AP BJP : ఆంధ్రప్రదేశ్ లో బి.జె.పి. ఆట మొదలు పెట్టిందా..?
కేంద్రంలో అధికారంలో ఉన్న BJP ఆయా రాష్ట్రాలలో తమకు ఎవరు కీలకమైన మద్దతుదారులో వారికి చేరువుగా ఉండడం మామూలు విషయమే.
- By Hashtag U Published Date - 12:43 PM, Thu - 31 August 23

By: డా. ప్రసాదమూర్తి
BJP Game in Andhra Pradesh : కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ఆయా రాష్ట్రాలలో తమకు ఎవరు కీలకమైన మద్దతుదారులో వారికి చేరువుగా ఉండడం మామూలు విషయమే. కానీ ఆంధ్రప్రదేశ్ లో బిజెపి ఆట చాలా వింతగా కొనసాగుతోంది. అక్కడ అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీ, మరో ప్రతిపక్షంగా బలమైన శక్తిగా ఎదిగిన పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ.. ఈ మూడింటితో ఏకకాలంలో సత్సంబంధాలు కొనసాగిస్తూ బిజెపి (BJP) ఒక కొత్త ఆట ఆడుతోంది. ఈ ఆట పరిణామాలు ఎలా ఉంటాయో తెలియదు. కానీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాను బిజెపితోనే ఉన్నట్టు ఇప్పటికే చాలాసార్లు స్పష్టం చేశారు. అయితే రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా తన శాయశక్తులా ప్రయత్నం చేస్తానని ఆయన మాటిమాటికి చెప్తూ వస్తున్నారు. ఆ మాటకు అనుగుణంగా ఆయన తెలుగుదేశం అధినేత చంద్రబాబుతో సంబంధాలు కొనసాగిస్తున్నారు. అనేక అంశాల మీద ఉమ్మడిగా కూడా కదులుతున్నారు.
పవన్ కళ్యాణ్ చంద్రబాబును కలుపుకొని బిజెపితో పొత్తు కొనసాగించాలని వ్యూహరచన చేస్తున్నట్టు మనకు చాలాకాలంగా అర్థమవుతోంది. అయితే చంద్రబాబు మాత్రం బిజెపికి తన దూరాన్ని కొనసాగిస్తూనే వస్తున్నాడు. అదే సమయంలో వైఎస్ఆర్సీపి తో కూడా బిజెపి (BJP) తన దగ్గరి బంధాన్ని వదులుకోవడానికి సిద్ధంగా లేదు. అంతేకాదు, బీజేపీ ఈ మూడు పార్టీలతో తన అనుబంధాన్ని ఎక్కడా తెంచుకోకూడదనేది పక్కా పథకంతో ఉన్నట్టు తెలుస్తోంది. వైఎస్ఆర్సిపి తో బిజెపి అనుబంధం బహిరంగ రహస్యమే. జగన్ కేసుల విషయంలో గానీ అవినాష్ రెడ్డి అరెస్టు విషయంలో గానీ కేంద్రం అనుసరిస్తున్న మెతక వైఖరి అందరికీ తెలిసిందే.
అలాగే పవన్ కళ్యాణ్ ఎలాగూ తమతోనే ఉన్నాడని, చంద్రబాబు నాయుడు కూడా తమ కనుసన్నల్లో ఉంటే మంచిదని బిజెపి ఒక ఒక వ్యూహాత్మక ఆలోచనలో ఉంది. రానున్న సార్వత్రిక ఎన్నికలలో ఉత్తరాదిన తమకు బలం ఏ మాత్రం తగ్గినా, దాన్ని దక్షిణాదిన పూడ్చుకోవాలన్నదే బిజెపి ఎత్తుగడ. ఆ క్రమంలోనే తెలంగాణలో కేసీఆర్ తో పరోక్ష బంధాన్ని పటిష్టం చేసుకుంటున్న విషయం ఇప్పుడు ఒక ఓపెన్ సీక్రెట్. ఆంధ్రప్రదేశ్లో కూడా ఎవరు గెలిచినా ఎవరు ఓడినా వారి మద్దతు గుత్తంగా కేంద్రంలో తమకు ఉండాలంటే ఏపీలో ప్రధాన పక్షాలన్నింటినీ తమకు దగ్గరగా ఉంచుకోవాలన్నదే బిజెపి వ్యూహం.
