AP Cabinet : ఏపీకి పెట్టుబడులు రాకుండా చేస్తున్నవారిపై కేసులు
AP Cabinet : ఈ ఈమెయిల్స్‌లో ప్రభుత్వ విధానాలను తప్పుడు పద్ధతిలో చూపించి, పెట్టుబడిదారుల్లో భయం, గందరగోళం సృష్టించేందుకు ప్రయత్నించారని ఆరోపించారు.
- By Sudheer Published Date - 07:45 PM, Wed - 9 July 25

ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులను అడ్డుకునే కుట్రలు జరుగుతున్నాయని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఏపీ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (APMDC) ద్వారా రూ.9,000 కోట్ల నాన్-కన్వర్టిబుల్ డిబెంచర్లు (NCDs) జారీ చేయడానికి ప్రభుత్వం ప్రయత్నించిన సమయంలో, దానికి అడ్డుపడేలా దాదాపు 200 ఫేక్ ఈమెయిల్స్‌ను విప్రోలో పని చేస్తున్న జర్మనీకి చెందిన వైసీపీ అనుకూలుడు ఉదయ్ భాస్కర్ పంపినట్లు వెల్లడించారు. ఈ ఈమెయిల్స్‌లో ప్రభుత్వ విధానాలను తప్పుడు పద్ధతిలో చూపించి, పెట్టుబడిదారుల్లో భయం, గందరగోళం సృష్టించేందుకు ప్రయత్నించారని ఆరోపించారు.
ఈ కుట్రలో వైసీపీ ప్రముఖులు కూడా భాగమయ్యారని ఆరోపణలు వచ్చాయి. వైసీపీ రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి, లేళ్ల అప్పిరెడ్డి వంటి నేతలు ఈ పెట్టుబడులపై ఫిర్యాదులు చేయడం, పిల్‌లు వేయడం వంటి చర్యలు చేపట్టారని తెలిపారు. ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వానికి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI), సెబీకి తప్పుడు సమాచారం పంపి రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేశారని పేర్కొన్నారు. గతంలో వైసీపీ ప్రభుత్వం కూడా రూ.7,000 కోట్ల రుణాలను తీసుకునేందుకు జీవో ఇచ్చినా, పెట్టుబడిదారుల నమ్మకాభావం వల్ల రాకపోయాయని గుర్తు చేశారు.
ఈ విషయాన్ని ఏపీ కేబినెట్ దృష్టికి తీసుకెళ్లిన పయ్యావుల కేశవ్, బాధ్యులపై దేశద్రోహం కేసులు పెట్టాలని సీఎం చంద్రబాబును కోరారు. దీనిపై స్పందించిన చంద్రబాబు, రాష్ట్రంపై కుట్రలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ప్రజలకు ఈ కుట్రల గురించి స్పష్టమైన సమాచారం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. అయినా అన్ని అవరోధాలను అధిగమించి RBI, సెబీ నుంచి అనుమతులు వచ్చాయని, పెట్టుబడిదారులు విశ్వాసంతో ముందుకొచ్చి ఓవర్-సబ్‌స్క్రిప్షన్ జరిగినట్లు మంత్రి వివరించారు. రాష్ట్ర అభివృద్ధి ప్రయాణాన్ని అడ్డుకోవాలని చేసే ప్రయత్నాలను ప్రభుత్వం తిప్పికొడుతుందని స్పష్టం చేశారు.