కార్లలో క్రూయిజ్ కంట్రోల్ ఫీచర్.. సౌకర్యవంతమే, కానీ జాగ్రత్తలు తప్పనిసరి!
క్రూయిజ్ కంట్రోల్ అనేది ఒక ఆటోమేటిక్ ఫీచర్. దీని ద్వారా కారు మనం సెట్ చేసిన ఒక నిర్దిష్ట వేగంతో నిరంతరం ప్రయాణిస్తుంది.
- Author : Gopichand
Date : 05-02-2026 - 10:01 IST
Published By : Hashtagu Telugu Desk
Cruise Control: ప్రస్తుతం మార్కెట్లోకి వస్తున్న కొత్త కార్లు కేవలం లుక్స్‌లోనే కాకుండా ఫీచర్ల పరంగా కూడా చాలా అడ్వాన్స్‌డ్‌గా ఉంటున్నాయి. అటువంటి ఫీచర్లలో ఒకటి ‘క్రూయిజ్ కంట్రోల్’. ఇది సుదీర్ఘ ప్రయాణాలను సులభతరం, సౌకర్యవంతంగా చేస్తుంది. అయితే ఈ ఫీచర్ ఎంత సౌకర్యవంతంగా ఉంటుందో, సరిగ్గా ఉపయోగించకపోతే అంత ప్రమాదకరంగా కూడా మారుతుంది. చాలా మంది డ్రైవర్లు దీనిని ఆన్ చేస్తారు కానీ ఎప్పుడు? ఎక్కడ ఉపయోగించాలో తెలియదు. దీనివల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. అసలు క్రూయిజ్ కంట్రోల్ అంటే ఏమిటి? దీనిని ఎలా వాడాలి? ఎక్కడ వాడకూడదో సులభంగా అర్థం చేసుకుందాం.
క్రూయిజ్ కంట్రోల్ అంటే ఏమిటి? ఎందుకు ప్రత్యేకం?
క్రూయిజ్ కంట్రోల్ అనేది ఒక ఆటోమేటిక్ ఫీచర్. దీని ద్వారా కారు మనం సెట్ చేసిన ఒక నిర్దిష్ట వేగంతో నిరంతరం ప్రయాణిస్తుంది. దీనిని ఆన్ చేసిన తర్వాత డ్రైవర్ ఎక్సిలరేటర్ పై కాలు ఉంచాల్సిన అవసరం లేదు. దీనివల్ల లాంగ్ డ్రైవ్స్‌లో అలసట తగ్గుతుంది. హైవేలపై ప్రయాణం ప్రశాంతంగా సాగుతుంది. అందుకే ఈ రోజుల్లో ఈ ఫీచర్‌కు ఆదరణ పెరుగుతోంది.
Also Read: చిగుళ్ల నుండి రక్తం వస్తుంటే ఆందోళన వద్దు.. ఈ చిట్కాలతో ఉపశమనం పొందండి!
ఈ ప్రదేశాల్లో క్రూయిజ్ కంట్రోల్ వాడకండి
క్రూయిజ్ కంట్రోల్‌ను ఎప్పుడూ తెలివిగా ఉపయోగించాలి.
భారీ ట్రాఫిక్: ట్రాఫిక్ ఎక్కువగా ఉన్నప్పుడు దీనిని అస్సలు ఆన్ చేయకూడదు.
వర్షం లేదా తడి రోడ్లు: వర్షం పడుతున్నప్పుడు లేదా రోడ్లు తడిగా ఉన్నప్పుడు క్రూయిజ్ కంట్రోల్ వాడటం ప్రమాదకరం.
మెలికలు తిరిగే రోడ్లు: కొండ ప్రాంతాలు, ఇరుకైన రోడ్లపై దీనిని ఉపయోగించకూడదు. ఎందుకంటే అక్కడ వేగాన్ని మాటిమాటికీ మార్చాల్సి ఉంటుంది.
హైవేపై సరైన వినియోగం ఎలా?
- హైవేపై ట్రాఫిక్ తక్కువగా ఉన్నప్పుడు మాత్రమే క్రూయిజ్ కంట్రోల్‌ని ఉపయోగించండి.
- మొదట ఎక్సిలరేటర్ సాయంతో కారును ఒక సురక్షితమైన వేగానికి తీసుకువెళ్లండి.
- కారు సరైన వేగంలో ఉన్నప్పుడు క్రూయిజ్ కంట్రోల్ బటన్‌ను ఆన్ చేయండి.
- ఇప్పుడు కారు అదే వేగంతో ప్రయాణిస్తుంది. మీరు పదేపదే ఎక్సిలరేటర్ తొక్కాల్సిన అవసరం ఉండదు.
క్రూయిజ్ కంట్రోల్ ఆఫ్ చేయడం చాలా సులభం
ఈ ఫీచర్‌ను ఆపడం చాలా సులభం. మీ కారు ముందుకు అకస్మాత్తుగా ఏదైనా వాహనం వస్తే మీరు ఒక్కసారి క్లచ్ నొక్కితే చాలు, క్రూయిజ్ కంట్రోల్ వెంటనే ఆగిపోతుంది. అలాగే బ్రేక్ వేసినా కూడా ఈ ఫీచర్ వెంటనే డిసేబుల్ అవుతుంది. అవసరమైతే మళ్లీ నిర్ణీత వేగానికి చేరుకున్నాక దీనిని ఆన్ చేసుకోవచ్చు.