CM Chandrababu : అనాథ పిల్లలకు కూడా తల్లికి వందనం
CM Chandrababu : ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది కాలం పూర్తైన సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు.
- By Kavya Krishna Published Date - 01:13 PM, Thu - 12 June 25

CM Chandrababu : ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది కాలం పూర్తైన సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. అభివృద్ధి, సంక్షేమం అనేవి తమకు రెండు కళ్లు అన్న భావనతోనే ప్రభుత్వాన్ని నడిపిస్తున్నామని స్పష్టం చేశారు. తల్లుల కోసం ప్రవేశపెట్టిన “తల్లికి వందనం” పథకం ద్వారా లక్షలాది మంది పిల్లల భవిష్యత్తు కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.
“సూపర్ సిక్స్” వాగ్దానాల్లో ఒకటైన ఈ పథకం కింద తల్లికి నిజమైన గౌరవం ఇవ్వాలని నిర్ణయించామని, అందుకే ఎంతమంది పిల్లలున్నా అందరికీ ఈ పథకం ప్రయోజనం అందేలా చర్యలు తీసుకున్నామని సీఎం చెప్పారు. తల్లిలేని పిల్లలకు, అనాథలకు కూడా ఈ పథకం వర్తించేలా మార్గదర్శకాలను రూపొందించామని తెలిపారు.
ఈ పథకం కింద 67 లక్షల మంది లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా నగదు జమ చేయనున్నట్లు వెల్లడించారు. తల్లిలేని పిల్లలయితే, వారి తండ్రులు లేదా సంరక్షకుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని చెప్పారు. ఈ పథకం ద్వారా పిల్లలకు విద్య, ఆరోగ్య పరిరక్షణతో పాటు తల్లుల పాత్రను గుర్తించి గౌరవించే విధానానికి ఆంధ్రప్రదేశ్ మార్గదర్శకంగా నిలుస్తుందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
“మేము మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను మాత్రమే కాదు, ప్రజల అభ్యర్థన మేరకు చెప్పనివి కూడా అమలు చేస్తున్నాం. సంపదను సృష్టించి, ఆదాయాన్ని పెంచి, ఆ ఆదాయాన్ని అభివృద్ధి, సంక్షేమ రంగాలకు వినియోగిస్తున్నాం. ప్రజలే మా ప్రేరణ, వారి ఆశలే మా లక్ష్యం” అని సీఎం చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
Raja Singh : వారిని వదిలిపెట్ట.. రాజాసింగ్ వార్నింగ్