Minister Lokesh : 25న అమెరికా పర్యటనకు వెళ్లనున్న మంత్రి లోకేశ్
Minister Lokesh : నవంబర్ 1 వరకు ఆయన పలు కంపెనీల ప్రతినిధులతో భేటీ కానున్నారు. పెట్టుబడులను ఆకర్షించేలా పలు కాన్ఫరెన్స్‌లలో పాల్గొననున్నారు. నవంబర్ 1న శానిఫ్రాన్సిస్కోలో జరగనున్న 9వ ఐటీ సర్వ్ సినర్జీ కాన్ఫరెన్స్‌లో ఏపీలో పెట్టుబడుల పై అనువైన అవకాశాలను వివరించనున్నారు.
- By Latha Suma Published Date - 08:47 PM, Thu - 17 October 24

Investments : ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతున్న ఏపీని గట్టెక్కించేందుకు ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడంతోనే అప్పులను అధిగమించగలమని భావిస్తోంది. ఇందుకోసం ప్రముఖ కంపెనీలను రాష్ట్రానికి ఆహ్వానించాలని నిర్ణయించుకుంది. 2014-19లో ఏ విధంగా అయితే రాష్ట్రానికి పెట్టుబడులను ఆహ్వానించిందో అదే పద్ధతిని అనుసరించేలా కసరత్తులు ప్రారంభించింది. ఐటీ మంత్రి లోకేశ్ ద్వారా విదేశీ పెట్టుబడులను ఆకర్షించేలా ప్లాన్ చేసింది.
ఇందులో భాగంగా మంత్రి నారా లోకేశ్ ఈ నెల 25న అమెరికా లో పర్యటించనున్నారు. అంతేకాదు నవంబర్ 1 వరకు ఆయన పలు కంపెనీల ప్రతినిధులతో భేటీ కానున్నారు. పెట్టుబడులను ఆకర్షించేలా పలు కాన్ఫరెన్స్‌లలో పాల్గొననున్నారు. నవంబర్ 1న శానిఫ్రాన్సిస్కోలో జరగనున్న 9వ ఐటీ సర్వ్ సినర్జీ కాన్ఫరెన్స్‌లో ఏపీలో పెట్టుబడుల పై అనువైన అవకాశాలను వివరించనున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెడితే ప్రభుత్వం కల్పించే రాయితీలు, సహాయ, సౌకర్యాలపై కాన్ఫరెన్స్‌లో క్షుణ్ణంగా చెప్పనున్నారు. ఈ మేరకు ఆయన అమెరికా పర్యటనకు అన్ని ఏర్పాట్లు చేశారు. మంత్రి లోకేశ్‌తో పలువురు టీడీపీ నేతలు, అధికారులు సైతం వెళ్లనున్నారు.