Krishna Water Dispute : నీళ్లన్నీ మీకిస్తే, మా సంగతి ఏంటి.. కృష్ణా జల వివాదంపై ఏపీ తెలంగాణ వాదనలు!
- By Vamsi Chowdary Korata Published Date - 11:33 AM, Thu - 27 November 25
కృష్ణా జలాల పునఃపంపిణీపై బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ విచారణ చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ మేరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వాదనలు వినిపిస్తున్నాయి. అయితే రాష్ట్ర విభజనతో ఆంధ్రప్రదేశ్.. హైదరాబాద్, పరిశ్రమలు కోల్పోయిందని ఏపీ వాదనలు వినిపించింది. ఇప్పుడు వ్యవసాయమే మిగిలిందని చెప్పారు. ఇప్పుడు ఏపీకి నీటి కేటాయింపులు తొలగించడం సరికాదని ఏపీ న్యాయవాది జయదీప్ గుప్తా వాదించారు. చట్టబద్ధమైన ట్రైబ్యునల్ తీర్పులను గౌరవించాలన్న న్యాయవాది.. మిగులు జలాలు ఏపీకే దక్కాలని కోరారు.
కృష్ణా నదీ జలాలను ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు మళ్లీ పంపిణీ చేసేందుకు జస్టిస్ బ్రిజేష్ కుమార్ నేతృత్వంలో కేంద్రం ఏర్పాటు చేసిన ట్రైబ్యునల్బుధవారం విచారణ చేపట్టింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది జైయదీప్ గుప్తా వాదనలు వినిపించారు. రాష్ట్ర విభజన కారణంగా ఆంధ్రప్రదేశ్‌కు హైదరాబాద్, పరిశ్రమలు లేకుండా పోయాయని వాదించారు. ఇప్పుడు ఏపీ నీటి కేటాయింపులు తొలగించి తెలంగాణకు ఇచ్చేయమంటే ఎలా అని ప్రశ్నించారు. ఇలా చేస్తే రాష్ట్రంలో లక్షల మంది రైతులు, ప్రజలు ఏమైపోవాలన్నారు.
బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ ఎదుట రెండోరోజు ఇరు రాష్ట్రాల న్యాయవాదులు వాదనలు కొనసాగించారు. ఈ సందర్భంగా ఏపీ తరఫున న్యాయవాది జయదీప్ గుప్తా.. కీలక ప్రశ్నలను ట్రైబ్యునల్ ముందు లేవనెత్తారు. ట్రైబ్యునల్‌కు నీటి కేటాయింపులను పునఃపరిశీలించే అధికారం లేదన్నారు. దానికి గల కారణాలను వివరించారు. రాష్ట్ర పునర్విభజన జరిగే సమయంలో.. ఏపీ హైదరాబాద్‌ను కోల్పోయిందని అన్నారు. ప్రపంచస్థాయి సంస్థలు ఉన్న హైదరాబాద్‌తో పాటు ప్రస్తుతం ఏపీలో పరిశ్రమలు కూడా లేవన్నారు. ఇక మిగిలింది వ్యవసాయమే మాత్రమే అని.. తెలంగాణ వచ్చి ఆ నీళ్లన్నీ తమకు ఇచ్చెయ్యాలంటే ఎలా కుదురుతుందని ప్రశ్నించారు.
ఆంధ్రప్రదేశ్‌లో కృష్ణా మొదటి ట్రైబ్యునల్ కేటాయింపుల నాటి నుంచే వ్యవసాయం ఉందని.. ఇప్పుడు ఆ కేటాయింపులను ఎత్తేసి అసలు నీటి కేటాయింపులు లేకుండా ఎలా చేస్తారన్నారు జయదీప్ గుప్తా. “కృష్ణా మొదటి, రెండో ట్రైబ్యునళ్లు ఇప్పటికే తీర్పులు ఇచ్చాయి. ఇప్పుడు తెలంగాణ ఆ తీర్పులను కొట్టిపారేయాలంటోందా?. చట్టబద్ధమైన ట్రైబ్యునళ్ల తీర్పులకు, కేటాయింపులకు ఎందుకు గుర్తింపు ఉండదు?. ప్రస్తుతం ట్రైబ్యునల్ నీటి కేటాయింపులను మార్చడానికి వీలు లేదు.” అని జయదీప్ గుప్తా వాదించారు.
కాగా, శ్రీశైలం, నాగార్జున సాగర్‌లో నీటి ఆవిరి కింద నష్టపోయే వాటిలో ఏపీ, తెలంగాణ వాటా ఎంతో టైబ్యునల్ తేల్చాలన్నారు జయదీప్ గుప్తా. అలాగే తుంగభద్రలో ప్రాజెక్టుల వారీగా ఇప్పటికే కేటాయింపులు ఉన్నాయని.. నాగార్జునసాగర్ వద్ద ప్రాజెక్టుల వారీగా ఎవరి వాటా ఎంతో తేల్చాలని వాదించారు. ఇప్పటికే కృష్ణా ట్రైబ్యునల్ సగటున 2,578 టీఎంసీలను భాగస్వామ్య రాష్ట్రాలకు పంచేసిందని తెలిపిన గుప్తా.. మిగిలిన జలాల దిగువ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌కే హక్కులు ఉంటాయని.. మిగులు జలాలు ఏపీకే దక్కుతాయని వాదనలు వినిపించారు.
కృష్ణా నదీ జలాలపై ఆంధ్రప్రదేశ్‌కు ఉన్న హక్కుల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోబోమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. నీటి కేటాయింపుల్లో ఎలాంటి మార్పులు చేసేందుకూ వీలు లేదని చెప్పారు. చట్టపరంగా ఏపీకి దక్కిన వాటా అలాగే.. ఈ విషయంపై బలమైన వాదనలు వినిపించాలన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు కృష్ణా జలాల్లో 811 టీఎంసీల వాటా ఉందన్నారు. రాష్ట్ర విభజన తర్వాత జలవివాదాల ట్రైబ్యునల్-1.. ఆంధ్రప్రదేశ్‌కు 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీలు కేటాయించిందని తెలిపారు. ఇప్పుడు ఆ తీర్పును తెలంగాణ పునఃసీమీక్షించాలనడం సరికాదని చెప్పారు.