CII Summit Vizag : ఈ మూడు పనులు చేస్తే ఏపీ సూపర్..చంద్రబాబుతో సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ.!
- By Vamsi Chowdary Korata Published Date - 11:37 AM, Mon - 17 November 25
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు మూడు కీలక సూచనలు చేశారు. విశాఖపట్నంలో జరిగిన సీఐఐ భాగస్వామ్య సదస్సులో కుదిరిన ఒప్పందాలు అమలు కావాలంటే సమర్థవంతమైన సింగిల్ విండో క్లియరెన్స్, భూ వివాదాల సత్వర పరిష్కారం, పర్యావరణ అనుమతులు త్వరగా రావాలని ఆయన సూచించారు. ఈ సదస్సులో రూ.13.26 లక్షల కోట్ల పెట్టుబడులు, 16.31 లక్షల ఉద్యోగాల అంచనాలతో రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వచ్చాయి.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ మూడు కీలక సూచనలు చేశారు. విశాఖపట్నంలో నిర్వహించిన సీఐఐ భాగస్వామ్య సదస్సులో వచ్చిన పెట్టుబడులపై ట్వీట్ చేస్తూ.. ఆసక్తికర అంశాలను ప్రస్తావించారు. ‘విశాఖపట్నంలో సీఐఐ భాగస్వా్మ్య సదస్సును విజయవంతంగా నిర్వహించి, పలు దేశ, విదేశీ సంస్థలతో కీలకమైన ఎంవోయూలు కుదుర్చుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు , మంత్రి నారా లోకేష్‌కు శుభాకాంక్షలు. ఒప్పందాలు చేసుకోవడమే కాదు.. ఆ తర్వాత వాటిని అమలు చేసినప్పుడు అభివృద్ధి సాధ్యమవుతుంది. సమర్థవంతమైన సింగిల్ విండో క్లియరెన్స్ వ్యవస్థ ఉండాలి. భూ వివాదాలను వీలైనంత త్వరగా పరిష్కరించాలి. పర్యావరణానికి సంబంధించిన అనుమతులు సైతం త్వరగా రావాలి. అప్పుడే విశాఖపట్నం సీఐఐ భాగస్వామ్య సదస్సులో చేసుకున్న ఒప్పందాలు అమలవుతాయి. అలా జరిగితేనే రాష్ట్రం ఆర్థికంగా అభివృద్ధి చెందుతుంది, ఉద్యోగాలు కూడా వస్తాయి’ అన్నారు.
Congratulations to @ncbn garu, @naralokesh garu and @SuchitraElla
garu for successfully hosting the CII Investment Summit in Visakhapatnam and signing several MoUs. The next big step is ensuring their grounding. A truly effective single-window clearance system, fast-tracking…— V. V. Lakshmi Narayana , A+ (JD) (@VVL_Official) November 16, 2025
విశాఖపట్నం సీఐఐ భాగస్వా్మ్య సదస్సులో రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వచ్చాయి. ఈ సదస్సులో పలు కంపెనీలు ఒప్పందాలు చేసుకున్నాయి. విశాఖపట్నంలో జరిగిన ఈ సదస్సులో మూడు రోజుల్లో 613 ఒప్పందాలు జరిగాయని చెబుతున్నారు. 12 రంగాల్లో ఏకంగా రూ.13.26 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయంటున్నారు. అంతేకాదు 16.31 లక్షల మందికి ఉద్యోగావకాశాలు వస్తాయని అంచనా వేస్తున్నారు. గూగుల్ తన డేటా సెంటర్‌ను విశాఖలో ఏర్పాటు చేయడంతో, ఇతర పెద్ద సంస్థలు కూడా ఈ రంగంలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపుతున్నాయి. రిలయన్స్, బ్రూక్‌ఫీల్డ్ సంస్థలు ఒక్కొక్కటి 1,000 మెగావాట్ల సామర్థ్యంతో డేటా సెంటర్లను నిర్మించడానికి ఒప్పందాలు చేసుకున్నాయి. ఇది విశాఖపట్నం యొక్క పారిశ్రామిక అభివృద్ధికి ఒక ముఖ్యమైన ముందడుగు.
పారిశ్రామికవేత్తలలో మరింత విశ్వాసాన్ని నింపడానికి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొన్ని కీలక నిర్ణయాలు ప్రకటించారు. వచ్చే ఏడాది కూడా, నవంబర్ 14 మరియు 15 తేదీలలో, విశాఖపట్నంలోనే ఒక సదస్సును నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ సదస్సు కోసం ప్రత్యేకంగా విశాఖ తీరంలో ‘ఆంధ్ర మండపం’ అనే పేరుతో ఒక వేదికను ఏర్పాటు చేస్తామని కూడా వెల్లడించారు. ఈ చర్యలు పెట్టుబడిదారులకు భరోసా కల్పించడమే కాకుండా, రాష్ట్రంలో పారిశ్రామిక వృద్ధిని ప్రోత్సహిస్తాయి.