైల్‌ను పూర్తిగా దెబ్బతీస్తుంది. ఇలా నగదు తీసేవారికి లోన్ ఇవ్వడానికి బ్యాంకులు విముఖత చూపుతాయి. ఒకవేళ ఇచ్చినా, చాలా ఎక్కువ వడ్డీ రేట్లు వసూలు చేస్తాయి.