Minister Savitha: బీసీ యువతకు ఉద్యోగాలే లక్ష్యం: మంత్రి సవిత
విజయవాడలోని బీసీ స్టడీ సర్కిల్ ద్వారా 83 మందికి సివిల్ సర్వీసెస్ కోచింగ్ ఇవ్వగా వీరిలో పలువురు గ్రూప్ 2, ఆర్‌ఆర్‌బీ, పోలీసు కానిస్టేబుల్ తదితర ఉద్యోగాలకు ఎంపికయ్యారు.
- By Gopichand Published Date - 04:46 PM, Sat - 20 September 25

Minister Savitha: బీసీలకు గౌరవప్రదమైన జీవితం, రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్. సవిత (Minister Savitha) తెలిపారు. బీసీ యువతకు అధిక ఉద్యోగాలు కల్పించడానికి ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. శనివారం ఢిల్లీలోని ఓక్ హాల్‌లో జరిగిన స్కోచ్ అవార్డుల ప్రదానోత్సవంలో మంత్రి సవిత మాట్లాడారు.
ఉచిత శిక్షణకు స్కోచ్ అవార్డు
బీసీ నిరుద్యోగ యువతకు పోటీ పరీక్షలలో ఉచిత శిక్షణ అందించినందుకు గానూ బీసీ సంక్షేమ శాఖకు సోషల్ జస్టిస్ సెక్యూరిటీ విభాగంలో ప్రతిష్టాత్మకమైన బంగారు స్కోచ్ అవార్డు లభించింది. ఈ అవార్డు స్ఫూర్తితో మరింత ఉత్సాహంగా పనిచేస్తామని మంత్రి సవిత పేర్కొన్నారు.
అమరావతిలో బీసీ స్టడీ సర్కిల్ నిర్మాణం
- అమరావతిలో ఐదెకరాల విస్తీర్ణంలో అత్యాధునిక బీసీ స్టడీ సర్కిల్ నిర్మిస్తామని మంత్రి తెలిపారు.
- అలాగే విశాఖపట్నం, రాజమండ్రి, తిరుపతి, అనంతపురంలో కూడా మెగా బీసీ స్టడీ సర్కిళ్లను నిర్మించే ఆలోచన ఉన్నట్లు చెప్పారు.
- భవిష్యత్తులో బీసీ యువతకు అన్ని రకాల పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ అందిస్తామని హామీ ఇచ్చారు.
Also Read: Axar Patel: రేపు పాక్‌తో కీలక మ్యాచ్.. టీమిండియా కీలక ఆటగాడు దూరం?!
ఉచిత శిక్షణ వివరాలు
- బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన శిక్షణా కార్యక్రమాల ద్వారా ఎంతోమంది యువతకు లబ్ధి చేకూరింది.
- మెగా డీఎస్సీ కోసం ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ద్వారా 6,470 మంది బీసీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇచ్చారు. వీరిలో 246 మంది టీచర్లుగా ఎంపికయ్యారు.
- విజయవాడలోని బీసీ స్టడీ సర్కిల్ ద్వారా 83 మందికి సివిల్ సర్వీసెస్ కోచింగ్ ఇవ్వగా వీరిలో పలువురు గ్రూప్ 2, ఆర్‌ఆర్‌బీ, పోలీసు కానిస్టేబుల్ తదితర ఉద్యోగాలకు ఎంపికయ్యారు.
అవార్డు ప్రధానోత్సవం
ఈ కార్యక్రమంలో స్కోచ్ గ్రూప్ చైర్మన్ సమీర్ కొచ్చార్, ప్రొఫెసర్ మహేందర్ దేవ్ చేతుల మీదుగా మంత్రి సవిత అవార్డును అందుకున్నారు. బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి ఎస్. సత్యనారాయణ, ఇతర అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. బీసీల అభివృద్ధిని లక్ష్యంగా చేసుకుని టీడీపీ పార్టీ ఆవిర్భవించిందని, ఎన్టీఆర్ స్ఫూర్తితో ముఖ్యమంత్రి చంద్రబాబు పాలన సాగిస్తున్నారని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ కూడా అట్టడుగు వర్గాల అభివృద్ధికి ప్రాధాన్యమిస్తున్నారని తెలిపారు.