AP : ఏపీలో విస్తారంగా వర్షాలు..పరిస్థితిపై హోంమంత్రి అనిత సమీక్ష
వర్షాభావిత జిల్లాల కలెక్టర్లతో ఫోన్‌లో మాట్లాడి వారి వద్ద నుంచి క్షేత్రస్థాయి సమాచారం సేకరించారు. అన్ని జిల్లాల్లో తక్షణమే కంట్రోల్ రూములు ఏర్పాటు చేయాలని ఆమె ఆదేశించారు. ముఖ్యంగా కృష్ణా నది పరీవాహక ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలకు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
- By Latha Suma Published Date - 01:03 PM, Thu - 28 August 25

AP : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. సహాయక చర్యలు, ప్రజల భద్రత కోసం మంత్రులు, అధికారులు సంయమితంగా స్పందిస్తున్నారు. అధికార యంత్రాంగం పూర్తిస్థాయిలో అలర్ట్ అయింది. హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. వర్షాభావిత జిల్లాల కలెక్టర్లతో ఫోన్‌లో మాట్లాడి వారి వద్ద నుంచి క్షేత్రస్థాయి సమాచారం సేకరించారు. అన్ని జిల్లాల్లో తక్షణమే కంట్రోల్ రూములు ఏర్పాటు చేయాలని ఆమె ఆదేశించారు. ముఖ్యంగా కృష్ణా నది పరీవాహక ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలకు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. పరిస్థితిని సమీక్షించేందుకు అధికారులు ప్రజల మధ్యలోనే ఉండాలని ఆమె సూచించారు.
Read Also: Jio-Airtel : వరద బాధితులకు జియో, ఎయిర్‌టెల్ సాయం..!
అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు రాష్ట్ర విపత్తు స్పందన బృందాలు (SDRF), జాతీయ విపత్తు స్పందన బృందాలు (NDRF) సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. వర్షాలతో ఇబ్బందులు కలిగించే హోర్డింగ్‌లు, రహదారులపై పడిపోయిన చెట్లను వెంటనే తొలగించాలని హోంశాఖ మంత్రి స్పష్టం చేశారు. ఇక, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ టెలికాన్ఫరెన్స్ ద్వారా తన శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. వర్షాల కారణంగా విద్యుత్ సరఫరాలో వచ్చిన అంతరాయాలను గుర్తించి, త్వరితగతిన పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తుగా ఏర్పాట్లు చేయాలని సూచించారు.
ఉత్తరాంధ్రలో కొన్ని ప్రాంతాల్లో నీటి ప్రవాహం అధికంగా ఉండటంతో భద్రతా పరంగా విద్యుత్ సరఫరా తాత్కాలికంగా నిలిపివేసినట్లు అధికారులు మంత్రికి వివరించారు. అయితే, రాష్ట్రవ్యాప్తంగా చాలా చోట్ల పెద్దగా సమస్యలు తలెత్తలేదని తెలిపారు. విద్యుత్ ప్రమాదాలు జరగకుండా ప్రజలకు ముందుగానే హెచ్చరికలు జారీ చేయాలని సూచించారు. ఇటీవల గణేష్ నిమజ్జనాలు జరగనున్న నేపథ్యంలో ఊరేగింపుల్లో పాల్గొనేవారు, నిర్వహకులు విద్యుత్ తీగల పట్ల జాగ్రత్తగా ఉండేలా చర్యలు తీసుకోవాలని మంత్రులు పేర్కొన్నారు. సిబ్బందికి అవసరమైన మార్గదర్శకాలు ఇవ్వాలని సూచించారు. వర్షాల పరిస్థితిని రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు సమీక్షిస్తోంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎటువంటి అత్యవసర పరిస్థితుల్లోనైనా కంట్రోల్ రూమ్ నంబర్లను సంప్రదించాలని అధికార యంత్రాంగం విజ్ఞప్తి చేస్తోంది.
Read Also: Mizoram : అసెంబ్లీలో ‘యాచక నిషేధ బిల్లు 2025’కు ఆమోదం