Social Engineering : 2024 సోషల్ ఇంజనీరింగ్
`ఒక్క ఛాన్స్` నినాదంతో అధికారంలోకి వచ్చిన జగన్ ఈసారి సోషల్ ఇంజనీరింగ్ ను నమ్ముకున్నట్టు కనిపిస్తోంది.
- By CS Rao Published Date - 04:29 PM, Fri - 4 February 22

`ఒక్క ఛాన్స్` నినాదంతో అధికారంలోకి వచ్చిన జగన్ ఈసారి సోషల్ ఇంజనీరింగ్ ను నమ్ముకున్నట్టు కనిపిస్తోంది. అందుకు సంబంధించిన అడుగులను చాలా వేగంగా వేస్తున్నాడు. పగవాడు కూడా ఆయన వైపు ఆలోచించేలా సామాజిక ఇంజనీరింగ్ అస్త్రాన్ని విసురుతున్నాడు. ఆ కోవలోకి వచ్చే రెండు అంశాలను తీసుకుంటే..విజయవాడ కేంద్రంగా పెట్టే జిల్లాకు ఎన్టీఆర్ పేరును నామకరణం చేయడం ఒకటి. తుని సంఘటనకు సంబంధించిన కేసులను పూర్తిగా ఎత్తివేయడం మరోకటి.మూడు రాజధానుల నిర్ణయం తరువాత కమ్మ సామాజికవర్గం ద్వేషిగా జగన్ కు ముద్రపడింది. ఆ ప్రాంతాన్ని కమ్మరావతిగా వైసీపీ సోషల్ మీడియా ప్రచారం చేసింది. పైగా అమరావతి కోసం పోరాడిన రైతులపై జగన్ సర్కార్ కేసులు పెట్టింది. వాళ్లలో ఎక్కువగా కమ్మ సామాజికవర్గం వాళ్లే ఉన్నారు. పైగా ఆ ఉద్యమానికి నాయత్వం చంద్రబాబు వహించాడు. ఆ తరువాత అమరావతి పరిరక్షణ కమిటీ ఏర్పాటు అయింది. అది కూడా చంద్రబాబు కనుసన్ననలో పనిచేస్తుందని వైసీపీ బలంగా విశ్వసిస్తోంది. విశాఖ గీతం కాలేజి ఆవరణలోని భూ భాగాన్ని స్వాధీనం చేసుకోవడం, విజయవాడలోని మాజీ ఏపీ ఆర్థిక మండలి ఉపాధ్యక్షుడు కుటుంబారావు భూమిని స్వాధీనం చేసుకున్న వైఖరి, చింతమనేని ప్రభాకర్ పై ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టడం, పొన్నూరు మాజీ ఎమ్మెల్యే ధూళ్లిపాళ్ల నరేంద్ర నిర్వహిస్తోన్న సంగం డైరీ జోలికి వెళ్లడం, అమరావతి గురించి కించపరిచేలా మాట్లాడడం, మంత్రి కొడాలి నాని, వల్లభనేని వంశీ ఇద్దరూ కలిసి చంద్రబాబుపై దుర్భాషలాడడం, చంద్రబాబు ఏడ్వడం…తదితర పరిణామాలన్నీ జగన్ ను కమ్మ సామాజికవర్గం ద్వేషిగా ముద్రవేశాయి.
