Common Voter: వల్లభనేని వంశీ, కొడాలి నాని తీరుపై కామన్ మ్యాన్ ఫైర్!
మరో మాజీ మంత్రి కొడాలి నాని కూడా ఇటీవల జగన్ పర్యటనలో ఇదే తరహాలో వాహనంపై వేలాడుతూ కనిపించారు. దీనిపై కూడా అనారోగ్య వాదనలు ప్రశ్నార్థకమయ్యాయి.
- By Gopichand Published Date - 05:25 PM, Fri - 7 November 25
Common Voter: ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించిన వల్లభనేని వంశీ, కొడాలి నాని (కొడాలి వెంకటేశ్వర రావు)ల వ్యవహారంపై ‘హాష్‌ట్యాగ్ యూ’ తెలుగు ఛానెల్‌లో ఒక ‘కామన్ ఓటర్’ (Common Voter) చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా వంశీ తన అనారోగ్యాన్ని సాకుగా చూపి న్యాయస్థానం నుండి వెసులుబాటు కోరుతూనే, మరోవైపు మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి పర్యటనలో అత్యంత ఉత్సాహంగా పాల్గొనడంపై సదరు విశ్లేషకుడు తీవ్ర ప్రశ్నలు సంధించారు. కొడాలి నానిపై చేసిన అనుచిత వ్యాఖ్యలు, పాత సవాళ్లపై కూడా ఆయన మండిపడ్డారు.
అనారోగ్య వాదన
మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ దళిత నాయకుడి కిడ్నాప్, హింస కేసులతో సహా పలు తీవ్రమైన నేరారోపణలను ఎదుర్కొంటూ, దాదాపు 137 రోజులు జైల్లో గడిపి బెయిల్ పొందారు. బెయిల్ కోసం ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్నానని, కదలలేకపోతున్నానని ఆరోగ్య సమస్యలను కోర్టుకు సమర్పించారు. అంతేకాక బెయిల్ షరతుల ప్రకారం సంతకాలు పెట్టడానికి వెళ్లలేనని, తనకు వెసులుబాటు కావాలని కోర్టును ఆశ్రయించారు. దీనికి సంబంధించిన విచారణ నవంబర్ 19న జరగనుంది.
అయితే ఈ ఆరోగ్య సమస్యల వాదనకు విరుద్ధంగా ఇటీవల కృష్ణా జిల్లాలో జరిగిన జగన్ మోహన్ రెడ్డి పర్యటనలో వంశీ.. ప్రమాదకరంగా కదులుతున్న వాహనంపై ‘బాడీగార్డ్‌లా వేలాడతా’ కనిపించిన దృశ్యాలు వైరల్ అయ్యాయి. ‘కామన్ ఓటర్’ ఈ దృశ్యాలపై తీవ్రంగా స్పందిస్తూ.. “పోలీస్ స్టేషన్‌కు వెళ్లి సంతకం పెట్టలేను అని అడిగిన వంశీకి, ఇంతటి ‘గూస్‌బంప్ మూమెంట్’లో పాల్గొనడానికి మాత్రం బలం ఎక్కడి నుండి వచ్చింది? ఈ వీడియోలన్నీ నవంబర్ 19న కోర్టులో సాక్ష్యంగా వాడరా?” అని న్యాయ వ్యవస్థను ఉద్దేశించి ప్రశ్నించారు.
Also Read: Minister Uttam: అభివృద్ధి, సంక్షేమం కోసం నవీన్ యాదవ్‌కు మద్దతు ఇవ్వండి: మంత్రి ఉత్తమ్
కొడాలి నానిపై తీవ్ర విమర్శలు
మరో మాజీ మంత్రి కొడాలి నాని కూడా ఇటీవల జగన్ పర్యటనలో ఇదే తరహాలో వాహనంపై వేలాడుతూ కనిపించారు. దీనిపై కూడా అనారోగ్య వాదనలు ప్రశ్నార్థకమయ్యాయి. అంతేకాక నాని గతంలో చేసిన కొన్ని వ్యాఖ్యలపై విశ్లేషకుడు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు గెలిస్తే బూట్ పాలిష్ చేస్తానని చేసిన సవాల్‌ను ఆయన గుర్తు చేస్తూ “ఇప్పటివరకు ఎందుకు చేయలేదని” ప్రశ్నించారు. ముఖ్యంగా టీడీపీ కుటుంబ సభ్యులను ఉద్దేశించి నాని ఉపయోగించిన అసభ్యకరమైన పదజాలాన్ని తీవ్రంగా ఖండిస్తూ.. అలాంటి రాజకీయ నాయకులను ‘పబ్లిక్ న్యూసెన్స్’ గా అభివర్ణించారు. అంజనేయ స్వామి విగ్రహం, రథం తగలబడితే చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ ఆయనను మత ద్రోహిగా కూడా పేర్కొన్నారు.
న్యాయం కోసం ఆకాంక్ష
వంశీ, నానిల తీరు రాష్ట్రంలో రాజకీయ విలువలను దిగజార్చిందని, పౌరులకు చెడు సందేశాన్ని ఇచ్చిందని విశ్లేషకుడు ఆవేదన వ్యక్తం చేశారు. అనారోగ్యం పేరుతో న్యాయస్థానం నుంచి ప్రయోజనం పొందుతూనే, పబ్లిక్ ర్యాలీల్లో చురుకుగా పాల్గొన్న వీరిద్దరి తీరుపై కోర్టులు చర్యలు తీసుకోవాలని, రాష్ట్రంలో తగు న్యాయం జరగాలని ఆశిస్తూ ఆయన ఈ విశ్లేషణను ముగించారు.