TDP vs YSRCP : చంద్రబాబుపై మంత్రి అమర్‌నాథ్ ఫైర్.. అమరావతి రైతుల్ని రెచ్చగొట్టేలా..?
ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై మంత్రి గుడివాడ అమర్‌నాథ్...
- By Prasad Published Date - 02:40 PM, Fri - 9 September 22

ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ఫైర్ అయ్యారు. విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా చేయాలనేది సీఎం వైఎస్ జగన్ ఆలోచనని.. రాష్ట్రానికి ఎట్టిపరిస్థితుల్లోనూ మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామని ఆయన అభిప్రాయం వెల్లడించారు. మూడు రాజధానుల బిల్లును త్వరలో అసెంబ్లీలో ప్రవేశపెడతామన్నారు. అమరావతి వివాదాలు, వాస్తవాలు పుస్తకావిష్కరణ సందర్భంగా ప్రతిపక్ష నేత చంద్రబాబు, పలువురు రాజకీయ నేతలు రెచ్చగొట్టేలా మాట్లాడారని మంత్రి అమర్‌నాథ్ విమర్శించారు. అమరావతి పేరుతో గుంటూరు, విజయవాడలకు అన్యాయం చేశారని, ఇతర జిల్లాలను విస్మరించి కేవలం 29 గ్రామాల కోసమే పోరాడుతున్నారని అన్నారు.
అమరావతి రైతు మహా పాదయాత్రపై మంత్రి స్పందిస్తూ.. రైతుల పాదయాత్ర కేవలం 29 గ్రామాలకే చెందుతుందని, విశాఖలో కార్యనిర్వాహక రాజధాని కావాలన్న విశాఖవాసుల కలను వ్యతిరేకిస్తున్నారని ఆరోపించారు. రైతు మహా పాదయాత్ర ఉత్తర కోస్తా ఆంధ్రపై దండయాత్ర అని.. దీనికి వ్యతిరేకంగా ప్రజలు తిరుగుబాటు చేస్తారని అమర్‌నాథ్ అన్నారు. మరోవైపు అమరావతిని రాష్ట్ర రాజధానిగా అభివృద్ధి చేసేందుకు హైకోర్టు ఆదేశాలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ అమరావతి రైతులు మహా పాదయాత్రకు సిద్ధమయ్యారు.