కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణానికి నేను ఎప్పడు అడ్డుపడలేదు.. తెలుగు రాష్ట్రాల మధ్య ఐక్యత కావాలి సీఎం చంద్రబాబు
- Author : Vamsi Chowdary Korata
Date : 05-01-2026 - 4:31 IST
Published By : Hashtagu Telugu Desk
CM Chandrababu On Krishna, Godavari River Water తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాలపై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. గుంటూరులో ప్రపంచ తెలుగు మహాసభలకు చంద్రబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల మధ్య విద్వేషం కాదు సమైక్యత కోరుకుంటున్నానని అన్నారు. గోదావరి నదిలో పుష్కలంగా నీరు ఉందని.. ఎన్ని ప్రాజెక్టులు కట్టినా ఎవరికీ ఇబ్బంది ఉండదన్నారు. అందుకే కాళేశ్వరం ప్రాజెక్టు సమయంలో ఫర్వాలేదని అనుకున్నామని వెల్లడించారు.
రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ విషయం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా ఉన్న సంగతి తెలిసిందే. చంద్రబాబుపై ఒత్తిడి తెచ్చి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపించామంటూ అసెంబ్లీ వేదికగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ప్రకటన రెండు రాష్ట్రాల రాజకీయాలలో చర్చనీయాంశంగా మారింది. అయితే రేవంత్ రెడ్డి ప్రకటనను తోసిపుచ్చుతూ.. వైసీపీ హయాంలోనే రాయలసీమ ఎత్తిపోతల పథకం నిలిపేశారంటూ ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ విషయంపై తెలంగాణలో కాంగ్రెస్ – బీఆర్ఎస్, ఏపీలో టీడీపీ -వైసీపీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. దీనికి తోడు పోలవరం – నల్లమల సాగర్ ప్రాజెక్టు మీద అభ్యంతరం తెలుపుతూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదాలపై కీలక వ్యాఖ్యలు చేశారు.
గుంటూరులో జరుగుతున్న ప్రపంచ తెలుగు మహాసభలకు చంద్రబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. తెలుగువారంతా నీటి విషయంలో కలిసి ఉండాలని సూచించారు ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నో నీటి ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టామని.. కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్, ఏఎంఆర్, నెట్టెంపాడు ప్రాజెక్టులను పూర్తి చేశామని చంద్రబాబు చెప్పుకొచ్చారు. గోదావరి నదిపై ఎన్ని ప్రాజెక్టులు కట్టినా ఎవరికీ ఇబ్బంది ఉండదని.. తెలుగు రాష్ట్రాల మధ్య విద్వేషాలు కాకుండా సమైక్యత ఉండాలని చంద్రబాబు సూచించారు.
పోయిన సంవత్సరం సుమారుగా 6,282 టీఎంసీల నీరు.. సముద్రంలోకి వెళ్లిపోయాయి. గోదావరిలో నీళ్లు పుష్కలంగా ఉన్నాయి. అందుకే గోదావరి నీళ్లు వాడుకునేందుకు నేను ఎప్పుడూ అడ్డు చెప్పలేదు. రాష్ట్ర విభజన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినప్పుడు.. గోదావరి మీద ఎన్ని ప్రాజెక్టులకు కట్టినా ఫర్వాలేదు, మనకు నీళ్లొస్తాయని అనుకున్నాం. గత 40 సంవత్సరాలుగా 3 వేల టీఎంసీల నీరు గోదావరి నుంచి సముద్రంలోకి వెళ్లిపోతున్నాయి. పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుంది. కృష్ణా గోదావరి నదుల అనుసంధానం జరుగుతుంది.
లంగాణ వాళ్లు కూడా గోదావరి నీళ్లు వాడుకోవాలి. తెలుగు రాష్ట్రాల మధ్య విద్వేషాలు కాకుండా సమైక్యత అవసరమని భావించా. ఒకరినొకరు అర్థం చేసుకుని కలిసి ముందుకుపోవాలి. ఇంతకుమించి మాట్లాడటానికి ఇది రాజకీయ వేదిక కాదు. మిగతా విషయాలు బయట చెప్తా. నా జీవితాశయం ఒకటే.. తెలుగువారు ఐక్యంగా ఉండాలి. తెలుగు జాతి ప్రపంచంలో నంబర్ వన్ కావాలి..అని చంద్రబాబు అన్నారు.