విజయవాడ కేంద్రంగా ఏర్పడే జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టడంతో ద్వేషి ముద్ర నుంచి కొంత మేరకు జగన్ బయటపడినట్టు వైసీపీ భావిస్తోంది. దాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడానికాని ప్రయత్నం జరుగుతోంది. అందుకే, ఎన్టీఆర్ విగ్రహానికి వైసీపీ మంత్రి కొడాలి నాని పాలాభిషేకం చేశాడు. వంగవీటి రంగా పేరును కాదని ఎన్టీఆర్ పేరును ఆ జిల్లాకు పెట్టడడం జగన్ సాహసమే. ఎందుకంటే, ఆ జిల్లాలో కమ్మ, కాపు సామాజిక వర్గాల మధ్య దశాబ్దాలుగా అంతర్గత వార్ నడుస్తోంది. గ్రూప్ రాజకీయాలను ఆ రెండు సామాజిక వర్గాలే అక్కడ నడుపుతాయి. వైరి వర్గాలుగా ఉంటూ రాజకీయ ఆధిపత్యాన్ని కొనసాగిస్తుంటాయి. అలాంటి వాతావరణం ఉన్న జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టడం అంటే జగన్ తీసుకున్న చారిత్రక నిర్ణయమే. అంత సీరియస్ నిర్ణయాన్ని కూడా పార్టీలకు అతీతంగా చంద్రబాబు ఆహ్వానించలేకపోయాడు. అదే విషయాన్ని రాజకీయ అనుకూల అంశంగా జగన్ మలుచుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఆ క్రమంలోనే ఎమ్మెల్సీ, మాజీ టీడీపీ సీనియర్ లీడర్ సీ. రామచంద్రయ్య మీడియా ముందుకొచ్చాడు. ఎన్టీఆర్ వ్యతిరేకిగా చంద్రబాబును చిత్రీకరించే ప్రయత్నం చేశాడు.రాబోవు రోజుల్లో విజయవాడ కేంద్రంగా ఏర్పడే జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టినందుకు కమ్మ సంఘాలు ఖచ్చితంగా స్పందించే అవకాశం ఉంది. ఇప్పటికే విజయవాడ కేంద్రంగా ఉన్న కమ్మ సంఘాల నాయకులు కొందరు జగన్ కు సన్మానసభ పెట్టాలని ఆలోచిస్తున్నారట. అధికారికంగా జిల్లా ఏర్పాటు అయిన తరువాత విడతలవారీగా కమ్మ సంఘాలు జగన్మోహన్ రెడ్డిని ఘనంగా సత్కరించాలని గుంటూరు, విజయవాడల్లోని కమ్మ సంఘం పెద్దలు నిర్ణయించుకున్నారట. ఆ దిశగా ఇప్పటికే మంత్రి కొడాలి నాని, వల్లభనేని వంశీ, కరణం బలరాం లాంటి వాళ్లు ప్రయత్నాలు మొదలు పెట్టారని తెలుస్తోంది. అంతేకాదు, హైదరాబాద్ లో ఉండే కమ్మ సంఘం కూడా పెద్ద ఎత్తున జగన్, కేసీఆర్ కు ఏకకాలంలో ఎన్నికల సమయంలో సన్మానం పెట్టాలని యోచిస్తున్నారని వినికిడి. అదే జరిగితే, ఇప్పటి వరకు చంద్రబాబు వైపు సాలిడ్ గా ర్యాలీ అయిన కమ్మ సామాజికవర్గం పునరాలోచనలో పడే ఛాన్స్ ఉందని వైసీపీ అంచనా.
ఇక కాపు రిజర్వేషన్లపై మధ్యేమార్గంగా ఉన్న జగన్‌పై ఆ సామాజిక వర్గం కొంత అసంతృప్తిగా ఉంది. అందుకే, తుని కేంద్రంగా జరిగిన కాపు రిజర్వేషన్ ఉద్యమం సందర్భంగా పెట్టిన కేసులను జగన్ ఎత్తివేశాడు. ఆనాడు రత్నాచల్ ఎక్స్ ప్రెస్ ను కొందరు తగులబెట్టారు. పలు చోట్ల ఘర్షణ వాతావరణం ఏర్పడింది.దీంతో అనుమానితులపై పలు కేసులు చంద్రబాబు ప్రభుత్వం పెట్టింది. ప్రస్తుతం విచారణ దశలో ఆ కేసులు ఉన్నాయి. అరెస్ట్ అయిన కొందరు బెయిల్ పై విడుదల అయినప్పటికీ విచారణ ఎదుర్కొంటున్నారు. ఫలితంగా మానసికంగా, ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్లకు ఉపశమనం కలిగేలా జగన్ తీసుకున్న నిర్ణయాన్ని కాపు జాతి అధిపతి ముద్రగడ పద్మనాభం స్వాగతించాడు. అంతేకాదు,దేవుడి రూపంలో సీఎం జగన్ కాపులపై ఉన్న కేసులను ఎత్తివేశాడని అభినందించాడు. పలు అనుమానాలు కాపుజాతికి ఉన్నందున వ్యక్తిగతంగా కలవాలని ఉన్నా కలవలేకపోతున్నానంటూ ప్రకటన విడుదల చేశాడు.కాపులకు రాజకీయ హీరోగా కనిపిస్తోన్న పవన్ ఇప్పుడు జగన్ తీసుకున్న నిర్ణయంపై స్పందించాలని కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషు, ఇతర కాపు సంఘాల నేతలు డిమాండ్ చేశారు. జగన్ చిత్రపటానికి విజయవాడలో క్షీరాభిషేకం చేసిన తరువాత పవన్ మీద సామాజిక కోణాన్ని ఎక్కు పెట్టారు. తుని సంఘటనలోని కేసులను ఎత్తివేసిన జగన్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారా? లేదా? అంటూ నిలదీశారు. కేసులు ఎత్తివేసిన అంశాన్ని రాజకీయ అనుకూలంగా మలుచుకునే ఎత్తుగడలు వైసీపీ వేస్తోంది. ప్రతి జిల్లాలోని కాపు సంఘాల నేతలతో మీటింగ్ లు పెట్టించాలని యోచిస్తున్నారు. ఆ మీటింగ్‌ల ద్వారా కాపు సామాజిక వర్గానికి జగన్ చేసిన మేలును ప్రచారం చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అంతేకాదు, కాపు సంఘాలతో జగన్మోహన్ రెడ్డికి నేరుగా సన్మానాలు, సత్కారాలు చేయించాలని భారీ ప్రణాళికను రచించారని తెలుస్తోంది. దీంతో కాపు సామాజికవర్గం పవన్ ను కాదని జగన్ వైపు కొందరైనా ఉంటారని లెక్కిస్తోంది.
