Deputy CM Pawan Kalyan: కాకినాడ దేశానికే మోడల్ కావాలి: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
పారిశ్రామిక అభివృద్ధి రాష్ట్ర ఆర్థిక వృద్ధికి అవసరమైనప్పటికీ, పెరుగుతున్న పరిశ్రమలతో ప్రజల్లో, ముఖ్యంగా తీర ప్రాంత మత్స్యకారుల్లో ఆందోళనలు ఉన్నాయని పవన్ కళ్యాణ్ అన్నారు.
- By Gopichand Published Date - 10:20 AM, Sun - 12 October 25

Deputy CM Pawan Kalyan: తీర ప్రాంత కాలుష్యం, పారిశ్రామిక వ్యర్థాల నియంత్రణ విషయంలో కఠినంగా వ్యవహరించాలని, ఈ చర్యలు దేశానికే ఆదర్శంగా నిలవాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ (Deputy CM Pawan Kalyan) అధికారులను ఆదేశించారు. పిఠాపురం నియోజకవర్గంతో పాటు కాకినాడ జిల్లా పరిధిలోని కాలుష్య నివారణకు తీసుకోవాల్సిన ప్రణాళికలపై కాలుష్య నియంత్రణ మండలి (PCB) అధికారులతో శనివారం మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో ఆయన సమగ్ర సమీక్షా సమావేశం నిర్వహించారు.
మత్స్యకారుల ఆందోళనలపై తక్షణ అధ్యయనం
ఇటీవల ఉప్పాడ తీర ప్రాంతంలో మత్స్యకారులు వ్యక్తం చేసిన ఆందోళనల దృష్ట్యా, అక్కడి పరిస్థితులపై తక్షణం అధ్యయనం చేపట్టి సమగ్ర నివేదిక సమర్పించాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశించారు. సమస్య ఉన్న పరిశ్రమల్లో వెంటనే ‘పొల్యూషన్ ఆడిట్’ నిర్వహించాలని, ఇందుకోసం అవసరమైన విధివిధానాలపై సూచనలు చేశారు.
100 రోజుల ప్రణాళిక, పారదర్శక పర్యవేక్షణ
మత్స్యకారుల సమస్యల పరిష్కారం, కాలుష్య నియంత్రణ కోసం రోడ్ మ్యాప్‌ను సిద్ధం చేసే ‘100 రోజుల ప్రణాళిక’ను తక్షణమే అమలు చేయాలని ఆయన సూచించారు. పరిశ్రమలు సముద్రంలోకి విడుదల చేసే వ్యర్థ జలాలపై పర్యవేక్షణలో పూర్తి పారదర్శకత పాటించాలని నొక్కి చెప్పారు. పర్యవేక్షణ బృందాలలో విద్యావంతులైన స్థానిక మత్స్యకారులకు అవకాశం కల్పించాలని పేర్కొన్నారు.
Also Read: Yash Dayal: ఆర్సీబీ స్టార్ ఆటగాడిపై 14 పేజీల ఛార్జిషీట్!
ముఖ్యమంత్రి దృష్టికి సిబ్బంది కొరత
సమీక్ష సందర్భంగా పీసీబీ అధికారులు మండలిలో సిబ్బంది కొరత సమస్యను ఉప ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు. రాష్ట్రంలో పెరుగుతున్న పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా సిబ్బంది లేరని తెలిపారు. దీనిపై స్పందించిన పవన్ కళ్యాణ్, అవసరాలకు అనుగుణంగా సిబ్బంది నియామకంపై గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో చర్చిస్తామని హామీ ఇచ్చారు. ప్రస్తుత సిబ్బందిని సమర్థంగా వినియోగించుకోవాలని సూచించారు.
కాలుష్య నియంత్రణపై పరిశ్రమలు దృష్టి సారించాలి
పారిశ్రామిక అభివృద్ధి రాష్ట్ర ఆర్థిక వృద్ధికి అవసరమైనప్పటికీ, పెరుగుతున్న పరిశ్రమలతో ప్రజల్లో, ముఖ్యంగా తీర ప్రాంత మత్స్యకారుల్లో ఆందోళనలు ఉన్నాయని పవన్ కళ్యాణ్ అన్నారు. రసాయన వ్యర్థాలు నేరుగా సముద్రంలో కలవడం వల్ల మత్స్యకారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఈ సమీక్షా సమావేశంలో రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఛైర్మన్ డా. కృష్ణయ్య, మెంబర్ సెక్రటరీ ఎస్. శరవణన్, సీనియర్ ఇంజినీర్లు, శాస్త్రవేత్తలు, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి, ఎస్పీ బిందు మాధవ్ తదితరులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లాలో కాలుష్య నియంత్రణ చర్యలు దేశానికి మోడల్‌గా నిలవాలన్న లక్ష్యాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.