Daggubati Purandeswari: బీజేపీ, జనసేన పొత్తు.. పవన్‌పై పురంధేశ్వరి షాకింగ్ కామెంట్స్..!
- By HashtagU Desk Published Date - 02:41 PM, Wed - 6 April 22

ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం బీజేపీ, జనసేన కూటమిగా ఏర్పడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా మాజీ కేంద్ర మంత్రి పురంధేశ్వరి చేసిన వ్యాఖ్యలు రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్ అవుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో బీజేపీ, జనసేనలు వారి వారి కార్యక్రమాలు వేర్వేరుగా చేసుకుంటున్నా, పొత్తు కొనసాగుతుందని వచ్చే ఎన్నికల్లో కలసి పోటీ చేస్తామని, మిత్రుడిగా పవన్ కళ్యాణ్ తమతో చర్చలు జరిపితే తాము కూడా స్పందిస్తామని పురంధేశ్వరి చెప్పారు.
ఇక రాష్ట్ర ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వం పాలన చాలా దారుణంగా ఉందని పురంధేశ్వరి అభిప్రాయపడ్డారు. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రయివేటీకరణపై వైసీపీ నాయకులకు మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. అయితే తాము రాష్ట్ర పార్టీగా విశాఖ ఉక్కు విషయంలో ఇక్కడి సెంటిమెంట్‌ను కేంద్రంలోని పెద్దలకు వివరిస్తామని చెప్పారు. పెట్రోలు, డీజిల్ ఛార్జీలు కొన్ని అనివార్య కారణాలతో పెరుగుతున్నాయని, అయినా కేంద్ర ప్రభుత్వం తన వంతు బాధ్యతగా ధరలను తగ్గించిందని పురంద్రీశ్వరి చెప్పారు. వైసీపీ ప్రభుత్వం ఎప్పుడెప్పుడు దిగి పోతుందా అని ప్రజలు ఎదురుచూస్తున్నారని పురంధేశ్వరి అన్నారు.
ప్రస్తుతం ఏపీలో బలపడేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని, 2024 ఎన్నికల నాటికి వైసీపీకి ధీటుగా బీజేపీ ఎదుగుతుందని పురంధేశ్వరి జ్యోస్యం చెప్పారు. ఇక దేశాభివృద్ధిలో భాగంగా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందని, అలాంటి నిర్ణయాల వల్ల స్వల్పకాల నష్టాలు ఉంటాయని, అయితే అవి దీర్ఘకాలంలో అభివృద్ధికి సోపానాలుగా ఉంటాయని పురంధేశ్వరి అన్నారు. ఆ విషయాన్ని దేశ ప్రజలు గుర్తించారు కాబట్టే, ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో నాలుగు రాష్ట్రాలను కైవశం చేసుకున్నామన్నారు.
ఇక దక్షిణాదిలో కూడా బీజేపీ తన ఉనికిని చాటుకుంటుందని, ఇప్పటికే కర్నాటకలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగా, తెలంగాణలో టీఆర్ఎస్‌కు త్వరలోనే చెక్ పెట్టబోతున్నామని, వచ్చే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో కూడా బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని పురంధేశ్వరి తెలిపారు. ఇక కేరళ, ఆంధ్రప్రదేశ్‌లో మరింత బలపడతామని పురంధేశ్వరి స్పష్టం చేశారు. మరి పురంధేశ్వరి వ్యాఖ్యలపై పార్టనర్ పవన్ కళ్యాణ్ స్పందన ఎలా ఉంటుందో, వైసీపీ నేతల నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందో చూడాలి. ఏది ఏమైనా ఏపీలో అన్ని రాజకీయపార్టీలు 2024 అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటేందుకు ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నాయి.