Praja Darbar : పులివెందులలో వైఎస్ జగన్ ప్రజాదర్బార్
స్థానిక సమస్యలపై జనం ఎక్కువగా ఫిర్యాదులు చేసినట్లు తెలుస్తోంది. దీంతో పులివెందుల వీధులు కిక్కిరిసిపోయాయి.
- By Latha Suma Published Date - 12:55 PM, Thu - 26 December 24

Praja Darbar : వైఎస్‌ఆర్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ క్రిస్మస్ వేడుకల కోసం పులివెందులకు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన పులివెందులలోని తన క్యాంపు కార్యాలయంలో ఈరోజు ఆయన ప్రజాదర్బార్ నిర్వహిస్తున్నారు. ఈ మేరకు జగన్ స్థానికుల నుంచి చాలా కాలం తర్వాత ఫిర్యాదుల్ని స్వీకరించారు. దీంతో జనం కూడా జగన్ ను కలిసేందుకు భారీగా తరలివచ్చారు. క్రిస్మస్ పండుగ జరుపుకునేందుకు సొంత జిల్లాకు వెళ్లిన జగన్.. అందులో భాగంగా నేతలతో ఇప్పటికే భేటీలు నిర్వహించారు.
ప్రభుత్వం మారాక పులివెందులలో పరిస్ధితులపై వారు ఫిర్యాదులు చేస్తున్నట్లు సమాచారం. స్థానిక సమస్యలపై జనం ఎక్కువగా ఫిర్యాదులు చేసినట్లు తెలుస్తోంది. దీంతో పులివెందుల వీధులు కిక్కిరిసిపోయాయి. వైఎస్‌ఆర్ జిల్లాతో పాటు రాయలసీమలోని ఇతర జిల్లాల నుంచి కూడా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ప్రజాదర్బార్ కు తరలివచ్చారు. దీంతో జగన్ కూడా వారి నుంచి వినతులు స్వీకరించారు. ఓపిగ్గా వారు చెబుతున్న సమస్యలు వింటున్నారు.
రాష్ట్రంలో సీఎంగా ఉండగా తీరిక లేని షెడ్యూల్స్ తో పులివెందులలో ప్రజా దర్బార్ నిర్వహించలేక తన సోదరుడు, ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డితో ఏర్పాటు చేయించేవారు. జనం కూడా జగన్ కు చెప్పుకోవాల్సిన విషయాలు అవినాష్ కు చెప్పుకునే వారు. అధికారం కోల్పోయాక జగన్ ప్రస్తుతం నేరుగా జనంతో భేటీ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. కాగా, వినతుల స్వీకరణ అనంతరం జగన్ మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది. పులివెందుల నుంచి జగన్ రేపు బెంగళూరుకు తిరుగుపయనం కానున్నారు.
Read Also: Business Lookback 2024 : దేశం గర్వించే పారిశ్రామిక దిగ్గజాలు.. 2024లో మనకు దూరమైన వేళ..