Putin Staying Suite: ఐటీసీ మౌర్యలో కట్టుదిట్టమైన భద్రత.. పుతిన్ కోసం ‘చాణక్య సూట్’ సిద్ధం, ప్రత్యేకతలీవే!
ITC మౌర్య 40 ఏళ్లుగా ప్రపంచ ప్రముఖులకు ఆతిథ్యం ఇస్తోంది. ఇది లగ్జరీకి బెంచ్‌మార్క్‌గా నిలుస్తుంది. 411 గదులు, 26 సూట్‌లు ఉన్న ఈ హోటల్‌లో అతిథుల కోసం 'ఎగ్జిక్యూటివ్ క్లబ్' రూమ్‌ల నుండి అత్యంత విలాసవంతమైన 'లగ్జరీ సూట్‌లు' వరకు వివిధ రకాల వసతులు అందుబాటులో ఉన్నాయి.
- By Gopichand Published Date - 04:27 PM, Thu - 4 December 25
Putin Staying Suite: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తన రెండ్రోజుల అత్యంత కీలకమైన పర్యటన కోసం ఈరోజు (డిసెంబర్ 4) న్యూఢిల్లీకి చేరుకోనున్నారు. ఈ పర్యటన నేపథ్యంలో పుతిన్ (Putin Staying Suite) బస చేయనున్న ఐటీసీ మౌర్య (ITC Maurya) హోటల్ చుట్టూ కట్టుదిట్టమైన భద్రతా వలయాన్ని ఏర్పాటు చేశారు.
పుతిన్ సాయంత్రం 4:30 గంటలకు ఢిల్లీకి చేరుకోవాల్సి ఉండగా.. అంతకు ముందే రష్యా నుంచి పూర్తి భద్రతా సిబ్బంది హోటల్‌కు చేరుకున్నారు. హోటల్‌లోని అన్ని గదులు బుక్ చేసుకుని, కారిడార్‌లను తమ అధీనంలోకి తీసుకున్నారు. ప్రవేశ ద్వారాల వద్ద కట్టుదిట్టమైన నిఘా ఏర్పాటు చేశారు. పర్యటన సజావుగా సాగేందుకు బహుళ భద్రతా సంస్థలు ప్రత్యేక భద్రతా వలయాలు, ప్రవేశ నియంత్రణలు, త్వరిత-ప్రతిస్పందన బృందాలను సిద్ధం చేశాయి.
Also Read: Gambhir- Agarkar: టీమిండియాను నాశనం చేస్తున్న అగార్కర్, గంభీర్!
అధ్యక్షుల విడిది- చాణక్య సూట్ ప్రత్యేకతలు
DNA ఇండియా నివేదిక ప్రకారం.. అధ్యక్షుడు పుతిన్ ITC మౌర్య అత్యంత విలాసవంతమైన చాణక్య సూట్‌లో బస చేయనున్నారు. ఇది గతంలో అనేక మంది ప్రపంచ నాయకులకు ఆతిథ్యం ఇచ్చింది. ఈ సూట్ 4,600 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటుంది. ఒక్క రాత్రి అద్దె సుమారు రూ. 8-10 లక్షలుగా అంచనా. లోపలి అలంకరణ ప్రాచీన భారతీయ రాజసంతో ఆధునిక సౌకర్యాన్ని మిళితం చేస్తుంది. పట్టు గోడలు, ముదురు చెక్క నేలలు, అర్థశాస్త్రం ప్రేరణతో కూడిన చిత్రాలు, తైబ్ మెహతా వంటి కళాకారుల కళాఖండాలు ఇక్కడి ప్రత్యేకత. ఇందులో వాక్-ఇన్ క్లోసెట్‌తో కూడిన మాస్టర్ బెడ్‌రూమ్, ప్రైవేట్ ఆవిరి గది, వ్యాయామశాల, 12 సీట్ల డైనింగ్ రూమ్, ఆఫీస్ స్థలాలతో పాటు చేతితో చెక్కబడిన ఇంటీరియర్‌లు, న్యూఢిల్లీని వీక్షించే విశాల దృశ్యాలు ఉన్నాయి.
ITC మౌర్య.. ప్రపంచ నాయకులకు చిరునామా
ITC మౌర్య 40 ఏళ్లుగా ప్రపంచ ప్రముఖులకు ఆతిథ్యం ఇస్తోంది. ఇది లగ్జరీకి బెంచ్‌మార్క్‌గా నిలుస్తుంది. 411 గదులు, 26 సూట్‌లు ఉన్న ఈ హోటల్‌లో అతిథుల కోసం ‘ఎగ్జిక్యూటివ్ క్లబ్’ రూమ్‌ల నుండి అత్యంత విలాసవంతమైన ‘లగ్జరీ సూట్‌లు’ వరకు వివిధ రకాల వసతులు అందుబాటులో ఉన్నాయి. అయినప్పటికీ దేశాధినేతల కోసం ప్రత్యేకంగా ఉంచబడిన చాణక్య సూట్ ఈ హోటల్‌కే మణిహారంగా మిగిలింది. పుతిన్ వంటి ప్రముఖుల కోసం హోటల్ విలాసం, కట్టుదిట్టమైన భద్రత రెండింటిని అందిస్తూ ఒక కోటలా మారనుంది.