Air Pollution : రికార్డు స్థాయిలో పడిపోయిన వాయు కాలుష్యం… ఆ నగరంలో తప్ప…!
అమరావతి : గత ఏడాదితో పోలిస్తే రాష్ట్రంలో ఈ సంవత్సరం వాయు కాలుష్యం గణనీయంగా తగ్గిందని ఏపీ పోల్యూషన్ కంట్రోల్ బోర్డ్ తెలిపింది.
- Author : Hashtag U
Date : 06-11-2021 - 2:05 IST
Published By : Hashtagu Telugu Desk
అమరావతి : గత ఏడాదితో పోలిస్తే రాష్ట్రంలో ఈ సంవత్సరం వాయు కాలుష్యం గణనీయంగా తగ్గిందని ఏపీ పోల్యూషన్ కంట్రోల్ బోర్డ్ తెలిపింది. ప్రజల్లో పర్యావరణంపై అవగాహన పెరగడం, అధిక ధరల కారణంగా క్రాకర్స్ పేల్చడం తగ్గించడంవల్ల వాయు కాలుష్యం తగ్గిందని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్లో పొల్యూషన్ పర్యవేక్షణించే వ్యవస్థలు అమరావతి, తిరుమల, రాజమండ్రి, విశాఖపట్నంలో ఉన్నాయి. గతంతో పోల్చితే అమరావతి, తిరుమల, రాజమండి ప్రాంతాల్లో వాయికాలుష్యం తగ్గుముఖం పట్టగా విశాఖపట్నంలో మాత్రం స్వల్పంగా పెరిగినట్లు ఏపీ పోల్యూషన్ కంట్రోల్ బోర్డ్ తెలిపింది. విశాఖపట్నంలో పీఎం10 (పర్టిక్యులేట్ మ్యాటర్) స్థాయి గత దీపావళికి 124 ఉండగా, ఈ ఏడాది క్యూబిక్ మీటరుకు 141 మైక్రోగ్రాములకు పెరిగింది. రాజమండ్రిలో గత ఏడాది 119 మైక్రోగ్రాములు ఉండగా, ఈ ఏడాది క్యూబిక్ మీటరుకు 74 మైక్రోగ్రాములు నమోదయ్యాయి.
Also Read : 9న ఏపీ, ఒడిశా సీఎంల సమావేశం.. చర్చకు వచ్చే అంశాలివే!
తిరుమలలో వాయుకాలుష్యం 30 నుంచి క్యూబిక్ మీటర్కు 21 మైక్రోగ్రాములకు తగ్గగా, అమరావతిలో పీఎం10 స్థాయి గతేడాది 74 నుంచి 40కి పడిపోయింది. దీపావళి సందర్భంగా గురువారం రాత్రి నమోదైన వాయు కాలుష్యం స్థాయిలు చాలా తక్కువగా ఉన్నాయని, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జిటి) నిర్దేశించిన గాలి నాణ్యత పరిమితుల పరిధిలోనే ఉన్నాయని ఎపిపిసిబి సీనియర్ పర్యావరణ శాస్త్రవేత్త బివి ప్రసాద్ తెలిపారు. విజయవాడ, గుంటూరు, తిరుపతి, ఏలూరు, కాకినాడ, నెల్లూరు, చిత్తూరు, కడప వంటి ఇతర నగరాల్లో వాయు కాలుష్య స్థాయిలు డేటా మ్యానువల్గా నమోదు చేయబడతాయని తెలిపారు. ప్రభుత్వం క్రాకర్లు పేల్చడంపై కఠినమైన ఆంక్షలు విధించినందున గత సంవత్సరాలతో పోలిస్తే ఈ దీపావళికి AQI మొత్తం మెరుగుపడిందని…బాణసంచా ధరలు పెరగడం, క్రాకర్లు పేల్చే వ్యవధి తగ్గడం వల్ల వాయు కాలుష్యం తగ్గుముఖం పట్టిందని ఆయన తెలిపారు.
Also Read : జనసేనపై “విలీనం” నీడ
నాలుగు కేంద్రాల్లో రాత్రి 7 నుంచి 9 గంటల వరకు పీక్ అవర్స్లో వాయు కాలుష్య స్థాయిని కూడా ఏపీపీసీబీ విశ్లేషించింది. విశాఖపట్నంలో క్రాకర్లు పేలడం వల్ల వాయు కాలుష్యం సాయంత్రం 6 గంటలకు 652 నుండి 7 గంటలకు 786 కి చేరగా, రాత్రి 9 గంటలకు 488 కి తగ్గింది. రాజమండ్రిలో రాత్రి 8 గంటలకు 439 గరిష్ట పీఎం10 నమోదు కాగా రాత్రి 9 గంటలకు 143కి తగ్గింది. 2020లో 74గా ఉన్న AQI 40 గా నమోదైంది. ఈ ఏడాది రాజధాని ప్రాంతమైన అమరావతిలో దీపావళి వేడుకలు నిశ్శబ్దంగా జరిగాయి. దీపావళి రోజు రాత్రి వేళల్లో వాయు కాలుష్యం స్థాయి పెరగడం సర్వసాధారణమని ప్రసాద్ తెలిపారు.