Kasireddy Vs Liquor Scam: సిట్ ఎదుటకు కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి .. ఏపీ లిక్కర్ స్కాంలో పాత్రేమిటి ?
మద్యం సరఫరా ఆర్డర్లను పొందే కంపెనీలు చెల్లించే లంచాల వసూళ్ల కోసం క్యాష్ హ్యాండ్లర్లు(Kasireddy Vs Liquor Scam), క్యాష్ కొరియర్లతో కూడిన ఏడంచెల వ్యవస్థను స్వయంగా రాజ్ కసిరెడ్డే పర్యవేక్షించే వారట.
- By Pasha Published Date - 10:23 AM, Wed - 9 April 25

Kasireddy Vs Liquor Scam: కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి(రాజ్ కసిరెడ్డి).. ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం, వైఎస్ జగన్ దూరపు బంధువు. వైఎస్సార్ సీపీ హయాంలో ఏపీలో జరిగిన రూ.వేల కోట్ల లిక్కర్ స్కాంకు సంబంధించిన అభియోగాలను ఎదుర్కొంటున్న ఈయనకు ఇప్పటికే ప్రత్యేక దర్యాప్తు టీం (సిట్) మూడుసార్లు నోటీసులు ఇచ్చింది. సిట్‌కు విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు నేతృత్వం వహిస్తున్నారు. ఇటీవలే మూడోసారి కసిరెడ్డికి నోటీసులు జారీ చేసిన సిట్.. ఏప్రిల్ 9న (బుధవారం) తప్పకుండా విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. అంతకుముందు సిట్ జారీ చేసిన రెండు నోటీసులపై కసిరెడ్డి హైకోర్టును ఆశ్రయించినా ఊరట దక్కలేదు. దీంతో ఈసారి ఆయన తప్పనిసరిగా సిట్ విచారణకు హాజరుకావాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఇవాళ కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి సిట్ ఎదుటకు వస్తారా ? రారా ? అనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
Also Read :MBiPC Benefits : ఇంటర్‌లో ఇక ఎంబైపీసీ గ్రూపు.. కొత్త మార్పులు, మార్కుల వివరాలివీ
కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డిపై అభియోగాలు ఏమిటి ?
- ‘‘ఏపీలో జరిగిన మద్యం కుంభకోణంలో కర్త, కర్మ, క్రియ రాజ్ కసిరెడ్డే’’ అని ఇటీవలే విజయసాయిరెడ్డి వెల్లడించారు. దీంతో ఈ కుంభకోణంలో రాజ్ కసిరెడ్డి పాత్ర మరోమారు తెరపైకి వచ్చింది.
- జగన్ పాలనా కాలంలో నాటి ప్రభుత్వ పెద్దలకు లంచాలు చెల్లించేందుకు అంగీకరించినవారికే మద్యం సరఫరా ఆర్డర్లు కట్టబెట్టడం, వారినుంచి ముడుపులు వసూలు చేయడం వంటి పనులన్నీ రాజ్ కసిరెడ్డే చేసేవారట. సీఐడీ, సిట్ దర్యాప్తులో ఇప్పటికే దీనికి కీలక ఆధారాలు లభ్యమయ్యాయి.
- 2019 ఎన్నికలకు ముందు వైఎస్ జగన్‌తో రాజ్ కసిరెడ్డి కలిసి పనిచేశారు. దీంతో వైఎస్సార్ సీపీ అధికారంలోకి రాగానే ఆయన్ను రాష్ట్రప్రభుత్వ ఐటీ సలహాదారుగా నియమించారు.
- అయితే మద్యం కుంభకోణంలో కీలకపాత్ర పోషించారనే అభియోగాలు రాజ్ కసిరెడ్డిపై నమోదు కావడం గమనార్హం.
- వైఎస్సార్ సీపీ హయాంలో ఒక్కో మద్యం కేసుకు రూ.150 నుంచి రూ.450 దాకా లంచాలు తీసుకున్నారని, నెలకు రూ.60 కోట్ల చొప్పున నాలుగేళ్ల రెండు నెలల్లో రూ.3వేల కోట్లు కొల్లగొట్టారనే ఆరోపణలు వచ్చాయి.
- లంచాల వసూళ్ల నెట్‌వర్క్ రూపకల్పనలో ఒక వైఎస్సార్ సీపీ అగ్రనేత కుమారుడు మాస్టర్‌మైండ్‌గా వ్యవహరించగా, దాన్ని రాజ్ కసిరెడ్డి అమలు చేయించాడని అంటున్నారు.
- హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ కేంద్రంగా ఒక కార్యాలయం ఏర్పాటుచేసుకుని ఈ దందా నడిపారని చెబుతున్నారు.
- ఏ కంపెనీ నుంచి ఎంత మద్యం కొనాలి ? ప్రభుత్వ మద్యం దుకాణాల్లో ఏ రోజు ఏ బ్రాండ్లు అమ్మాలి ? అనేది రాజ్ కసిరెడ్డి ఆదేశాల మేరకే జరిగేవని సిట్ విచారణలో తేలింది.
లంచాల సేకరణకు పెద్ద నెట్‌వర్క్
మద్యం సరఫరా ఆర్డర్లను పొందే కంపెనీలు చెల్లించే లంచాల వసూళ్ల కోసం క్యాష్ హ్యాండ్లర్లు(Kasireddy Vs Liquor Scam), క్యాష్ కొరియర్లతో కూడిన ఏడంచెల వ్యవస్థను స్వయంగా రాజ్ కసిరెడ్డే పర్యవేక్షించే వారట. లంచాలు చెల్లించేందుకు ప్రతి మద్యం కంపెనీ ఒకరిని ప్రతినిధిగా నియమించేదట. మద్యం కంపెనీ ప్రతినిధుల నుంచి లంచం డబ్బులు క్యాష్ హ్యాండ్లర్లకు, వారి నుంచి రాజ్ కసిరెడ్డి నియమించిన కొరియర్లకు అందేవి. క్యాష్ కొరియర్లు తీసుకున్న డబ్బు ఒక వ్యక్తికి అందేది. అతడి నుంచి డబ్బంతా నేరుగా రాజ్ కసిరెడ్డికి అందేది. రాజ్ కసిరెడ్డి నుంచి ఈ డబ్బు ఒక వైఎస్సార్ సీపీ టాప్ లీడర్ కుమారుడికి అందేది. అతడి నుంచి అది చివరగా చేరాల్సిన చోటుకు చేరేదట.