Gautam Sawang: డీజీపీ టూ ఏపీపీఎస్సీ ఛైర్మన్.. గౌతమ్ సవాంగ్ కీలక వ్యాఖ్యలు..!
- By HashtagU Desk Published Date - 02:40 PM, Sat - 19 February 22

ఏపీ మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్‌ను, ఏపీపీఎస్సీ ఛైర్మన్‌గా నియమిస్తూ ఏపీ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. అంతకముందు రెండు రోజుల క్రితమే డీజీపీ పదవి నుంచి గౌతమ్ సవాంగ్‌ను తప్పించిన రాష్ట్ర ప్రభుత్వం ఆయనను ఏపీపీఎస్సీ చైర్మన్‌గా నియమించింది. పలు కారణాలతో సవాంగ్‌పై బదిలీవేటు వేసిన ప్రభుత్వం, ఆయనకు ఏపీపీఎస్సీ చైర్మన్‌గా బాధ్యతలు కట్టబెట్టడం రాష్ట్రంలో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది.
ఇక డీజీపీగా గౌతమ్ సవాంగ్ పదవీకాలం ముగియడంతో, ఈరోజు ఆయన స్థానంలో కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి కొత్త డీజీపీగా బాధ్యతలను స్వీకరించారు. ఈ క్రమంలో సవాంగ్ మాట్లాడుతూ తన 36 ఏళ్ళ సర్వీసు ఈరోజుతో ముగుస్తోందని, డీజీపీగా 2 ఏళ్ల 8 నెలల పాటు పని చేశానన్నారు. ఇక ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సూచనలతోనే, తాను రాష్ట్రంలో బాధ్యతలను నిర్వహించానని కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో పోలీసు వ్యవస్థలో పలు మార్పులు, సంస్కరణలు తెచ్చేందుకు కృషి చేశానని సవాంగ్ తెలిపారు.
ముఖ్యంగా దిశ మొబైల్ యాప్ ద్వారా కేసులు నమోదయ్యేలా చేశామని సవాంగ్ తెలిపారు. డిజిటల్‌గా ఫిర్యాదు చేసే వెసులుబాటును తీసుకొచ్చామని, ఈ క్రమంలో 36 శాతం కేసులు డిజిటల్ గానే వచ్చాయన్నారు. పోలీస్ వెబ్ సైట్ ద్వారా డిజిటల్‌గా ఎఫ్ఐఆర్ లను డౌన్‌లోడ్ చేసుకునే అవకాశాన్ని కల్పించామన్నారు. డీజీపీ కార్యాలయం నుంచి ఇన్స్‌పెక్టర్ కార్యాలయం వరకు పోలీసు వ్యవస్థలో అన్ని శాఖలను డిజిటల్‌గా అనుసంధానం చేశామని సవాంగ్ తెలిపారు. దాదాపు 75 శాతం కేసుల్లో కోర్టులు శిక్ష విధించాయని అన్నారు.
తనను డీజీపీగా కొనసాగించిన సీఎం జగన్ మోహన్ రెడ్డికి గౌతమ్ సవాంగ్ ధన్యవాదాలు తెలిపారు. జగన్ అధికారంలోకి వచ్చాక సవాంగ్‌కు అత్యధిక ప్రాధాన్యతను ఇచ్చారు. అయితే అకస్మాత్తుగా ఆయనను ట్రాన్స్‌ఫర్ చేయడంతో పోలీస్ డిపార్ట్‌మెంట్‌లోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ వర్గాల్లోనూ పెద్దఎత్తు చర్చనీయాంశంగా మారింది. ఇక 1986 బ్యాచ్‌కి చెందిన ఐపిఎస్ అధికారి అయిన గౌతమ్ సవాంగ్, తన సర్వీసులో భాగంగా పలు కీలక బాధ్యతలు చేపట్టిన తర్వాత 2019 మే 30న ఏపీ డీజీపీగా డీజీపీగా బాధ్యతలను స్వీకరించిన సంగతి తెలిసిందే. ఇక ఈ మాజీ పోలీస్ బాస్ ఈరోజు ఏపీపీఎస్సీ ఛైర్మన్‌గా బ్యాద్యతలు చేపట్టారు.