Joseph Ravan Remand Report: యూట్యూబర్ రావణ్‌కు మరోసారి రిమాండ్ పొడిగింపు
- Author : Vamsi Chowdary Korata
Date : 18-07-2026 - 5:49 IST
Published By : Hashtagu Telugu Desk
వివాదాస్పద సోషల్ మీడియా పోస్టులు, దేశద్రోహం కేసులో అరెస్ట్ అయిన ప్రశ్న రావణ్ అలియాస్ బచ్చలకూరి జోసెఫ్ జ్యుడీషియల్ రిమాండ్‌ను గన్నవరం న్యాయస్థానం మరో 14 రోజుల పాటు పొడిగించింది. ప్రస్తుతం నెల్లూరు జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న జోసెఫ్ గడువు ముగియడంతో, జైలు అధికారులు అతడిని వర్చువల్ విధానంలో న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టారు. కేసు తీవ్రతను పరిశీలించిన కోర్టు, రిమాండ్‌ను పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
కేసు వివరాల్లోకి వెళితే… సమాజంలోని పలువురు ప్రముఖుల వ్యక్తిగత ప్రతిష్ఠకు భంగం కలిగించేలా అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం, ఆ వీడియోలను సోషల్ మీడియా వేదికగా వైరల్ చేయడంతో జోసెఫ్‌పై గతంలోనే పోలీసులు చట్టపరమైన చర్యలు తీసుకున్నారు. అయితే, ఈ అరెస్ట్ అనంతరం అతడి వ్యక్తిగత మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకుని పరిశీలించగా, మరికొన్ని షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి.
ప్రభుత్వ నిషేధిత గ్రూపులైన మావోయిస్టుల సిద్ధాంతాలను సమర్థిస్తూ రావణ్ ప్రత్యేకంగా వీడియోలు రూపొందించినట్లు పోలీసులు గుర్తించారు. ఈ డిజిటల్ ఆధారాలతో కేసు తీవ్రత పూర్తిగా మారిపోయింది. దేశ సార్వభౌమాధికారానికి విఘాతం కలిగించేలా వ్యవహరించినందుకు గానూ అతడిపై దేశద్రోహం కేసుతో పాటు, అత్యంత కఠినమైన చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (UAPA) కింద అదనపు సెక్షన్లను నమోదు చేసి విచారణను వేగవంతం చేశారు.