Purandeshwari : పురందేశ్వరికి లోక్‌సభ స్పీకర్ పదవి ?
తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలైకు కేంద్రమంత్రి పదవిని నరేంద్రమోడీ ఆఫర్ చేశారు..
- By Pasha Published Date - 05:13 PM, Sun - 9 June 24

Purandeshwari : తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలైకు కేంద్రమంత్రి పదవిని నరేంద్రమోడీ ఆఫర్ చేశారు.. ఈదఫా ఎన్డీయే కూటమి సర్కారులో అత్యంత కీలకంగా మారిన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బీజేపీకి సారథ్యం వహిస్తున్న రాజమండ్రి ఎంపీ పురందేశ్వరికి కూడా ఏదైనా పదవిని ఇవ్వబోతున్నారా ? ఆమెకు లోక్‌సభ స్పీకర్ పదవిని ఇస్తారా ? అనే కోణంలో ఇప్పుడు ముమ్మర చర్చ జరుగుతోంది. హిందీ, ఇంగ్లిష్ భాషల్లో మంచి ప్రావీణ్యం.. గతంలో పలుమార్లు కేంద్రమంత్రిగా వ్యవహరించిన అనుభవం.. ఎన్టీఆర్ కుమార్తెగా బలమైన రాజకీయ నేపథ్యం కలిగిన పురందేశ్వరికి ఈసారి లోక్‌సభ స్పీకర్ పదవి దక్కినా ఆశ్చర్యం లేదని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. అయితే స్పీకర్ పదవి ఇస్తారా ? డిప్యూటీ స్పీకర్ పదవిని కేటాయిస్తారా ? అనే దానిపై ఇంకా పూర్తి క్లారిటీ రాలేదు. ఈ అంశంపై ఇవాళ ఉదయం మీడియా ప్రతినిధులు పురందేశ్వరిని ప్రశ్నించగా.. ఆమె సమాధానం చెప్పకుండా మౌనం వహించారు.
We’re now on WhatsApp. Click to Join
నరసాపురం ఎంపీ భూపతిరాజు శ్రీనివాసవర్మకు కేంద్ర క్యాబినెట్‌లో ఇప్పటికే బెర్తు ఖాయమైంది. ఇవాళ రాత్రి ఆయన కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. దీనిపై పురందేశ్వరి(Purandeshwari) స్పందిస్తూ.. ‘‘ సామాన్య కార్యకర్తగా కష్టపడి పనిచేస్తున్న ఒక వ్యక్తిని గుర్తించి టికెట్ ఇచ్చారు. అంతేకాదు ఆయన గెలిచాక కేంద్ర క్యాబినెట్ లో మంత్రిగా అవకాశం ఇస్తున్నారు. ఇదంతా బీజేపీలోనే సాధ్యమవుతుంది. ప్రతి బీజేపీ కార్యకర్తకు గుర్తింపు ఉంటుందని మరోసారి మోడీ చాటిచెప్పారు’’ అని పేర్కొన్నారు. ‘‘ఈసారి ఏపీలో మేం కూటమిగా పోటీ చేశాం. కేంద్ర క్యాబినెట్ కూర్పు నేపథ్యంలో టీడీపీ వాళ్లు రెండు పేర్లు ఇచ్చారు. ఆ ఇద్దరిని కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకునేందుకు మోడీ అంగీకరించారు. మా బీజేపీ నుంచి భూపతిరాజు శ్రీనివాసవర్మకు అవకాశం దక్కింది’’ అని పురందేశ్వరి తెలిపారు.
Also Read : Ravneet Singh Bittu : మంత్రి పదవి ఆఫర్.. పరుగులు పెడుతూ పీఎంఓకు.. వీడియో వైరల్
‘‘డబుల్ ఇంజన్ సర్కారు వల్ల ఎలాంటి డెవలప్మెంట్ జరుగుతుందో తెలియాలంటే ఈసారి ఏపీలో జరిగే ప్రగతిని చూడాలి. ఏపీ నుంచి అటు టీడీపీ, ఇటు బీజేపీ వాళ్లకు కేంద్ర మంత్రి పదవులు దక్కాయి. వారంతా కలిసి రాష్ట్ర ప్రగతి కోసం ప్రయత్నాలు చేస్తారు’’ అని ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి ఆశాభావం వ్యక్తం చేశారు. గత ఐదేళ్లలో ఏపీలో ప్రగతి ఆగిపోయిందని, వైఎస్సార్ సీపీ ఏపీని గుల్లబార్చిందని ఆమె ఆరోపించారు. ఇకపై కేంద్ర ప్రభుత్వం నుంచి సాధ్యమైనన్ని ఎక్కువ నిధులు ఏపీని అన్ని రంగాల్లో డెవలప్ చేస్తామన్నారు. టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి ఏపీని ముందుకు తీసుకెళ్తాయన్నారు.