CRDA : అమరావతిలో రూ.40వేల కోట్ల పనులకు సీఆర్‌డీఏ గ్రీన్ సిగ్నల్
అమరావతి రాజధానిని చెడగొట్టేందుకు ఐదేళ్లపాటు జగన్ చేయని ప్రయత్నం లేదు. గత ప్రభుత్వం రాజధానిలో పనులు నిలిపివేసి, 2014-19లో చేసుకున్న కాంట్రాక్టు అగ్రిమెంట్లను క్లోజ్ చేయకపోవడంతో గుత్తేదారులు తీవ్రంగా నష్టపోయారు.
- By Latha Suma Published Date - 06:42 PM, Tue - 11 March 25

CRDA : ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన అసెంబ్లీలోని ఆయన ఛాంబర్‌లో సీఆర్డీఏ 45వ అథారిటీ సమావేశం జరిగింది. ఈ భేటీలో దాదాపు 70 పనులకు సంబంధించి రూ.40వేల కోట్ల విలువైన నిర్మాణ పనులకు సీఆర్‌డీఏ ఆమోదం తెలిపింది. కాంట్రాక్టు ఏజెన్సీలకు అంగీకార పత్రాలు ఇవ్వాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. లెటర్ ఆఫ్ అగ్రిమెంట్ పూర్తయ్యాక రాజధానిలో నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి. సీఆర్డీఏతో ఒప్పందాలు చేసుకున్నాక రాజధానిలో ఒకేసారి పెద్దయెత్తున పనులను ప్రారంభించేందుకు ఏజెన్సీలు సిద్ధమవుతున్నాయి.
Read Also: Orange Peels: తొక్కే కదా అని పడేయకండి.. లాభాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
ఈ సమావేశానికి మంత్రి నారాయణ , మున్సిపల్ శాఖ , సీఆర్డీఏ అధికారులు హాజరయ్యారు. సీఆర్‌డీఏ సమావేశం ముగిసిన తర్వాత మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడారు. మార్చి నెలాఖరులోపు ఈ 19 పనులకు టెండర్లు పిలుస్తాం. 31 సంస్థలకు భూ కేటాయింపులకు సంబంధించి అథారిటీ ఆమోదం తెలిపింది. అమరావతి నిర్మాణానికి ప్రజాధనం ఖర్చు పెట్టం. రూ.64వేల కోట్ల పనులకు ప్రభుత్వ నిధులను ఖర్చు చేయం. అమరావతి రాజధానిని చెడగొట్టేందుకు ఐదేళ్లపాటు జగన్ చేయని ప్రయత్నం లేదు. గత ప్రభుత్వం రాజధానిలో పనులు నిలిపివేసి, 2014-19లో చేసుకున్న కాంట్రాక్టు అగ్రిమెంట్లను క్లోజ్ చేయకపోవడంతో గుత్తేదారులు తీవ్రంగా నష్టపోయారు.
అనేక ఆటంకాలు దాటుకుని మళ్లీ పనులు మొదలవుతున్నాయి. మా ప్రభుత్వం రాగానే సాంకేతిక కమిటీ ఏర్పాటు చేసి వాటిపై చర్చించాం. 73 పనులకు సంబంధించి సీఆర్‌డీఏ అథారిటీ నుంచి అనుమతి తీసుకున్నాం. ఎన్టీఆర్ విగ్రహం, ఐకానిక్ బ్రిడ్జి, కరకట్ట రోడ్డు వంటి 19 పనులు పెండింగ్‌లో ఉన్నాయి. వాటి విలువ సుమారు రూ.16,871 కోట్లు. వీటికి సంబంధించి అంచనాలు తయారు చేశారు. బడ్జెట్‌లో పెట్టిన రూ.6వేల కోట్ల గురించి వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. ఆ పార్టీ నేతలు అన్నీ తెలుసుకుని మాట్లాడాలి అని నారాయణ అన్నారు. అమరావతి సిటీలో 6,203 ఎకరాలు సీఆర్‌డీఏకు మిగిలింది. అందులో దాదాపు 1300 ఎకరాలు వివిధ సంస్థలకు ఇవ్వబోతున్నాం. దాదాపు నాలువేల ఎకరాలు అభివృద్ధి చేసిన ల్యాండ్‌ను వేలం ద్వారా విక్రయించడం, ఇలా వివిధ మార్గాల ద్వారా రాజధాని నిర్మాణానికి నిధులు సమకూరుస్తాం. పక్కా ప్రణాళికతోనే అమరావతి నగరం అభివృద్ధి జరుగుతుందని మంత్రి నారాయణ తెలిపారు.