GST On Old Cars : పాత కార్ల సేల్స్‌పై ఇక నుంచి జీఎస్టీ ఎలా విధిస్తారంటే..
దాని విలువను మినహాయించగా మిగిలిన కారు విలువ, దాని విక్రయ ధర(GST On Old Cars) మధ్య ఉండే తేడా విలువపై జీఎస్టీని చెల్లించాలి.
- By Pasha Published Date - 10:01 AM, Wed - 25 December 24

GST On Old Cars : పాత కార్లపైనా వస్తు సేవల పన్ను(జీఎస్టీ) పెరిగింది. ఇంతకుముందు వీటిపై 12 శాతం జీఎస్టీ వేసేవారు. తాజాగా రాజస్థాన్‌లోని జైపూర్‌లో జరిగిన జీఎస్‌టీ కౌన్సిల్ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. పాత కార్లతో పాటు యూజ్డ్ కార్ల విక్రయాలపై జీఎస్టీని 12 శాతం నుంచి 18 శాతానికి పెంచారు. సెకండ్ హ్యాండ్ ఎలక్ట్రిక్ వెహికల్స్‌పైనా జీఎస్టీని అదే రేటు ప్రకారం పెంచారు. అయితేే జీఎస్టీ రిజిస్ట్రేషన్ చేసుకోని వ్యక్తుల మధ్య పాత కార్లు, యూజ్డ్ కార్ల క్రయవిక్రయాలకు జీఎస్టీ వర్తించదు. జీఎస్టీ కింద నమోదైన సంస్థ లేదా వ్యక్తి ఆదాయపు పన్ను చట్టం 1961 సెక్షన్ 32 కింద కారు తరుగుదల (డిప్రిసియేషన్) విలువను క్లెయిమ్ చేసుకుంటే.. దాని విలువను మినహాయించగా మిగిలిన కారు విలువ, దాని విక్రయ ధర(GST On Old Cars) మధ్య ఉండే తేడా విలువపై జీఎస్టీని చెల్లించాలి.
Also Read :Tsunami Boy : సునామీ బాయ్ ఎవరు ? బేబీ81 కథ ఏమిటి ?
- జీఎస్టీ కింద రిజిస్టర్ అయిన సంస్థ లేదా వ్యక్తి ఒక పాత కారును రూ.10 లక్షలకు విక్రయించారని భావిద్దాం. ఆ కారు వాస్తవ కొనుగోలు ధర రూ.20 లక్షలు. ఆ కారును వినియోగించి కొన్నేళ్లు గడిచినందున తరుగుదల కారణంగా దాని ధరను రూ.8 లక్షల మేర తగ్గించినట్లు లెక్కల్లో చూపించారు. ఇలా చేస్తే జీఎస్‌టీ చెల్లించాల్సిన అవసరం ఉండదు. రూ.8 లక్షల తరుగుదల మొత్తాన్ని తీసేస్తే.. కారును రూ.12 లక్షలకు అమ్మేయొచ్చు. అయినప్పటికీ అంతకంటే రూ. 2లక్షలు తక్కువ రేటుకు (రూ.10 లక్షలకు) కారును విక్రయించిన కారణంగా జీఎస్టీ ఛార్జీలు పడవు.
- ఒకవేళ ఇదే పాత కారును రూ.15 లక్షలకు అమ్మితే.. లెక్కలు మారుతాయి. రూ.20 లక్షల ధర కలిగిన కారులో నుంచి రూ.8 లక్షల తరుగుదల మొత్తాన్ని తీసేస్తే.. రూ.12 లక్షలకు అమ్మొచ్చు. ఈ రేటు కంటే ఎక్కువ ధరకు పాత కారును అమ్మారనుకుందాం. తరుగుదల అనంతరం ఖరారైన కారు విలువ (రూ.12 లక్షల) కంటే ఎక్కువ రేటుకు (రూ.15 లక్షలకు) కారును అమ్మితే జీఎస్టీ కట్టాల్సిందే. తరుగుదల అనంతరం ఖరారైన రేటు (రూ.12 లక్షలు), విక్రయించిన రేటు (రూ.15 లక్షలు) మధ్య ఉండే వ్యత్యాసం రూ.3 లక్షలు. ఈ మూడు లక్షల రూపాయలపై 18 శాతం జీఎస్టీని కట్టాలి.
- ఒకవేళ కారు కొనుగోలు ధర రూ.20 లక్షలు ఉండి.. దాని విక్రయ ధర రూ.22 లక్షలుగా ఉంటే.. ఈ రెండింటి మధ్యనున్న రూ.2 లక్షల తేడాపై 18 శాతం జీఎస్‌టీ కట్టాలి.