YSRCP vs TDP: సీఎం జగన్ పై.. నారా లోకేష్ ఫైర్..!
- By HashtagU Desk Published Date - 04:48 PM, Sat - 26 March 22

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలు రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్ అవుతున్నాయి. రాష్ట్రంలో వైసీపీ నేతల ఆగడాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయని, రాష్ట్రాన్ని రావణ కాష్టం చేయడానికి వైసీపీ నేతలు కంకణం కట్టుకున్నారని లోకేష్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
రాష్ట్రంల దోపిడీలు చేస్తూ, కబ్జాలు చేసుకోవడానికి, ఎవరైనా అడ్డిపడితే వారిని చంపడానికి, రాష్ట్ర ప్రజలే అధికారం కట్టబెట్టి లైసెన్సు ఇచ్చారు అన్నట్లుగా వైసీపీ బ్యాచ్ దారుణాలకు తెగబడుతున్నారని లోకేష్ ఆరోపించారు. ఇక ఏపీలోని చిత్తూరు జిల్లా కురబలకోట మండలం కొంగావారిపల్లికి చెందిన గాజుల వ్యాపారి రమణమ్మని ఆర్థిక వ్యవహారాలలో ఏర్పడిన వివాదంతో వైసీపీ నేత ఎన్. వెంకట్రమణారెడ్డి అతి దారుణంగా కొట్టి చంపడం రాష్ట్రంలో వైసీపీ దండుపాళ్యం గ్యాంగ్ అరాచకాలకి పరాకాష్ట అని లోకేష్ అన్నారు.
ఇక జగన్‌రెడ్డి దిశ వాహనాలకి జెండా ఊపి ప్రారంభించి, రాష్ట్రంలో మహిళల భద్రతకి నాది భరోసా అని మాయమాటలు చెప్పి మూడురోజులు గవడవక ముందే, వైసీపీకి చెందిన వెంకట్రమణారెడ్డి, ఓ మహిళని అత్యంత పాశవికంగా కొట్టి చంపేశాడని లోకేష్ గుర్తు చేశారు. ఇదేనా ముఖ్యమంత్రి జగన్ రెడ్డి మహిళలకు మీరిచ్చే భద్రత.. అండగా నిలవాల్సిన ప్రభుత్వమే అంతమొందిస్తుంటే, న్యాయం చేయాల్సిన పోలీసులు అన్యాయంగా వ్యవహరిస్తుంటే, రాష్ట్రప్రజల ప్రాణాలకి దేవుడే దిక్కు అంటూ లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మరి లోకేష్ వ్యాఖ్యల పై వైసీపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.