2018లో ఎన్డీఏ నుంచి చంద్రబాబు దూరమయ్యారు. ఏపీకి స్పెషల్ స్టేటస్ విషయంలో ఆయన ఎన్డీఏ నుంచి తప్పుకున్నారు. అలాగే 2019లో కాంగ్రెస్ తో, ఇతర విపక్షాలతో జతకట్టి పరాజయం పాలయ్యారు. అప్పటినుంచి ప్రతిపక్షాలకు, బిజెపికి చంద్రబాబు సమదూరం పాటిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబును ఎలా తమ కక్ష్యలోకి ప్రవేశపెట్టాలి అన్న విషయం లో బిజెపి (BJP) మేథోమథనం సాగించింది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, ప్రజానాయకుడు, గొప్ప నటుడు అయిన ఎన్టీఆర్ కుటుంబంతో సత్సంబంధాలు నెలకొల్పితే సరిపోతుందన్నది బిజెపి తాజా ప్రణాళిక.
ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ లో బిజెపి అధ్యక్ష పదవిని ఎన్టీఆర్ కుటుంబానికి చెందిన పురందేశ్వరికి కట్టబెట్టడాన్ని చూడాలి. అంతేకాదు ఎన్టీఆర్ శతజయంతిని పురస్కరించుకొని ఆయన పేరు మీద ఇటీవల రాష్ట్రపతి భవన్ లో కేంద్ర ప్రభుత్వం ఒక ప్రత్యేక నాణేన్ని విడుదల చేసింది. ఈ సందర్భంగా జరిగిన వేడుకలో చంద్రబాబు నాయుడు కూడా పాల్గొన్నారు. అదే సందర్భంలో బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అత్యంత గోప్యంగా నిర్వహించిన ఒక సమావేశంలో కూడా చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సమావేశంలో పురంధేశ్వరి, ఆమె భర్త, మాజీ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వరరావు కూడా పాల్గొన్నారు.
మీడియాతో చంద్రబాబు మాట్లాడినప్పుడు బీజేపీ తెలుగుదేశం పార్టీల మధ్య ఒప్పందం కుదిరిందా? అన్న ప్రశ్న ఎదురైతే, తగిన సమయంలో ఒప్పందం విషయం ఆలోచిస్తామని చెప్పి చంద్రబాబు తప్పించుకున్నారు. ఈ సమావేశం పట్ల వైసిపి వర్గాలు మాత్రం తీవ్రమైన విమర్శా బాణాలు ఎక్కు పెడుతున్నాయి. కథ మొత్తం పురంధేశ్వరి నడుపుతున్నట్టు వారు వ్యాఖ్యానిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఆంధ్రప్రదేశ్లో బిజెపి ఎవరి పక్షాన కూటమిలో పాల్గొన్నా ఆ పక్షానికి అదనంగా చేకూరే బలం ఏమీ లేదు అన్నది అన్ని పక్షాలకు తెలిసిన విషయమే. కానీ కేంద్రంలో బిజెపి అధికారానికి అతి చేరువుగా ఉన్నప్పుడు ఆంధ్ర ప్రదేశ్ నుంచి ఎలాంటి సహాయం అవసరమైనా అక్కడ అన్ని పక్షాల నుంచి ఆ మద్దతు రావాలన్నది బిజెపి ఆలోచనగా అర్థం అవుతుంది.
అయితే చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బిజెపితో కలిసి కూటమి కడితే వామపక్షాలు, కాంగ్రెస్ తదితర పార్టీలు ఆ కూటమికి దూరమవుతాయి. అలాగే ఏపీకి బిజెపి అన్యాయం చేసిందని చాలామంది ఆంధ్రుల మనసులో ఉన్న అభిప్రాయం కూడా చంద్రబాబు దృష్టిలో ఉంది. ఈ నేపథ్యంలో బిజెపి చంద్రబాబు వైపు చేతులు చాపినా, చంద్రబాబు ఎలాంటి ఎత్తులకు పొత్తులకు వెళతారనేది పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు సార్వత్రిక ఎన్నికలతో పాటు మరో ఎనిమిది నెలల్లో జరగనున్నాయి. ఈ లోగా చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాల్సి ఉంది. ఏది ఏమైనా చంద్రబాబు మాత్రం ఎన్నికలకు ముందు బిజెపితో పొత్తుకు సుముఖంగా ఉంటారని మాత్రం చెప్పలేం. ఎన్నికల తర్వాత గెలుపోటములు, బలాబలాలు బేరీజు వేసుకొని, అప్పుడు చంద్రబాబు ఒక నిర్ణయాన్ని తీసుకునే అవకాశం ఉన్నట్టు విశ్లేషకులు భావిస్తున్నారు.
Also Read: Modi : మోదీకి 80 శాతం ఆమోదం.. మరి విపక్షాల మాటేమిటి?