Chevireddy Bhaskar Reddy: మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డిపై పోక్సో కేసు నమోదు
వైఎస్సార్‌సీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిపై పోక్సో కేసు నమోదైంది. ఎర్రావారిపాలెం మండలంలో బాలికపై అత్యాచారం జరిగిందని తప్పుడు ప్రచారం చేయడంపై ఆమె తండ్రి ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.
- By Kode Mohan Sai Published Date - 11:52 AM, Tue - 26 November 24

వైఎస్సార్‌సీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పై కేసు నమోదైంది. ఇటీవల, ఓ బాలికపై దుష్ప్రచారం చేశారని, ఆమెపై అత్యాచారయత్నం జరిగిందని దుష్ప్రచారం చేసారని ఆమె తండ్రి ఆరోపించారు. ఈ దుష్ప్రచారంతో బాలిక భవిష్యత్తుకు నష్టం వాటిళ్లుతుందని, మా కుటుంబం పరువు ప్రతిష్టకు భంగం కలుగుతుంది అని పిటిషనర్ ఫిర్యాదు చేశాడు.
ఈ ఫిర్యాదు ఆధారంగా, యర్రావారిపాలెం పోలీసులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పై కేసు నమోదు చేశారు. కేసు POCSO (పోక్సో) చట్టం, అట్రాసిటీ చట్టం వంటి సెక్షన్ల కింద నమోదు చేయబడింది. పోలీసులు 352, 351/2, 196, 61/2, 353 తదితర సెక్షన్లలో కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. బాధిత కుటుంబం దళిత కుటుంబానికి చెందినది కావడంతో ఈ సెక్షన్లు నమోదు చేయడం తప్పనిసరి అయింది. సమాచారం మేరకు, పోలీసులు కేసు లో తీవ్రతను దృష్టిలో పెట్టుకుని, అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు.
ఈ నెల 4న తిరుపతి జిల్లా ఎర్రావారిపాళెం మండలంలో బాలిక సాయంత్రం స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళిపోతుండగా, కొంతమంది వ్యక్తులు ఆమెను ముళ్లపొదల్లోకి తీసుకెళ్లి దాడి చేసారు. ఈ ఘటన దురదృష్టవశాత్తు కలకలం రేపింది. బాలికను వెంటనే ఆస్పత్రికి తరలించగా, ఆ సమయంలో సోషల్ మీడియా లో ఆమెపై అత్యాచారం జరిగినట్లు ప్రచారం జరిగింది.
ఈ నేపథ్యంలో, తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు వెంటనే స్పందించి, బాలికను పరామర్శించారు. వారు ఈ ఘటనపై విచారణ చేపట్టారు. ఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం, ఇద్దరు వ్యక్తులు బైక్‌పై వచ్చి బాలికను అడ్డుకొని, ఆమెను ప్రేమించమని వేధించారని, ఆమె వారిని అడ్డుకోవడంలో భాగంగా ఆమెకు గాయాలు అయ్యాయని చెప్పారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారని, అత్యాచారానికి సంబంధించి ఎలాంటి ఆధారాలు లభించలేదని సుబ్బారాయుడు వెల్లడించారు.
తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు మాట్లాడుతూ, బాలికపై అత్యాచారం జరిగినట్లు కొంతమంది ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. రాజకీయ పార్టీలు మరియు మీడియా నిరాధారంగా “అత్యాచారం జరిగిందని” ప్రచారం చేయడం సరికాదని, డాక్టర్లు, పోలీసులు మరియు బాలిక తండ్రి ఏం చెప్పకుండానే ఇష్టం వచ్చినట్లు ప్రచారం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
బాలికపై దాడి చేసిన వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. బాలిక తండ్రి కూడా ఈ విషయాన్ని స్పష్టం చేసినట్లు, రాజకీయ నేతలు తప్పుడు ప్రచారాలతో తన కూతురు పరువు పోతుందని, ఇలాంటి ప్రచారాల వల్ల తన బిడ్డ భవిష్యత్తు నాశనం అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో, బాలిక తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.