Minister Lokesh: ఏపీలో ఆక్వాకల్చర్ అభివృద్ధికి సహకారం అందించండి: మంత్రి లోకేష్
ఎంపిక చేసిన బ్రీడ్‌ల ద్వారా ఉత్పాదకత పెంపుదలకు CSTFA అభివృద్ధి చేసిన జెనెటిక్ టూల్స్ ను ఆంధ్రప్రదేశ్ ఆక్వా రైతులకు అందించాలని కోరారు.
- Author : Gopichand
Date : 22-10-2025 - 1:58 IST
Published By : Hashtagu Telugu Desk
Minister Lokesh: ఆంధ్రప్రదేశ్‌లో ఆక్వాకల్చర్ రంగాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లే లక్ష్యంతో ఐటీ, విద్య శాఖల మంత్రి నారా లోకేష్ (Minister Lokesh) కీలక చర్చలు జరిపారు. ఆస్ట్రేలియాలోని జేమ్స్ కుక్ యూనివర్సిటీలో సెంటర్ ఫర్ సస్టయినబుల్ ట్రోఫికల్ ఫిషరీస్ అండ్ ఆక్వాకల్చర్ (CSTFA) విభాగం ప్రొఫెసర్ క్యాల్ జెంజర్‌తో మంత్రి లోకేష్ భేటీ అయ్యారు. ప్రొఫెసర్ క్యాల్ జెంజర్ ఉష్ణమండల ఆక్వాసాగులో ముఖ్యమైన బ్లాక్ టైగర్, బారాముండి రకాల రొయ్యల జన్యుపరమైన మెరుగుదల పరిశోధనలకు నాయకత్వం వహించడంలో ప్రసిద్ధులు. ఆక్వాసాగు సామర్థ్యాన్ని పెంచే అత్యాధునిక జన్యుసంబంధ సాధనాల అభివృద్ధికి ఆయన కృషి చేస్తున్నారు.
ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌లో రొయ్యలు, చేపల పెంపకం సామర్థ్యాన్ని పెంపొందించేందుకు CSTFA ద్వారా ఆక్వాకల్చర్ జెనెటిక్స్ నైపుణ్యాలను రాష్ట్ర రైతులకు అందించాలని కోరారు.
Also Read: President Droupadi Murmu: రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు తృటిలో తప్పిన ప్రమాదం.. వీడియో వైరల్!
ప్రధాన డిమాండ్లు
జన్యుపరమైన మెరుగుదల: భారత్‌లో ప్రధానంగా ఉత్పత్తి అయ్యే ఆక్వా రకాలలో ముఖ్యంగా బ్లాక్ టైగర్ రొయ్యలలో వ్యాధి నిరోధకత, వృద్ధిరేటును పెంచడానికి జన్యుపరమైన మెరుగుదలకు కృషి చేయాలి.
స్థిరమైన నిర్వహణ: పర్యావరణ ప్రభావాన్ని తగ్గించడానికి వాటర్ రీసైక్లింగ్, ఫీడ్ ఆప్టిమైజేషన్ వంటి స్థిరమైన పద్ధతులను ప్రోత్సహించాలి.
శిక్షణా కార్యక్రమాలు: ఆంధ్రప్రదేశ్ ఆక్వా రైతుల కోసం ఆధునిక సాగు పద్ధతులు, జన్యుపరమైన ఎంపిక, స్థిరమైన నిర్వహణ పద్ధతులపై శిక్షణా కార్యక్రమాలను రూపొందించాలని విజ్ఞప్తి చేశారు.
సాంకేతిక బదిలీ: ఎంపిక చేసిన బ్రీడ్‌ల ద్వారా ఉత్పాదకత పెంపుదలకు CSTFA అభివృద్ధి చేసిన జెనెటిక్ టూల్స్ ను ఆంధ్రప్రదేశ్ ఆక్వా రైతులకు అందించాలని కోరారు.
ఏఐ ఆధారిత పర్యవేక్షణ: ఆక్వాసాగులో నష్టాలను తగ్గించి ఉత్పత్తిని స్థిరీకరించడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత పర్యవేక్షణ వ్యవస్థలను అభివృద్ధి చేయాలని మంత్రి లోకేష్ ప్రొఫెసర్ జెంజర్‌ను కోరారు. మొత్తంగా ఈ భేటీ ద్వారా ఆంధ్రప్రదేశ్ ఆక్వాకల్చర్ రంగం నాణ్యత, ఉత్పాదకతను పెంచడానికి అంతర్జాతీయ స్థాయి నైపుణ్యం, ఆధునిక సాంకేతికతను వినియోగించుకోవడానికి మార్గం సుగమమైంది.