TDP : నేడు తిరువూరులో చంద్రబాబు పర్యటన.. సభకు రావాలని ఎంపీ కేశినేని నానికి అధిష్టానం బుజ్జగింపులు
- Author : Prasad
Date : 07-01-2024 - 8:47 IST
Published By : Hashtagu Telugu Desk
రా కదిలిరా పేరుతో చంద్రబాబు భారీ బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. కనిగిరిలో తొలిసభతో జోష్ మీద ఉన్న టీడీపీ ఈ రోజు విజయవాడ పార్లమెంట్‌లోని తిరువూరు(ఎస్సీ) నియోజకవర్గంలో నిర్వహిస్తుంది.అధినేత చంద్రబాబు సభకు నేతలు భారీగా ఏర్పాట్లు చేశారు. నియోజకవర్గంలో టీడీపీ క్యాడర్ అంతా సభకు తరలివెళ్తున్నారు. ఇటు పార్లమెంట్‌లోని అన్ని నియోజకవర్గాల నుంచి పెద్ద సంఖ్యలో టీడీపీ కార్యకర్తలు, నేతలు తరలివెళ్లనున్నారు. దాదాపుగా లక్ష మంది సభకు హాజరవుతారని టీడీపీ నేతలు అంచనా వేస్తున్నారు. తిరువూరు పట్టణం అంతా పసుపుమయంగా మారింది. భారీ హోర్డింగులు, ఫ్లెక్సీలతో అధినేత చంద్రబాబుకు ఘన స్వాగతం పలికేందుకు తిరువూరు సిద్ధమైంది.
We’re now on WhatsApp. Click to Join.
మరోవైపు అధినేత పర్యటన సందర్భంగా మూడు రోజుల క్రితం నియోజకవర్గంలో తెలుగు తమ్ముళ్ల మధ్య గొడవ జరిగింది. సిట్టింగ్ ఎంపీ కేశినేని నానిని కాదని ఆయన సోదరుడు చిన్నిని పార్లమెంట్‌లో తిప్పుతూ ప్రోత్సహిస్తుండటంతో ఎంపీ కేశినేని నాని అసంతృప్తితో ఉన్నారు. తిరువూరు సభ ఏర్పాట్లపై సన్నాహక సమావేశంలో ఎంపీ నాని ఫోటో లేకపోవడంతో ఆయన అనుచరులు రభస చేశారు. అదే సమయంలో కేశినేని శివనాథ్(చిన్ని) కూడా అక్కడి రావడంతో పరిస్థితి గందరగోళంగా మారింది. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి వారిని చెదరగొట్టారు. ఈ ఉద్రిక్త పరిస్థితుల్లో ఎస్ఐ సతీష్ తలకు తీవ్రగాయమైంది. ఆ తరువాత ఇరు వర్గాల వారిపై పోలీసులు కేసులు పెట్టి అరెస్ట్ చేశారు.
Also Read: CM Revanth: తెలంగాణ అంతటా పారిశ్రామిక వృద్ధికి మెగా మాస్టర్ పాలసీ: సీఎం రేవంత్
ఈ వ్యవహారం అధిష్టానం సీరియస్‌గా తీసుకుంది. తిరువూరు సభ ఏర్పాట్లను చిన్నికి అప్పగించినట్లు అధిష్టానం ఎంపీ కేశినేని నానికి చెప్పింది. దీంతో ఆయన సభకు రానని.. తన అవసరం పార్టీకి లేనప్పడు తాను కూడా పార్టీలో కొనసాగలేనని తేల్చి చెప్పారు. రెండు మూడు రోజుల్లో ఆయన పార్టీకి రాజీనామా చేయనున్నారు.అయితే తిరువూరు సభకు రావాలని అధిష్టానం ఆయన్ని బుజ్జగిస్తుంది. నిన్న రాత్రి టీడీపీ రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్ ఎంపీ కేశినేని వద్దకు వెళ్లి బుజ్జగించారు. సభకు రావాలని కోరారు. అయితే ఆయన వచ్చే పరిస్థితి లేదని తేల్చి చెప్పినట్లు తెలుస్తుంది. ఈ రోజు కేశినేని భవన్ వద్ద ఎంపీ నిధులతో ఏర్పాటు చేసిన వాటర్ ట్యాంకర్ల పంపిణి కార్యక్రమంలో ఆయన పాల్గోనున్నారు.ఓ పక్క చంద్రబాబు సభ.. మరో పక్క కేశినేని నాని మీడియాతో ఏ మాట్లాడతారో అనే ఉత్కంఠ టీడీపీ క్యాడర్‌లో నెలకొంది.