కృష్ణా నదిపై సెంటిమెంట్ సెగలు.. ఏపీ, తెలంగాణ నడుమ నివురుగప్పిన నిప్పు
తెలుగు రాష్ట్రాల మధ్య నీళ్ల యుద్ధం జరుగుతోంది. కేంద్రం గెజిట్ ఇవ్వడంతో తాత్కాలికంగా ఇరు రాష్ట్రాల మధ్య హైడల్, ఇరిగేషన్ ప్రాజెక్టులు ఆగినప్పటికీ శాశ్వత పరిష్కారం లభించలేదు. ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పటి నుంచి కృష్ణా, గోదావరి ప్రాజెక్టుల్లోని నీళ్ల వాడకంపై ఇరు ప్రాంతాల మధ్య విభేదాలు ఉండేవి
- By Hashtag U Published Date - 12:28 PM, Wed - 29 September 21

తెలుగు రాష్ట్రాల మధ్య నీళ్ల యుద్ధం జరుగుతోంది. కేంద్రం గెజిట్ ఇవ్వడంతో తాత్కాలికంగా ఇరు రాష్ట్రాల మధ్య హైడల్, ఇరిగేషన్ ప్రాజెక్టులు ఆగినప్పటికీ శాశ్వత పరిష్కారం లభించలేదు. ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పటి నుంచి కృష్ణా, గోదావరి ప్రాజెక్టుల్లోని నీళ్ల వాడకంపై ఇరు ప్రాంతాల మధ్య విభేదాలు ఉండేవి. జూలై ఒకటో తేదీ 2014 ఇరు ప్రాంతాల పోలీసులు భారీగా కృష్ణా ప్రాజెక్టుల వద్ద మోహరించిన విషయం విదితమే. జూలై రెండో తేదీన అదే ఏడాది ప్రాజెక్టుల వద్ద టెన్షన్ వాతావరణాన్ని చూశాం. అలాంటి పరిస్థితిని మళ్లీ ఇప్పుడు కూడా చూస్తున్నాం. దీనికి కారణం ఏంటి? విభజన చట్టాన్ని అమలు చేయకపోవడమా? నీటి పంపకాల్లోనే శాస్త్రీయ బద్ధత లేదా? కృష్ణా వాటర్ బోర్డు చేతగానితనమా? కేంద్రం పరిష్కరించలేకపోతుందా? ఏపీ,తెలంగాణ ప్రభుత్వాల రాజకీయాలా?..దీనికి శాశ్వత పరిష్కారం ఉందా?..అంటే ఔను ఉందంటున్నారు నిపుణులు. రాష్ట్ర ప్రభుత్వాల మాత్రం లేదంటున్నాయి.
ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు వాటి పరిధిలోని కృష్ణా నదిపైన ప్రాజెక్టులను నిర్మిస్తున్నాయి. ఏపీ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును నిర్మిస్తోంది. తెలంగాణ హైడల్ పవర్ ప్రాజెక్టులను శరవేగంగా నిర్మాణం చేస్తోంది. కానీ, 2014 పునర్విభజన చట్టం అమలోకి వచ్చిన తరువాత వాటర్ కేటాయింపులను తెలంగాణ పరిగణనలోకి తీసుకోవడంలేదు. ఉమ్మడి ఏపీకి 811 టీఎంసీ వాటర్ కేటాయింపు ఉంది. దానిలో ఏపీ వాటా 521 టీఎంసీ, తెలంగాణకు 299 టీఎంసీ వాటగా ఉంది. కేటాయించిన వాటాకు అదనంగా రాయలసీమ ఎత్తిపోతల పథకం ద్వారా ఎక్కువ నీటిని ఏపీ వాడు కుంటోందని తెలంగాణ ప్రభుత్వం కృష్ణా బోర్డుకు ఫిర్యాదు చేసింది. అందుకు ప్రతిగా మినీ హైడల్ పవర్ ప్రాజెక్టులకు శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల వద్ద అదనపు నీటి తెలంగాణ వాడుకుంటోందని ఏపీ ఫిర్యాదును చేయడంతో వివాదం తారాస్థాయికి చేరింది. కనిష్ట స్థాయికి కృష్ణా వాటర్ వెళ్లిన తరువాత కూడా హైడల్ పవర్ ప్రాజెక్టులకు తెలంగాణ నీటిని వాడడంతో ఇరిగేషన్ నీళ్లను ఏపీ నష్టపోతుంది. ఫలితంగా ఇరు రాష్ట్రాలు పోలీసులును మోహరించి 2015 మరియు 2016లలో ఇరిగేషన్ అధికారుల విధులను అడ్డుకున్నారు. దీంతో వివాదం కేంద్రానికి వెళ్లింది. ఆనాటి నుంచి వివాదం ఇరు రాష్ట్రాల మధ్య న్యాయపోరాటం జరుగుతోంది.
