YS Jagans Helicopter: హెలికాప్టర్ డ్యామేజ్.. రోడ్డు మార్గంలో బెంగళూరుకు జగన్.. ఏమైంది ?
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు(YS Jagans Helicopter) షాకింగ్ అనుభవం ఎదురైంది.
- By Pasha Published Date - 04:57 PM, Tue - 8 April 25

YS Jagans Helicopter: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు(YS Jagans Helicopter) షాకింగ్ అనుభవం ఎదురైంది. పాపిరెడ్డిపల్లిలో హత్యకు గురైన కురుబ లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు ఆయన ప్రత్యేక హెలికాప్టర్‌లో బెంగళూరు నుంచి శ్రీసత్యసాయి జిల్లా రాప్తాడుకు వెళ్లారు. పరామర్శ అనంతరం.. ఆయన అదే హెలికాప్టర్‌లో బెంగళూరుకు వెళ్లాల్సి ఉంది. అయితే జగన్ రాక వేళ రాప్తాడుకు భారీగా వైఎస్సార్ సీపీ అభిమానులు వచ్చారు. జగన్ పాపిరెడ్డిపల్లికి వెళ్లి లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించి, తిరిగొచ్చే సమయానికి హెలికాప్టర్ డ్యామేజ్ అయింది. దీంతో అందులో ప్రయాణానికి పైలట్లు తిరస్కరించారు. దీంతో రోడ్డు మార్గంలో జగన్ బెంగళూరుకు బయలుదేరి వెళ్లారు.
Also Read :Patel Vs RSS : ఆర్ఎస్ఎస్‌తో పటేల్‌కు సంబంధమేంటి.. హైజాక్ పాలిటిక్స్‌పై ఖర్గే భగ్గు
ఏపీలో ఉన్నామా? బిహార్‌లో ఉన్నామా? : జగన్
‘‘చంద్రబాబుకు గులాంగిరీ చేస్తున్న పోలీసులను మేం అధికారంలోకి వచ్చిన తరువాత ఉద్యోగంలో నుంచి తొలగిస్తాం. చట్టానికి అతీతంగా వ్యవహరిస్తున్న వారికి వడ్డీతో సహా చెల్లిస్తాం’’ అంటూ ఈసందర్భంగా వైఎస్ జగన్ ధ్వజమెత్తారు. ‘‘ఏపీలో ఉన్నామా? బిహార్‌లో ఉన్నామా? రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన నడుస్తోంది. లా అండ్ ఆర్డర్ దిగజారింది. స్థానిక సంస్థల్లో బలం లేకపోయినా అన్ని పదవులు తనకే కావాలని ముఖ్యమంత్రి ఆరాటపడుతున్నారు” అని జగన్ మండిపడ్డారు.
సరైన పోలీసు భద్రత లేకపోవడం వల్లే.. : లేళ్ల అప్పిరెడ్డి
సరైన పోలీసు భద్రత లేకపోవడం వల్లే.. జగన్ తిరిగొచ్చే సమయానికి హెలికాప్టర్ డ్యామేజ్ అయిందని వైఎస్సార్ సీపీ నేతలు ఆరోపించారు. ‘‘వైఎస్సార్ సీపీ అభిమానుల ముసుగులో అసాంఘిక శక్తులు జగన్ హెలికాప్టర్ విండ్ షీల్డ్‌ను ధ్వంసం చేసి ఉండొచ్చు. మా పార్టీ కార్యకర్తల ముసుగులో ప్రత్యర్ధి పార్టీ వాళ్లే ఈ పనిచేసి ఉంటారనే అనుమానం ఉంది. జగన్ భద్రతపై రాష్ట్రప్రభుత్వం ప్రత్యేక బాధ్యత తీసుకోవాలి. మాజీ ముఖ్యమంత్రికి భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది’’ అని వైఎస్సార్ సీపీ నేత లేళ్ల అప్పిరెడ్డి ఆరోపించారు.