కాపు రిజర్వేషన్లు ఇవ్వడానికి చంద్రబాబు 2014 ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చాడు. దాన్ని అమలు చేయడానికి అనువుగా మంజునాథన్ కమిటీ కూడా వేశాడు. ఆలస్యం అవుతుందని భావించిన ముద్రగడ పద్మనాభం కాపు రిజర్వేషన్ల కోసం పెద్ద ఎత్తున ఉద్యమాన్ని లేపాడు. ఫలితంగా కమిటీ నివేదిక కోసం నియమిత కాలాన్ని చంద్రబాబు పెట్టాడు. అంతేకాదు, 2019 ఎన్నికల సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 10శాతం అగ్రవర్ణ పేదల రిజర్వేషన్లలో ఐదు శాతం కాపులకు ఇస్తానని చంద్రబాబు ప్రకటించాడు. దీంతో వెనుకబడిన వర్గాలు టీడీపీకి పూర్తిగా దూరం జరిగాయి. ఫలితంగా 23 స్థానాలకు టీడీపీ పరిమితం అయింది. క్షేత్రస్థాయిలో బీసీలు, కాపు సామాజికవర్గానికి రాజకీయ వైరం ఎక్కువగా ఉంటుందనడానికి ఆ ఫలితాలను నిదర్శనంగా టీడీపీ తీసుకుంటోంది.2019 ఎన్నికల సందర్భంగా బీసీలు ఎక్కువగా జగన్ వైపు మొగ్గారు. ప్రస్తుతం వాళ్లకు కార్పొరేషన్లు పెట్టడం ద్వారా న్యాయం చేశామని వైసీపీ భావిస్తోంది. అందుకే, ఈసారి కూడా తమవైపే ఉంటారని అంచనా వేస్తోంది. ఇటీవల పూర్తిగా దూరమైన కమ్మ సామాజిక వర్గాన్ని ఎలాగైన కొంత మేరకు అనుకూలంగా మలుచుకోవాలని జగన్ ఎత్తుగడలు వేస్తున్నాడు. దానిలో భాగమే స్వర్గీయ ఎన్టీఆర్ పేరుకు ప్రాధాన్యం ఇవ్వడం. ఇక పవన్ పెట్టిన జనసేన నుంచి కాపులను పూర్తిగా దూరం చేయలేకపోయినప్పటికీ కొంత భాగాన్ని అనుకూలంగా మలుచుకోవడానికి తుని సంఘటన కేసులను ఎత్తివేశాడు. రాబోయే రోజుల్లో ఇలాంటి సోషల్ ఇంజనీరింగ్ ప్రయోగాలు చాలా ఉంటాయని వైసీపీ వర్గాల నుంచి అందుతోన్న సమాచారం. సో..2019లో ఒక్క ఛాన్స్ గెలిపించగా ఈసారి సామాజిక ఇంజనీరింగ్ గట్టెక్కిస్తుందని జగన్ అండ్ కోటరీ బలంగా నమ్ముతుందట.
Related News

Motha Mogiddam : పవన్ కళ్యాణ్ కూడా మోత మోగిస్తాడా..?
చంద్రబాబు అరెస్ట్ కు నిరసనగా టీడీపీ 'మోత మోగిద్దాం' (Motha Mogiddham) అనే వినూత్న కార్యక్రమానికి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.