పరిష్కారం కోసం విభజన చట్టంలోని సెక్షన్ 85 ప్రకారం కృష్ణాబోర్డును కేంద్రం ఏర్పాటు చేసింది. దాని పరిధిలోనే నీళ్ల వాడకం ఉండేలా చర్యలు తీసుకుంది. ఏపీకి కృష్ణా బోర్డు అనుకూలంగా వ్యవహరిస్తోందని, శ్రీశైలం రిజర్వాయర్ వద్ద పోతిరెడ్డిపాడు నుంచి 80వేల క్యూసెక్కుల నీటిని తోడుకుంటుందని గత ఏడాది తెలంగాణ సీఎం కేంద్రానికి ఫిర్యాదు చేశారు. పెన్నా నదీ ఆకట్టుకు నీళ్లు ఇస్తున్నారని ఆ ఫిర్యాదులోని సారాంశం. కేవలం 1500 క్యూసెక్కులకు మాత్రమే అనుమతి ఉండగా, 80వేల క్యూసెక్కులను ఏపీ వాడుకుంటోందని కేసీఆర్ ఫిర్యాదు చేశారు. అంతేకాదు, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కు వెళ్లింది. దీంతో ఈ ఏడాది జూలై ఒకటిన ప్రధాన మంత్రి మోడీకి ఏపీ సీఎం జగన్ లేఖ రాశారు. హైడల్ ప్రాజెక్టుల ద్వారా తెలంగాణ కృష్ణా నదిలోని నీటిని నిబంధనలకు విరుద్ధంగా వాడుకుంటోందని లేఖ ద్వారా ఫిర్యాదు చేశారు. కేంద్రం జోక్యం చేసుకుని సమస్యకు పరిష్కారం చూపాలని కోరారు. దీంతో పీఎంవో కార్యాలయం జోక్యం చేసుకుని కృష్ణాబోర్డు నీటి వాడకంపై గెజిట్ ప్రకటించింది.
తెలుగు రాష్ట్రాల మధ్య నీటి యుద్ధం వెనుక రాజకీయ కోణం ఉంది. రాజకీయ లబ్ది కోసం అవసరమైప్పుడల్లా నీటి సెంటిమెంట్ ను లేవనెత్తుతున్నారు. ఫలితంగా పోలీసులు కృష్ణా, గోదావరి నదులపైన మోహరించాల్సిన పరిస్థితి వస్తోంది. నీటి వాడకంపై ఎవరికి వారే ఇరు రాష్ట్రాల రాజకీయ నేతలు స్టేట్ మెంట్లు ఇస్తూ సెంటిమెంట్ ను రేకెత్తిస్తున్నారు. దీనికి శాశ్వత పరిష్కారం కృష్ణా బోర్డుకు స్వయం ప్రతిపత్తి కల్పించడంతో పాటు అధికారులకు అధికారాలను ఇవ్వాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. విభజన చట్టం ప్రకారం ఇరు రాష్ట్రాల ఇరిగేషన్ అధికారులకు నీటి వాటకంపై అధికారాలను కల్పిస్తే సెంటిమెంట్ ఇష్యూ రాకుండా ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతానికి కేంద్రం గెజిట్ ఇవ్వడంతో కృష్ణా వాటర్ వాడకం వ్యవహారం మొత్తం కేంద్రం పరిధిలోకి వెళ్లింది. ఇరు రాష్ట్రాలు ప్రాజెక్టుల నిర్మాణాలను ఆపాలని కృష్ణాబోర్డు ప్రభుత్వాలకు ఆదేశాలను జారీ చేసింది. కానీ, గెజిట్ ఇవ్వడాన్ని తెలంగాణ సర్కార్ తప్పు బడుతోంది. మరోవైపు శ్రీశైలం ప్రాజెక్టును పవర్ జనరేషన్ కోసం మాత్రమే నిర్మించారనే సరికొత్త స్లోగన్ కేసీఆర్ అందుకున్నారు. సెంటిమెంట్ కు శాశ్వత ముద్రవేసేలా ఆయన ఇచ్చిన స్టేట్ మెంట్ ఇప్పుడు రెండు రాష్ట్రాల మధ్య నివురుగప్పిన నిప్పులా ఉంది.
– సీ.ఎస్.రావు, సీనియర్ జర్నలిస్ట్