MLA Yarlagadda: యువకుడ్ని ఆపదలో ఆదుకున్న ఎమ్మెల్యే యార్లగడ్డ.. ఏం చేశారంటే?
ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు సిఫార్సు మేరకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ప్రవీణ్ చికిత్స కోసం రూ. 3 లక్షలు మంజూరు అయ్యాయి. గురువారం ఉదయం ముఖ్యమంత్రి సహాయ నిధి ఎల్.ఓ.సి.ని ఎమ్మెల్యే వెంకట్రావు స్వయంగా ప్రవీణ్ కుటుంబ సభ్యులకు అందజేశారు.
- Author : Gopichand
Date : 04-12-2025 - 4:37 IST
Published By : Hashtagu Telugu Desk
MLA Yarlagadda: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి, వైద్య చికిత్స కోసం ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న యువకుడి పాలిట ప్రభుత్వ విప్, గన్నవరం శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు (MLA Yarlagadda) ఆపద్బాంధవుడిగా నిలిచారు. ముఖ్యమంత్రి సహాయ నిధి (CM Relief Fund) నుండి తక్షణమే ఆర్థిక సాయం మంజూరు చేయించి, ఆ కుటుంబానికి అండగా నిలబడ్డారు.
రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలు
బాపులపాడు మండలం తిప్పనగుంట గ్రామానికి చెందిన ముర్రాల ప్రవీణ్ (24) గత నెల 28వ తేదీన గుడివాడ సమీపంలోని నాగారప్పాడు వంతెన వద్ద జరిగిన కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన ప్రవీణ్‌ను మెరుగైన వైద్యం కోసం విజయవాడలోని స్వర హాస్పిటల్‌కు తరలించారు. క్షతగాత్రుడికి తక్షణమే ఆపరేషన్ చేయాల్సి ఉందని, దీనికి సుమారు రూ. 4 లక్షలు ఖర్చు అవుతుందని వైద్యులు కుటుంబ సభ్యులకు తెలియజేశారు.
ఎమ్మెల్యే చొరవతో తక్షణ సాయం
ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ప్రవీణ్ కుటుంబ సభ్యులు, కాకులపాడు ఛానల్ డీసీ చైర్మన్ కొమ్మారెడ్డి రాజేష్ ను కలిసి ప్రభుత్వ సహాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. రాజేష్ వెంటనే ఈ సమస్యను ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు దృష్టికి తీసుకెళ్లారు.
సమస్య తెలుసుకున్న ఎమ్మెల్యే వెంకట్రావు వెంటనే స్పందించి స్వర హాస్పిటల్ యాజమాన్యంతో మాట్లాడి ప్రవీణ్‌కు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. అంతేకాకుండా చికిత్సకు అయ్యే ఖర్చు కోసం సాయం మంజూరు చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి సహాయ నిధికి సిఫార్సు చేశారు. ఎల్.ఓ.సి మంజూరయ్యేంతవరకు ఆయన స్వయంగా సీఎం సహాయ నిధి కార్యాలయంతో సంప్రదింపులు జరిపారు.
కుటుంబానికి రూ. 3 లక్షల ఆర్థిక భరోసా
ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు సిఫార్సు మేరకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ప్రవీణ్ చికిత్స కోసం రూ. 3 లక్షలు మంజూరు అయ్యాయి. గురువారం ఉదయం ముఖ్యమంత్రి సహాయ నిధి ఎల్.ఓ.సి.ని ఎమ్మెల్యే వెంకట్రావు స్వయంగా ప్రవీణ్ కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా ప్రవీణ్ కుటుంబ సభ్యులు మాట్లాడుతూ.. “మా కుటుంబం పాలిట యార్లగడ్డ వెంకట్రావు ఆపద్బాంధవుడిలా నిలిచారు. మెరుగైన వైద్యం అందేటట్లు చూడడమే కాకుండా, రూ. 3 లక్షల సాయం ఏర్పాటు చేసి మమ్మల్ని ఆదుకున్నారు. వెంకట్రావు గారికి మేము ఎప్పటికీ రుణపడి ఉంటాము” అని కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కొమ్మారెడ్డి రాజేష్, తిప్పనగుంట గ్రామ పాల కేంద్రం ప్రెసిడెంట్ బుద్దాల రంగారావు, కొడాలి చిట్టిబాబు, వేపూరి నవీన్, తదితరులు పాల్గొన్నారు.