peddireddy : పెద్దిరెడ్డి భూ ఆక్రమణలపై విచారణకు డిప్యూటీ సీఎం ఆదేశం..
అటవీ భూముల రికార్డులు ఎక్కడైనా తారుమారు చేశారా?..చేసిన పక్షంలో అందుకు బాధ్యులెవరు?.. తద్వారా లబ్ధి పొందింది ఎవరు?.. అనేది నివేదికలో వివరించాలన్నారు.
- By Latha Suma Published Date - 02:42 PM, Wed - 29 January 25

peddireddy : మాజీ మంత్రి, వైసీపీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అటవీ భూములను ఆక్రమించారన్న ఆరోపణలపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ విచారణకు ఆదేశించారు. చిత్తూరు జిల్లా మంగళంపేట సమీపంలో అడవులను ధ్వంసం చేసి భూములు ఆక్రమించారని పెద్దిరెడ్డిపై ఆరోపణలు ఉన్నాయి. దీనిపై విచారించి నివేదిక సమర్పించాలని అటవీ శాఖ ఉన్నతాధికారులకు పవన్ సూచించారు.
అటవీ భూముల రికార్డులు ఎక్కడైనా తారుమారు చేశారా?..చేసిన పక్షంలో అందుకు బాధ్యులెవరు?.. తద్వారా లబ్ధి పొందింది ఎవరు?.. అనేది నివేదికలో వివరించాలన్నారు. అటవీ భూములు ఆక్రమించినవారిపై చట్టపరంగా ముందుకు వెళ్లాలని పవన్ కల్యాణ్ సూచించారు. అటవీ భూములు ఏ మేరకు ఆక్రమించారు?.. అక్కడ ఉన్న అడవులను ఏ విధంగా ధ్వంసం చేశారో విచారణ చేపట్టాలని, పుంగనూరు నియోజకవర్గం పరిధిలో ఉన్న అటవీ భూముల వివరాలు ఇవ్వాలని.. వాటి రికార్డులను పరిశీలించి, ఆక్రమణలపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. సత్వరమే ప్రాథమిక నివేదిక ఇవ్వాలని పి.సి.సి.ఎఫ్ ను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశించారు.
కాగా, పుంగనూరు నియోజకవర్గం పులిచర్ల మండలం మంగళంపేట రెవెన్యూ గ్రామ పరిధిలో అటవీ ప్రాంతంలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పెద్దిరెడ్డి తన అక్రమ సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారు. అందులో విలాసవంతమైన భవనంతో పాటు వ్యవసాయ క్షేత్రాన్ని కూడా ఏర్పాటు చేశారు. అంతే కాదు అక్కడకు వెళ్లేందుకు ప్రభుత్వ సొమ్ముతో రోడ్డును కూడా వేశారు. ఈ విషయం వెలుగులోకి రావడంతో ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. దీనికి సంబంధించి ప్రాథమిక నివేదిక కూడా ప్రభుత్వానికి చేరింది.
మరోవైపు మాజీ మంత్రి పెద్దిరెడ్డి అటవీ భూముల భక్షణ పై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు ఉన్నతాధికారులు విచారణకు జాయింట్ కమిటీ ఏర్పాటు చేశారు. చిత్తూరు జిల్లా కలెక్టర్, ఎస్పీ, అనంతపురం కన్జెర్వేటర్ ఆఫ్ ఫారెస్టు అధికారులతో జాయింట్ కమిటీ ఏర్పాటు అయింది. జాయింట్ కమిటీలో సభ్యులుగా చిత్తూరు కలెక్టర్ సుమిత్, జిల్లా ఎస్పీ మనికంఠ చందోలు, ఐఎఫ్ఎస్ అధికారి యశోద బాయ్ ఉన్నారు. దర్యాప్తు నివేదిక ఆధారంగా ప్రభుత్వం తదుపరి చర్యలు తీసుకోనుంది.
Read Also: SSMB29.. ప్రియాంక చోప్రా రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..?