Seaplane Services : ఏపీలోని 3 లొకేషన్ల నుంచి సీ ప్లేన్ సర్వీసులు
అయితే వాటికి సీ ప్లేన్(Seaplane Services) రూట్ల కేటాయింపుపై ప్రస్తుతం కేంద్ర విమానయాన శాఖ కసరత్తు చేస్తోంది.
- By Pasha Published Date - 11:25 AM, Mon - 26 May 25

Seaplane Services : ఆంధ్రప్రదేశ్‌లో సీప్లేన్ సర్వీసుల ప్రారంభంపై కొత్త అప్‌డేట్ వచ్చింది. తొలుత అమరావతి (ప్రకాశం బ్యారేజి), తిరుపతి (కళ్యాణి డ్యాం), గండికోట నుంచి సర్వీసులను నడపనున్నారు. ఇందుకు అవసరమైన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ల తయారీకి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అమరావతి, గండికోట డీపీఆర్ తయారీ బాధ్యతలను రైట్స్ సంస్థకు, తిరుపతి డీపీఆర్ తయారీ బాధ్యతలను ఫీడ్ బ్యాక్ హైవేస్ సంస్థకు అప్పగించారు. ఆయా చోట్ల సీ ప్లేన్ సర్వీసులను నడిపేందుకు ఉన్న సాధ్యాసాధ్యాలపై నివేదికను తయారు చేసి సమర్పించాలని రాష్ట్ర సర్కారు నిర్దేశించింది. స్పైస్‌జెట్, ఎయిర్ ఏషియా కంపెనీలు సీ ప్లేన్ సర్వీసులను నడిపేందుకు ఆసక్తిని వ్యక్తం చేశాయి. ఈ సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వ అధికారులు సంప్రదింపులు జరుపుతున్నారు. అయితే వాటికి సీ ప్లేన్(Seaplane Services) రూట్ల కేటాయింపుపై ప్రస్తుతం కేంద్ర విమానయాన శాఖ కసరత్తు చేస్తోంది. ఉడాన్ పథకం కింద ఆయా విమానయాన కంపెనీలకు ప్రయోజనాలు, సదుపాయాలను వర్తింపజేయనుంది.
Also Read :AI Model Blackmailing : అక్రమ సంబంధాలను బయటపెడతా.. డెవలపర్‌ను బెదిరించిన ఏఐ
ఈ మూడు మార్గాలే ఎందుకు ?
తొలి విడతలో దేశవ్యాప్తంగా 56 మార్గాల్లో సీ ప్లేన్ సేవలను కేంద్ర సర్కారు అందుబాటులోకి తేనుంది. వీటిలోనే ఏపీలోని 3 మార్గాలు(అమరావతి, తిరుపతి, గండికోట) ఉన్నాయి. అత్యంత సమీపంలో విమానాశ్రయాలు ఉండటం ఈ మూడు ప్రదేశాల ప్రత్యేకత. అందుకే వీటిని వెంటనే సీ ప్లేన్ సర్వీసుల కోసం ఎంపిక చేశారు. సాధారణ విమాన సర్వీసులతో కలిపి, సీ ప్లేన్ సేవలు అందుబాటులోకి తేనున్నారు. ఉదాహరణకు గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రకాశం బ్యారేజీలో ఏర్పాటు చేసిన వాటర్ డ్రోమ్‌కు సర్వీసును నడుపుతారు. అక్కడ కనకదుర్గమ్మ ఆలయ దర్శనం తర్వాత శ్రీశైలం వరకు వెళ్లేలా ప్రతిపాదించారు.
Also Read :Milla Magee : మిల్లా ఆరోపణలపై విచారణకు రేవంత్ ఆదేశం.. ఐదు అంశాలపై దర్యాప్తు
ట్రయల్ సర్వీస్ సక్సెస్ కావడంతో..
2024 సంవత్సరం నవంబరు 9న పున్నమి ఘాట్(ప్రకాశం బ్యారేజి) నుంచి శ్రీశైలం వరకు సీ ప్లేన్ సర్వీసును ప్రభుత్వం ప్రయోగాత్మకంగా పరిశీలించింది. సుమారు 150 కి.మీ.ల విహారంలో సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో పాటు పలువురు అధికారులూ ప్రయాణించారు. అది విజయవంతం అయింది. దీంతో ఏపీలో సీ ప్లేన్ సేవలు ప్రారంభించేందుకు ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. భూ ఉపరితలం నుంచి 1,500 అడుగుల ఎత్తులో సీ ప్లేన్ ప్రయాణిస్తుంది.