MLA Ganta Srinivasa Rao: జగన్ రాజకీయాలలో ఉండటానికి అనర్హుడు: ఎమ్మెల్యే గంటా
జగన్ పర్యటనలో సింగయ్య అనే వ్యక్తి కారు చక్రాల కిందపడి మృతి చెందిన సంఘటనపై జగన్ కనీసం స్పందించలేదని, ఈ ఘటనను ప్రమాదం కాకుండా హత్యగా అభివర్ణించారు.
- By Gopichand Published Date - 06:41 PM, Tue - 24 June 25

MLA Ganta Srinivasa Rao: భీమిలి ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ (టీడీపీ) నేత గంటా శ్రీనివాసరావు (MLA Ganta Srinivasa Rao).. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. జగన్ రాజకీయాల్లో ఉండటానికి అనర్హుడని, ఆయన డైవర్షన్ రాజకీయాల్లో దిట్ట అని గంటా ఆరోపించారు. గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ.. జగన్ ఏడాది క్రితం చనిపోయిన వ్యక్తి కుటుంబాన్ని ఇప్పుడు పరామర్శించడం ద్వారా రాజకీయ హడావిడి సృష్టించారని, అంతర్జాతీయ యోగా డే సందర్భంగా విశాఖ వైపు ప్రపంచం చూస్తుండగా, దృష్టి మళ్లించేందుకు ఈ పర్యటన చేపట్టారని విమర్శించారు. గతంలో విశాఖలో సమ్మిట్ నిర్వహించినప్పుడు జగన్ విమానాశ్రయంలో నానా రచ్చ చేశారని, ఇప్పుడు పోలీసుల ఆంక్షలను ధిక్కరిస్తూ బాలప్రదర్శన చేశారని ఆరోపించారు.
జగన్ పర్యటనలో సింగయ్య అనే వ్యక్తి కారు చక్రాల కిందపడి మృతి చెందిన సంఘటనపై జగన్ కనీసం స్పందించలేదని, ఈ ఘటనను ప్రమాదం కాకుండా హత్యగా అభివర్ణించారు. వైసీపీ నేతలు సింగయ్యను తమ కార్యకర్తగా చెప్పడం దారుణమని గంటా విమర్శించారు. జగన్ అధికారంలోకి వచ్చాక ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన ప్రజావేదికను కూల్చివేశారని, సొంత చెల్లెలు, తల్లికి న్యాయం చేయలేని వ్యక్తి జగన్ అని, తన బాబాయ్ హత్యను చంద్రబాబుపై నెట్టేందుకు కుట్ర చేశారని ఆరోపించారు.
Also Read: Bhatti Vikramarka : దేశ చరిత్రలోనే సువర్ణ అక్షరాలతో లికించదగ్గ రోజు ఈరోజు
గతంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ యువగళం పాదయాత్రను అడ్డుకున్న జగన్, ఇప్పుడు తానేమీ చేయలేదని మాట్లాడటం హాస్యాస్పదమని గంటా వ్యాఖ్యానించారు. ప్రజలు కూటమికి ఇచ్చిన ఘన విజయం రాజకీయాలు ఎరుగని విజయమని, జగన్ తన వ్యవహార శైలిని మార్చుకోకపోతే 11 సీట్లు కూడా రావని హెచ్చరించారు. జగన్ వంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉండకుండా చేసేందుకు రాజ్యాంగ నిపుణులు చర్యలు తీసుకోవాలని కోరారు. గంటా శ్రీనివాసరావు గతంలో భీమిలి, విశాఖ ఉత్తర నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్యేగా, అనకాపల్లి నుంచి ఎంపీగా గెలిచి, విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి వివాదాన్ని రేకెత్తించే అవకాశం ఉంది.