యూపీఐ ద్వారా పీఎఫ్ డబ్బు విత్ డ్రా.. ఎలాగంటే?
గతంలో ఆటో-సెటిల్‌మెంట్ కింద రూ. 1 లక్ష వరకు మాత్రమే విత్ డ్రా చేసుకునే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు ఆ పరిమితిని రూ. 5 లక్షలకు పెంచారు.
- Author : Gopichand
Date : 18-01-2026 - 9:05 IST
Published By : Hashtagu Telugu Desk
EPF Money Via UPI: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) తన లక్షలాది మంది సభ్యుల కోసం ఒక భారీ సదుపాయాన్ని ప్రకటించింది. ఏప్రిల్ 2026 నుండి EPFO సభ్యులు తమ ప్రావిడెంట్ ఫండ్‌లోని కొంత భాగాన్ని నేరుగా UPI ద్వారా విత్ డ్రా చేసుకోవచ్చు. ఆ నగదు తక్షణమే వారి బ్యాంక్ ఖాతాల్లో జమ అవుతుంది. విత్ డ్రాయల్ ప్రక్రియను మరింత వేగంగా, సులభతరం చేయడానికి ఈ మార్పును తీసుకువస్తున్నారు.
కొత్త వ్యవస్థ ఎలా పనిచేస్తుంది?
ఈ కొత్త విధానం ప్రకారం.. సభ్యులు తమ UPI పిన్‌ను ఉపయోగించి పీఎఫ్ (PF) నిధులను సురక్షితంగా విత్ డ్రా చేసుకోవచ్చు. పీఎఫ్ ఖాతాలో ఒక నిర్దిష్ట కనీస మొత్తాన్ని (Minimum Amount) అలాగే ఉంచి మిగిలిన మొత్తాన్ని నేరుగా బ్యాంక్ ఖాతాకు బదిలీ చేస్తారు. ఖాతాలోకి డబ్బు వచ్చిన తర్వాత ఆ మొత్తాన్ని డిజిటల్ పేమెంట్స్, ATM లేదా డెబిట్ కార్డుల ద్వారా వాడుకోవచ్చు.
Also Read: పెట్రోల్ కార్ల కంటే డీజిల్ కార్లు మంచి మైలేజీని ఇస్తాయా?
ఈ కొత్త వ్యవస్థ ఎందుకు అవసరం?
ప్రస్తుతం పీఎఫ్ నుండి డబ్బు తీసుకోవాలంటే క్లెయిమ్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. ఆటో-సెటిల్‌మెంట్ సిస్టమ్‌లో కూడా డబ్బు రావడానికి సుమారు మూడు రోజుల సమయం పడుతుంది. ప్రతి ఏటా EPFO సుమారు 50 మిలియన్లకు పైగా క్లెయిమ్‌లను అందుకుంటుంది. వీటిలో ఎక్కువ శాతం పీఎఫ్ విత్ డ్రాయల్స్ కు సంబంధించినవే. ఈ పని భారాన్ని తగ్గించేందుకు ఈ కొత్త వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నారు.
విత్ డ్రాయల్ పరిమితి పెంపు
గతంలో ఆటో-సెటిల్‌మెంట్ కింద రూ. 1 లక్ష వరకు మాత్రమే విత్ డ్రా చేసుకునే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు ఆ పరిమితిని రూ. 5 లక్షలకు పెంచారు. దీనివల్ల అనారోగ్యం, విద్య, వివాహం లేదా ఇల్లు కొనుగోలు వంటి అవసరాల కోసం మూడు రోజుల్లోనే ఆర్థిక సహాయం అందుతుంది. సమాచారం ప్రకారం.. EPFO వద్ద బ్యాంకింగ్ లైసెన్స్ లేదు. కాబట్టి నేరుగా ఖాతాల నుండి విత్ డ్రాయల్స్ కు అనుమతించదు. అయినప్పటికీ EPFO సేవలు బ్యాంకులతో సమానంగా సులభంగా, వేగంగా ఉండాలని ప్రభుత్వం భావిస్తోంది.