విజయవాడలో హోంమంత్రి అనితను కలిసిన కానిస్టేబుల్ జయశాంతి
- Author : Vamsi Chowdary Korata
Date : 22-01-2026 - 2:55 IST
Published By : Hashtagu Telugu Desk
ఇటీవల రద్దీగా ఉన్న రోడ్డుపై, చేతిలో చంటిబిడ్డతో ట్రాఫిక్ క్లియర్ చేసి అంకితభావం ప్రదర్శించిన మహిళా కానిస్టేబుల్ జయశాంతిని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత అభినందించి, సత్కరించారు. గురువారం విజయవాడలోని తన క్యాంప్ కార్యాలయంలో జయశాంతిని, ఆమె కుటుంబసభ్యులను మంత్రి స్వయంగా కలిసి ఈ సత్కారం చేశారు.
- సంక్రాంతి వేళ అంబులెన్స్‌కు దారి కల్పించిన వైనం
- మహిళా కానిస్టేబుల్ జయశాంతిని సత్కరించిన హోంమంత్రి అనిత
- విజయవాడ క్యాంప్ కార్యాలయంలో కుటుంబసభ్యులతో కలిసి సన్మానం
- పోలీస్ కుటుంబాలకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ

Constable Jayasanthi
గత సంక్రాంతి పండుగ సమయంలో కాకినాడ కెనాల్ రోడ్డుపై జయశాంతి చేసిన పని అందరి ప్రశంసలు అందుకుంది. చేతిలో చంటిబిడ్డతో ఉంటూనే ట్రాఫిక్‌ను నియంత్రిస్తూ, ఓ అంబులెన్స్‌కు దారి సుగమం చేసేందుకు ఆమె కృషి చేశారు. పైగా, ఆ రోజు ఆమె డ్యూటీలో లేరు. అయినప్పటికీ సామాజిక బాధ్యతతో ట్రాఫిక్ క్లియర్ చేశారు. ఈ విషయం తన దృష్టికి రావడంతో, మంత్రి అనిత స్వయంగా జయశాంతికి ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. ఆ సంభాషణలోనే మంత్రిని కలవాలన్న తన ఆకాంక్షను జయశాంతి వ్యక్తం చేయగా, తాజాగా ఆ కోరికను నెరవేర్చారు.

Constable Jayasanthi
ఈ సందర్భంగా మంత్రి అనిత స్పందిస్తూ “విధి నిర్వహణలో నిబద్ధతతో పనిచేసే మన పోలీస్ సోదరీమణుల పట్ల నాకు ఎప్పుడూ ప్రత్యేక గౌరవం ఉంటుంది” అని అన్నారు. రాష్ట్ర రక్షణ వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న ప్రతి పోలీస్ కుటుంబానికి కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందని ఆమె భరోసా ఇచ్చారు. ఈ మేరకు కానిస్టేబుల్ జయశాంతిని కలిసినప్పటి ఫొటోలను కూడా హోంమంత్రి అనిత పంచుకున్నారు.