CM Chandrababu: ఏపీలో మరో కొత్త పధకం అమలు, ముస్లింలకు పెద్ద పీట వేసిన చంద్రబాబు..
- By Kode Mohan Sai Published Date - 11:38 AM, Sat - 19 October 24

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త పథకం తీసుకొచ్చింది, ఇది ముస్లిం మైనారిటీ విద్యార్థుల ప్రయోజనం కోసం రూపొందించబడింది. రాష్ట్రవ్యాప్తంగా ఉర్దూ మాధ్యమ పాఠశాలల్లో ఉర్దూ భాషా ఉపాధ్యాయులు మరియు వాలంటీర్లు అందుబాటులోకి రానున్నారు. ఈ ప్రక్రియలో విద్యా వాలంటీర్ల నియామకానికి ‘చంద్రన్న మదర్సా నవీన విద్యా పథకం’ పేరుతో ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీని కోసం ప్రభుత్వం అవసరమైన చర్యలు చేపడుతుంది.
మైనారిటీ సంక్షేమశాఖ మంత్రి ఫరూక్ ఇప్పటికే విద్యావాలంటీర్ల నియామకానికి ఆమోదం ఇచ్చారు. రాష్ట్రంలో 185 మదర్సాలు ఉన్నట్లు సమాచారం, ప్రతి మదర్సాలో ముగ్గురు చొప్పున మొత్తం 555 విద్యావాలంటీర్ల నియామకానికి ప్రతిపాదనలు తయారు అయ్యాయి. ‘చంద్రన్న మదర్సా నవీన విద్యా పథకం’ అమలు కోసం ఏడాదికి 13 కోట్లు ఖర్చు అవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ పథకానికి ఆర్థికశాఖ నుంచి ఆమోదం వచ్చే దిశగా చర్యలు తీసుకోవాల్సి ఉంది.
కేంద్ర ప్రభుత్వం గతేడాది నూతన విద్యా విధానాన్ని అమలు చేస్తూ, దక్షిణాది రాష్ట్రాల్లో ఉర్దూ భాషను ప్రోత్సహించేందుకు అనుమతి ఇచ్చింది. ఈ ప్రక్రియలో, ప్రతి తరగతిలో కనీసం 15 మంది విద్యార్థులు ఉండాలి, మరియు ఉర్దూ మాధ్యమ పాఠశాలల్లో గౌరవ వేతనం కింద ఉర్దూ భాషా ఉపాధ్యాయుల నియామకానికి కేంద్రం నిధులు కేటాయిస్తోంది. అయితే, గత ప్రభుత్వ కాలంలో ఈ పథకాన్ని వినియోగించకపోవడంతో, కూటమి ప్రభుత్వం దీనికి సంబంధించి నిబంధనలను పాటిస్తూ కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది.
ఏపీలో మొత్తం 1,600 ఉర్దూ మాధ్యమ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 238 పాఠశాలల్లో ప్రతి తరగతిలో 15 మంది కంటే ఎక్కువ విద్యార్థులు ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి నివేదించింది. దీంతో, ఒక్కో ఉపాధ్యాయుడికి నెలకు 30 వేలు గౌరవవేతనం చెల్లించేందుకు 10 కోట్ల రూపాయలను కేంద్రం విడుదల చేసింది. రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన వెంటనే, అధికారులు నియామక ప్రక్రియను ప్రారంభించడానికి సిద్ధమవుతున్నారు.
2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వం మదర్సాల్లో విద్యార్థులకు నవీన విద్యను అందించేందుకు విద్యా వాలంటీర్ల నియామకాన్ని ప్రారంభించింది. అయితే, 2019లో అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం ఈ విధానాన్ని కొనసాగించలేదు. ప్రస్తుతం, ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం మదర్సాల్లో విద్యావాలంటీర్ల నియామకానికి కసరత్తు చేస్తోంది, త్వరలోనే ఈ నియామక ప్రక్రియను పూర్తిచేయనుంది. ఈ నిర్ణయంపై మైనార్టీ సమాజం హర్షం వ్యక్తం చేసింది.