Viveka Murder Case: సీబీఐ లీక్స్ పేరుతో.. టీడీపీ జగన్‌కు మేలు చేస్తుందా..?
- By HashtagU Desk Published Date - 01:19 PM, Wed - 2 March 22

ఆంధ్రప్రదేశ్‌లో కలకలం రేపిన దివంగత మాజీ ఎంపీ వివేకానందరెడ్డి హత్య కేసు రోజుకో మలుపుతిప్పుతున్న సంగతి తెలిసిందే. వివేకా మర్డర్ కేసులో సీబీఐ ఎంట్రీ ఇచ్చిన తర్వాత దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. అయితే కొద్ది రోజులుగా సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలాలు లీకులు అంటూ ఎల్లో మీడియా రోజుకో కథనాన్ని ప్రచురిస్తుంది. ఈ క్రమంలో వివేకా హత్య కేసుకు సంబంధించి అసలు వాస్తవాలు ఇవేనంటూ రాజకీయవర్గాల్లో రచ్చ లేపుతున్న మీడియా లీకులు, జగన్ సర్కార్ ఇమేజ్‌ను డ్యామేజ్ చేసేలా ఉన్నాయి.
ముఖ్యంగా వివేకానందరెడ్డి కూతురు సునీతారెడ్డి సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలం లీక్ అంటూ ఓ ప్రముఖ తెలుగు పత్రిక ఓ కథనాన్ని ప్రచురిండంతో రాజకీయవర్గాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. దీంతో చంద్రబాబుతో సహా టీడీపీ నేతలు, బాబాయి హత్య వెనుక ఉంది అబ్బాయే అని, జగన్‌ను టార్గెట్ చేసి పెద్దఎత్తున విమర్శలు గుప్పిస్తున్నారు. వైసీపీ నేతలు కూడా టీడీపీ నేతలు చేస్తున్న విమర్శలకు ధీటుగా కౌంటర్లు ఇస్తున్నారు. అయితే జగన్ పై ఇలాంటి విమర్శలు కొత్త కాదు.. గతంలో కూడా అక్రమాస్తుల కేసు విషయంలో కూడా జగన్ పై టీడీపీ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
అయితే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే.. అక్రమాస్తుల కేసు విషయంలో టీడీపీ అండ్ ఎల్లో మీడియా జగన్‌ను ఓ రేంజ్‌లో టార్గెట్ చేయడంతో, రివర్స్‌లో జగన్ పై సింపతీ వేవ్ తీసుకొచ్చింది. ఇప్పుడు వివేకా హత్య కేసు విషయంలో కూడా ఎల్లోగ్యాంగ్ చేస్తున్న ప్రచారం, మరోసారి జగన్ పై సింపతీ వేవ్ తీసుకొచ్చేలా ఉందని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. వివేకా కేసుకు సంబంధించి సీబీఐ ఇప్పటి వరకు అధికారికంగా ఏ విషయమూ ప్రకటించకపోయినా టీడీపీ అనుకూల మీడియా లీకు పేరుతో చేస్తున్న హంగామా చూస్తుంటే.. జగన్ పై టీడీపీ మార్కు కుట్ర మరోసారి జరుగుతోందనే అర్ధమవుతోంది.
సీబీఐ విచారణ అనేది జగన్‌కు ఇబ్బందికరమైన వ్యవహారమే. ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ సొంత బాబాయి కేసులో నిజాలు నిగ్గు తేల్చలేకపోవడం, బాబాయ్ హత్య కేసుని ప్రతిష్టాత్మకంగా తీసుకోలేదనే విమర్శలు జగన్ మీద ఉన్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు వాటన్నిటినీ, సీబీఐ విచారణ కారణంగా వెలుగు చూస్తున్న లీకులు డామినేట్ చేసేస్తున్నాయని, రాజకీయవర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అయితే జగన్ మాత్రం వివేకా హత్యకు సంబంధించి జరుగుతున్న పరిణామాల్ని, అత్యంత జాగ్రత్తగా పరిశీలిస్తున్నారని, ఎల్లో గ్యాంగ్ తనపై చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పి కొట్టేందుకు, సరైన సమయం కోసం వేచి చూస్తున్నారని వైసీపీలోని కొందరు నేతలు చెబుతున్నారు. మరి వివేకా మర్డర్ కేసులో టీడీపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు జగన్ ఎలాంటి వ్యూహాలు రచించారో అనేది ఇప్పుడు రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.