CM Chandrababu : వైసీపీ తప్పుడు ప్రచారాలపై నిర్లక్ష్యం ఎందుకు? .. మంత్రుల పై సీఎం చంద్రబాబు ఆగ్రహం
ఇటీవల ఓ మహిళా ఎమ్మెల్యేపై వైసీపీ నేతలు చేసిన అసభ్య వ్యాఖ్యలపై మంత్రుల మౌనం ఏంటని ప్రశ్నించారు. పార్టీపై, వ్యక్తులపై జరిగిన ఈ తరహా దూషణలపై వెంటనే స్పందించాల్సిందిగా స్పష్టం చేశారు. రాజకీయాల్లో ఇప్పుడు సబ్జెక్టుపై కాకుండా వ్యక్తిత్వ హననాలపై దాడులు జరుగుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
- By Latha Suma Published Date - 07:00 AM, Thu - 10 July 25

CM Chandrababu : ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం అనంతరం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక రాజకీయ అంశాలపై మంత్రులతో తీవ్రమైన చర్చ జరిపారు. ముఖ్యంగా వైఎస్సార్సీపీ చేస్తున్న తప్పుడు ప్రచారాలపై మంత్రులు ఎందుకు స్పందించట్లేదని, తక్షణ కౌంటర్ ఇవ్వడంలో ఎందుకు అలసత్వం చూపుతున్నారని ప్రశ్నించారు. సమావేశంలో చంద్రబాబు ఆగ్రహంగా స్పందిస్తూ.. ఇటీవల ఓ మహిళా ఎమ్మెల్యేపై వైసీపీ నేతలు చేసిన అసభ్య వ్యాఖ్యలపై మంత్రుల మౌనం ఏంటని ప్రశ్నించారు. పార్టీపై, వ్యక్తులపై జరిగిన ఈ తరహా దూషణలపై వెంటనే స్పందించాల్సిందిగా స్పష్టం చేశారు. రాజకీయాల్లో ఇప్పుడు సబ్జెక్టుపై కాకుండా వ్యక్తిత్వ హననాలపై దాడులు జరుగుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
Read Also: Youtube New Rules : ఇకపై ఎలాపడితే ఆలా వీడియోస్ అప్లోడ్ చేస్తే అంతే సంగతి !!
మంత్రులు సమయానుకూలంగా స్పందించకపోవడం పార్టీకి నష్టం చేస్తుందని పేర్కొంటూ ఇప్పటి రాజకీయాల్లో ఆగమాగం పనికిరాదు. 1995లో నేను ఎలా ఉండేను, మళ్లీ అలానే ఉంటాను. కౌంటర్లు ఇవ్వలేని మంత్రులకు పదవుల గ్యారంటీ లేదు అని హెచ్చరించారు. ప్రజలలో తప్పుడు ప్రచారాలను దూరం చేయాలంటే మంత్రులే ముందుగా నిజాలు చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పారు. పలువురు మంత్రుల ప్రవర్తనపై చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేస్తూ, వారిలో కొంతమంది నేతలు పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ తమ బాధ్యతలను పక్కదోవ పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు చెప్పినా కొంతమంది మంత్రులు మారడం లేదు. ప్రోటోకాల్ పాటించడంలోనూ, కార్యకర్తలతో సమన్వయం లేకపోవడంలోనూ గణనీయమైన లోపాలు ఉన్నాయి అని విమర్శించారు.
ప్రభుత్వంలో ఉన్న మంత్రులు పార్టీ కార్యకర్తలకూ, నియోజకవర్గ నాయకులకూ గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత ఉందని స్పష్టం చేశారు. ప్రోటోకాల్ పాటించకపోవడం వల్ల ప్రభుత్వానికి భిన్న సంకేతాలు వెళ్తున్నాయని పేర్కొన్నారు. మంత్రుల పనితీరుపై ఇప్పటికే పలు సందర్భాల్లో తన అసంతృప్తిని వ్యక్తం చేశానని గుర్తు చేశారు. ఇక, మరో కీలక అంశంగా, పెట్టుబడులపై వైసీపీ చేస్తున్న కుట్రలను ఫోకస్ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందిస్తూ, వైసీపీ మద్దతుదారులు దేశీయ, అంతర్జాతీయ సంస్థలకు దుష్ప్రచారం చేసే విధంగా సుమారు 200 ఫేక్ ఈమెయిల్స్ పంపించారని చెప్పారు. ఈ విషయం ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ కేబినెట్ దృష్టికి తీసుకురాగా, చంద్రబాబు దీనిపై వెంటనే విచారణ ఆదేశించారు.
ఈ ఈమెయిల్స్ జర్మనీలో ఉండే వైసీపీ సానుభూతిపరుడు ఉదయ్ భాస్కర్ అనే వ్యక్తి పంపించినట్లు గుర్తించామని చెప్పారు. పెట్టుబడుల మీద భయాందోళనలు సృష్టించి రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవాలన్న కుట్ర వైసీపీదని ఆయన ఆరోపించారు. ఈ మొత్తం వ్యవహారం ద్వారా రాష్ట్రంపై కుట్రలు జరుగుతున్నాయని, ప్రజలకు నిజాలను చెప్పాలనే బాధ్యత ప్రభుత్వానికి ఉందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. అవాస్తవాల మధ్య ప్రభుత్వాన్ని నిలబెట్టడం కష్టమైన పని. మంత్రులు ఇకపై ప్రతి విషయంలో స్పందనతో ఉండాలి. మీడియా ఎదుట నిజాలు వెల్లడి చేయాలి. ప్రజలు అసత్యాల వలలో పడకుండా జాగ్రత్త పడాలి అని అన్నారు. కాగా, సీఎం చంద్రబాబు ఈసారి రాజకీయంగా గట్టిగా ముందుకు సాగేందుకు సన్నద్ధమవుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ప్రభుత్వంలో నిర్లక్ష్యం, అలసత్వం కనబరచే మంత్రులకు ఇక ఉపశమనం ఉండదని ఈ భేటీ ద్వారా ఆయన స్పష్టంగా సంకేతాలు ఇచ్చారు.
Read Also: AP Cabinet : ఏపీకి పెట్టుబడులు రాకుండా చేస్తున్నవారిపై కేసులు