Nara Lokesh: గ్రూప్-1, 2 అభ్యర్థులకు వయోపరిమితి 44 ఏళ్లకు పెంచాలని లోకేష్ డిమాండ్
గ్రూప్-1, 2 పోటీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థుల వయోపరిమితిని 44 ఏళ్లకు పెంచాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ డిమాండ్ చేశారు.వార్షిక ఉద్యోగ క్యాలెండర్ జారీ చేయడంలో సీఎం జగన్ విఫలమయ్యారని లోకేష్ ఆరోపించారు.
- By Praveen Aluthuru Published Date - 06:59 PM, Thu - 14 December 23

Nara Lokesh: గ్రూప్-1, 2 పోటీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థుల వయోపరిమితిని 44 ఏళ్లకు పెంచాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ డిమాండ్ చేశారు.వార్షిక ఉద్యోగ క్యాలెండర్ జారీ చేయడంలో సీఎం జగన్ విఫలమయ్యారని లోకేష్ ఆరోపించారు. ఈ మేరకు నారా లోకేష్ సీఎం జగన్ కు లేఖ రాశారు. తెలంగాణ విధానాన్ని ఏపీలోనూ అమలు చేయాలని లోకేష్ లేఖలో పేర్కొన్నారు. నాలుగున్నరేళ్లుగా నిర్లక్ష్యం కారణంగా యువత భవిష్యత్తు నాశనం అయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలు దగ్గర పడుతుండటంతో మరోసారి నోటిఫికేషన్ల పేరుతో మోసం చేసేందుకు సిద్ధమయ్యారని లోకేష్ విమర్శించారు.
కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టి రాజకీయ లబ్ధి పొందాలని వైఎస్ఆర్సీపీ కుట్ర చేస్తుందని లోకేష్ అన్నారు. గత ఎన్నికల సమయంలో జగన్ ఎన్నో హామీలు ఇచ్చారని, ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఒక్కటి కూడా నెరవేర్చలేదని ఆరోపించారు.అన్యాయాన్ని ఎదురించి ఎవరైనా ప్రశ్నిస్తే బెదిరించి అక్రమ కేసులు పెట్టడం పరిపాటిగా మారిందన్నారు నారా లోకేష్. యువగళం పాదయాత్రలో భాగంగా అనకాపల్లి జిల్లా యలమంచిలిలో పదవీ విరమణ పొందిన ఉద్యోగులతో లోకేష్ ఈ రోజు ముఖాముఖిలో మాట్లాడారు.
ఎన్నికలు దగ్గరపడుతున్నాయని చెప్పిన లోకేష్ పేదలు, భూకబ్జాదారుల మధ్య ఎన్నికలు జరగబోతున్నాయని పేర్కొన్నారు. అడ్డగోలుగా దోచుకోవడమే వైకాపా పని అని విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా ఇసుక, మద్యం దోచుకుంటున్నారని ఫిర్యాదు చేశారు. ఆరోగ్యశ్రీని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్.
Also Read: IAS Transfers: తెలంగాణలో ఐఏఎస్‌ల బదిలీలు.. హెచ్ఎండీఏ జాయింట్ కమిషనర్‌గా ఆమ్రపాలి