దేశంలో మరోసారి నోట్ల రద్దు.. ఈసారి రూ. 500 వంతు?!
ప్రభుత్వ విధానాలు, నిర్ణయాల గురించి సరైన సమాచారం కోసం కేవలం అధికారిక వనరులను మాత్రమే నమ్మాలని PIB ప్రజలకు విజ్ఞప్తి చేసింది.
- Author : Gopichand
Date : 20-01-2026 - 9:12 IST
Published By : Hashtagu Telugu Desk
500 Rupee Note Ban: దేశ బ్యాంకింగ్ రెగ్యులేటర్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ప్రభుత్వంతో కలిసి మరోసారి నోట్ల రద్దును అమలు చేయబోతోందా? సుమారు ఒక దశాబ్దం తర్వాత ప్రభుత్వం, ఆర్‌బీఐ కలిసి ‘నోట్ల రద్దు 2.0’కు సిద్ధమవుతున్నాయా? దేశంలో 500 రూపాయల నోట్లు కనుమరుగు కానున్నాయా? ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ ప్రశ్నలు సామాన్య ప్రజలను కలవరపెడుతున్నాయి. గత కొంతకాలంగా 500 రూపాయల నోట్లను రద్దు చేస్తారనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.
దేశ కరెన్సీ వ్యవస్థలో 100 రూపాయల నోటును అతిపెద్ద కరెన్సీగా ఉంచాలని ప్రభుత్వం భావిస్తోందని కూడా ప్రచారం జరుగుతోంది. ఈ పుకార్లు సోషల్ మీడియాలో వ్యాపించినప్పటి నుండి ప్రజలు 10 ఏళ్ల క్రితం జరిగిన నోట్ల రద్దును, అప్పట్లో పడ్డ ఇబ్బందులను గుర్తు చేసుకుంటున్నారు. అయితే ఈ వార్తలపై ప్రభుత్వం తాజాగా స్పష్టతనిచ్చింది. 500 రూపాయల నోట్ల నిషేధంపై ప్రభుత్వం ఏం చెప్పిందో ఇప్పుడు చూద్దాం.
Also Read: మూత్రానికి చీమలు పట్టడం ఏ వ్యాధికి సంకేతం?
PIB ఫ్యాక్ట్ చెక్ నిజం వెల్లడించింది
ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) ఫ్యాక్ట్ చెక్ యూనిట్ సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ ప్రచారాన్ని ఖండించింది. కేంద్ర ప్రభుత్వం 500 రూపాయల నోట్లను రద్దు చేసే యోచనలో ఉందన్న వార్తల్లో నిజం లేదని తేల్చి చెప్పింది. ఈ సమాచారం పూర్తిగా నకిలీ అని స్పష్టం చేసింది. ‘X’ (ట్విట్టర్) వేదికగా స్పందించిన పిఐబి ఫ్యాక్ట్ చెక్.. “భారత ప్రభుత్వం 500 రూపాయల నోట్లను రద్దు చేయాలని యోచిస్తోందని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం నకిలీది” అని పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం అటువంటి ప్రకటన ఏదీ చేయలేదని స్పష్టం చేస్తూ, తప్పుదారి పట్టించే సోషల్ మీడియా పోస్ట్‌ల స్క్రీన్‌షాట్‌లను కూడా షేర్ చేసింది.
PIB హెచ్చరిక
ప్రభుత్వ విధానాలు, నిర్ణయాల గురించి సరైన సమాచారం కోసం కేవలం అధికారిక వనరులను మాత్రమే నమ్మాలని PIB ప్రజలకు విజ్ఞప్తి చేసింది. ఆర్థిక పరమైన నిర్ణయాల విషయంలో తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని కోరింది. ప్రభుత్వం ప్రతిష్టను దెబ్బతీసే ఉద్దేశంతో సోషల్ మీడియాలో వ్యాప్తి చెందుతున్న ఇటువంటి తప్పుడు సమాచారాన్ని పిఐబి ఫ్యాక్ట్ చెక్ యూనిట్ ఎప్పటికప్పుడు బట్టబయలు చేస్తూనే ఉంటుంది.